
పక్కాగా ‘ఫ్యామిలీ డిజిటల్’ సర్వే
● సర్వేతో కుటుంబాల సంఖ్య నిర్ధారణ ● సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్, కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ కార్డు సర్వే పక్కాగా జరగాలని, దీని ఆధారంగానే కుటుంబాల సంఖ్య తేలుతుందని సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో చేపట్టిన సర్వే వివరాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో 1,127 కుటుంబాలు ఉంటాయని రికార్డులు చెబుతుంటే, 1,700 వరకు కుటుంబాలు ఉండొచ్చని జిల్లా యంత్రాంగం భావించగా.. వాస్తవంగా 2,047 కుటుంబాల వివరాలను సర్వే ద్వారా సేకరించారని వివరించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఫొటోలే ప్రామాణికం కాకుండా వివరాలను పక్కగా నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈవో నరేందర్, ఆర్డీవో గంగయ్య తదితరులు పాల్గొన్నారు.