
రేషన్‌కార్డుల్లో మార్పు, చేర్పులపై విచారణ షురూ
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డుల జారీతో పాటు కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించేలా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈమేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీగా అప్లికేషన్లు వెల్లువెత్తాయి. ఇందులో అర్హులైన వారిని గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా అధికారులు మంగళవారం ఆ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎండీ. వాజీద్ అలీ, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దా ర్ సంపతి శ్రీనివాస్ పట్టణంలోని విద్యానగర్‌లో అర్హుల గుర్తింపు విచారణ చేపట్టారు. దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ప్రత్యేక యాప్‌లో వివరాలను నమోదు చేశారు. మార్పులు, చేర్పులతో పాటు కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్నట్లు అధి కారులు పేర్కొన్నారు.