
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
దిలావర్‌పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రామ సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మృతుడు రోడ్డు మార్గంలో వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొన్ని రోజులుగా సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ సమీపంలో మతిస్థిమితం లేకుండా సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఉపాధ్యాయులకు ఉచితంగా సార్ సినిమా
నిర్మల్‌రూరల్: లెక్చరర్ నేపథ్యంలో తెరకెక్కిన సార్ సినిమాను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉచితంగా ప్రదర్శించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాల్‌లకు ఈ సినిమాను ఉదయం 8 నుంచి 10:30 వరకు జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. బుధవారం ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాల లెక్చరర్లకు ఈ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు.
సెల్‌ఫోన్ చోరీ
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చి చైన్‌ను దొంగతనం చేసిన విషయం మరువకముందే.. నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తి జేబులోంచి సెల్ ఫోన్‌ను చోరీ చేసిన ఘటన పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ వివరాల ప్రకారం... పట్టణ ంలోని జైజవాన్‌నగర్‌కు చెందిన షేక్ మోయిన్ తన బంధువుతో కలిసి పంజాబ్ చౌక్ నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు జేబులో నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు. దీని విలువ రూ.10వేల వరకు ఉంటుందని, దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై పేర్కొన్నారు.