
వడపోత పక్కానేనా..!?
● ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు కొనసాగుతున్న ప్రక్రియ ● ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఎన్‌వోసీలపై ఆరా.. ● బడా ఏజెన్సీల తీరుపై విమర్శలు
సాక్షి,ఆదిలాబాద్: ‘ఎక్స్’ అనే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంప్యానల్‌మెంట్‌లో గుర్తింపు పొంది ఉంది. ఆయా జిల్లాల్లో వివిధ శాఖల్లో వర్క్ ఆర్డర్ పొంది ఉద్యోగుల నిర్వహణ చేస్తుంది. అయితే ఒకట్రెండు జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు చేసిన సదరు ఏజెన్సీ మిగతా జిల్లాల్లో మాత్రం విస్మరించింది. చెల్లింపు చేసిన శాఖల నుంచి ఎన్‌వోసీ తీసుకొని ఆ పత్రాలను వేరే జిల్లాల్లో దరఖాస్తుతో జత పరిచారు. తద్వారా ఏజెన్సీ ఇతర జిల్లాల్లోని అక్రమ బాగోతం పైకి కనిపించకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో కొత్త ఎంప్యానల్‌మెంట్ కోసం అనేక దరఖాస్తులు రాగా, ఆ ఏజెన్సీల అ సలు బాగోతాలను సూక్ష్మంగా పరిశీలించాలన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది.
కొనసాగుతున్న పరిశీలన..
జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. 32 దరఖాస్తులు విక్రయించగా, 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. కాగా గత 14వ తేదీన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ టెండర్ తెరిచారు. అందులో ఒక ఏజెన్సీ వివిధ సర్టిఫికెట్లు లేని కారణంగా తిరస్కరణకు గురైంది. మిగతా 28 ఏజెన్సీలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇందులో దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల్లో కొన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంప్యానల్‌మెంట్‌లో గుర్తింపు కలిగి ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు చేసినప్పటికీ పలు జిల్లాల్లో వాటిని చెల్లించకుండా ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాశారనే అపవాదు ఉంది. అయితే ఏయే జిల్లాలోనైతే ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించారో ఆ సర్టిఫికెట్లను ఈ కొత్త ఎంప్యానల్‌మెంట్‌లో చోటు కోసం దరఖాస్తుతో పాటు జతచేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఏయే జిల్లాలోనైతే ఎంప్యానల్‌మెంట్‌లో చోటు కలిగి ఉన్నాయో, అక్కడ ఏయే శాఖల్లో వర్క్ ఆర్డర్ కలిగి ఉన్నాయో, అన్నింటి నుంచి ఎన్‌వోసీలను సూక్ష్మంగా పరిశీలించాలని పలు ఏజెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. కొంత మంది బడా ఏజెన్సీలు అధికారులను మచ్చిక చేసుకొని ఇలాంటి బాగోతాలను తెరపైకి రానివ్వకుండా చూసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. జిల్లాలో కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటులో ఉన్నతాధికారులు పారదర్శకంగా వ్యవహరించి అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీలనే పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వారి ప్రయోజనాలు పూర్తిగా దక్కేలా అధికారులు చూడాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.
సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నాం..
కొత్త ఎంప్యానల్‌మెంట్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ప్రస్తుతం లేబర్, కాంట్రాక్ట్ లైసెన్స్‌ల పరిశీలన చివరి దశలో ఉంది. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, జీఎస్టీ ఇలా అన్ని అంశాల్లో ఏజెన్సీలకు సంబంధించి ఏయే జిల్లాల్లోనైతే వారు వర్క్ ఆర్డర్ పొంది ఉద్యోగుల నిర్వహణ చేస్తున్నారో ఆయా జిల్లాల్లో నుంచి శాఖల వారీగా ఎన్‌వోసీలను పరిశీలన చేస్తున్నాం. కమిటీ ఆధ్వర్యంలో అన్ని అంశాలను లోతుగా పరిశీలన చేసి లిస్టును ఫైనల్ చేయడం జరుగుతుంది. జాబితా పెట్టిన తర్వాత ఇతర ఏజెన్సీల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు ఒకట్రెండు రోజులు గడువు కూడా ఇస్తాం.
– మిల్కా, ఉపాధికల్పన శాఖ ఇన్‌చార్జి
జిల్లా అధికారి