● పత్తి విక్రయాల్లో అక్రమాలు ● సీసీఐ కొనుగోళ్లపై ఇటీవల
ఆదిలాబాద్‌టౌన్: పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. దళారులు, వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అనంతరం సీసీఐకి మద్దతు ధరతో విక్రయించి లబ్ధి పొందుతున్నారు. కొంత మంది మార్కెటింగ్, సీసీఐ అధికారులు వారితో కుమ్మక్కు కావడంతోనే ఈ తతంగం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ మార్కె ట్, జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేశారు. తూకం, తేమశాతం విషయంలో రైతులు మోసపోతున్న తీరును గుర్తించారు.
కొనుగోళ్లలో అక్రమాలు..
పత్తి కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిఘా పెట్టింది. ఇటీవల జిల్లాలో తనిఖీలు చేపట్టారు. పలు లోపాలను గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. గతేడాది కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఇద్దరు వ్యవసాయ, మార్కెట్ అధికారులపై వేటుపడిన విషయం తెలిసిందే. తా జాగా ఈఏడాదికి సంబంధించి జిన్నింగ్ మిల్లులు, సీసీఐ అధికారుల పాత్రపై ఆరా తీశారు. అయితే సాంకేతికత ఉపయోగించినా అక్రమాలకుపాల్పడు తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల పేరిట విక్రయాలు..
దళారులు రైతుల పేరిట విక్రయాలు జరిపి అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7లక్షల 10వేల వరకు కొనుగోలు చేయగా, సీసీఐ 30వేల క్వింటాళ్లను కొనుగోలు చేసింది. ప్రైవేట్‌లో పత్తికి ధర లేకపోవడంతో రైతులు సీసీఐకి విక్రయిస్తున్నారు. అయితే సీసీఐ అధికారులు తేమ పేరిట కొర్రీలు పెట్టడంతో గత్యంతరం లేక కొంత మంది ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు జరుపుతున్నారు. ఆ పత్తినే వాహనాల్లో నింపి యార్డులకు తీసుకొచ్చి సీసీఐకి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. రైతుల పట్టాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
అధికారుల్లో గుబులు..
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మార్కెట్‌లో తనిఖీలు చేపట్టడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. గతేడాది ఓ ఏవోతో పాటు వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కౌలు రైతుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు పత్రాలు జారీ చేయడం, కొంత మంది రైతుల పేరిట వ్యాపారులు వందల క్వింటాళ్లు సీసీఐకి పత్తిని విక్రయించారు. ఈ ఏడాది కూడా దళారులు రైతుల పట్టాలు తీసుకొచ్చి పత్తిని విక్రయిస్తుండడం గమనార్హం. ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీ సమయంలో కాంటాలు, సీసీ కెమెరాలు, ప్రైవేట్, సీసీఐ కొనుగోళ్లు, రైతులకు జరుగుతున్న మోసాలు, తదితర వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించారు. నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
● పత్తి విక్రయాల్లో అక్రమాలు ● సీసీఐ కొనుగోళ్లపై ఇటీవల


