.. అనే నేను
కై లాస్‌నగర్: జిల్లాలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లతో పాటు వార్డుమెంబర్లుగా ఎన్నికై న వారంతా మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నూతన పాలకవర్గాలకు స్వాగతం పలికేలా పలు చోట్ల పంచాయతీ భవనాలకు కార్యదర్శులు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. అయితే కొత్త పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో అంగన్‌వాడీలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక పంచాయతీలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల వాటిని కూడా అలంకరించారు. సోమవారం ఉదయం 10గంటలకు జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రమాణ స్వీకార ప్రక్రియ షురూ కానుంది. పంచాయతీరాజ్ ఏఈలు, ఈజీఎస్ ఏపీవోలు, హౌసింగ్ ఏఈలు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీవోలు, పీజీ హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ వంటి వారిని పంచాయతీకో ప్రత్యేకాధికారిగా నియమించారు. తొలుత సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఉపసర్పంచ్‌లు, వార్డుమెంబర్లు అక్షరమాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పలుచోట్ల నిర్వహించనున్న కార్యక్రమాలకు ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువు దీరినట్లవుతుంది. సర్పంచ్‌ల పాలన అందుబాటులోకి రానుంది. అలాగే పెండింగ్ నిధులు కూడా విడుదల కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


