
117 జీవో రద్దుపై హామీని మరిచిన ప్రభుత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రాథమిక పాఠశాలల భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న 117 జీవోను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించడం తగదని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్. జోసఫ్ సుధీర్‌బాబు పేర్కొన్నారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్‌లో సోమవారం జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. జోసఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎంతో కీలకమైన జీవో 117 రద్దు గురించి ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ వేతన సవరణపై గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీని రద్దు చేసిన ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేయలేదని తెలిపారు. పాత పీఆర్సీ గడువు దాటి ఏడాది గడించిందన్నారు. తక్షణమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2022 ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను విడుదల చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఎస్టీయూ తరఫున భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జిల్లా గౌరవాధ్యక్షుడు ఏవీ ప్రసాద్‌బాబు, రాష్ట కౌన్సిలర్ డీఏ జోసఫ్, షేక్ బాజీ, జిల్లా అసోసియేట్ అధ్య క్షుడు వై. శ్యాంబాబు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.