breaking news
World tailors Day
-
టైలరన్నలకు ‘రెడీమేడ్’ దెబ్బ
ధరించే దుస్తులతోనే మనిషికి అందం.. హుందాతనం లభిస్తాయి. వస్త్రానికి ఒక ఆకృతిని ఇచ్చి కళాత్మకంగా తీర్చిదిద్దేది దర్జీలే.. ప్రస్తుతం వారికి ఆదరణ తగ్గిపోయింది. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు (Readymade Garments) విపరీతంగా రావడంతో జనం వాటి పట్ల మక్కువ చూపుతున్నారు. దానితో టైలర్లకు ఉపాధి కరువైంది. గతంలో పండగలు, పర్వదినాలు, శుభకార్యాల సమయంలో చేతినిండా పనితో బిజీగా ఉండే దర్జీలు (Tailors) నేడు పనులు లేక వారి కుటుంబాల పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 5,478 మంది టైలర్లు ఉన్నారు. చిన్న గదుల్లో షాపులు పెట్టుకుని వచ్చే అరకొరమందికి దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.ఒకప్పుడు ప్రతీ పండగకు ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ తదితర పండగలకు, పలు పర్వదినాలకు, కుటుంబాల్లో వివిధ శుభకార్యాలకు ఇంటిల్లిపాదీ కొత్త వస్త్రాలు తెచ్చుకుని కుట్టించుకునేవారు. ఆయా పండుగలకు నెల ముందు నుంచే టైలర్లకు పని ఎక్కువగా ఉండేది. భోజనం చేసే తీరిక కూడా లేకుండా పనిచేసేవారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. దుస్తులు కుట్టించుకునేవారే కరవయ్యారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకొక ఫ్యాషన్‌తో దుస్తులను ఫ్యాక్టరీల్లో తయారుచేసి మార్కెట్లోకి దించుతున్నారు. దీంతో ఆ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కువ మంది అప్పటికప్పుడు ఆ దుకాణాలకు వెళ్లి తమకు కావలసిన దుస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టైలర్లు పనులు లేక ఆ వృత్తిని వదిలేసి బతుకు జీవుడా అంటూ ప్రత్యామ్నాయ వృత్తులు వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు.గతంలో ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపనులు తగ్గిపోయి కష్టాల్లో నలిగిపోతున్న టైలర్లను గత వైఎస్సార్ సీపీ (YSRCP) ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. చేతి వృత్తుల వారి కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పించింది. దానిలో భాగంగా ప్రతీ టైలర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం చేసింది. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 5,478 మంది టైలర్ల లబ్ధి పొందారు. ఈ విధంగా ఏడాదికి సుమారు రూ.5.48 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసేవారు. అంతేకాక ప్రతీ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాం క్లాత్ అందచేసి, దుస్తుల కుట్టుకూలీ డబ్బులను కూడా చెల్లించేది. ఆ విధంగా కూడా టైలర్లకు ఉపాధి లభించేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టైలర్ల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే టైలర్లకు చేయూతనిస్తే ఆర్థిక తోడ్పాటుతో పాటు యూనిఫాం దుస్తుల ద్వారా కొంతవరకై నా ఉపాధి లబిస్తుందని టైలర్లు అభిప్రాయపడుతున్నారు.నేడు ప్రపంచ టైలర్స్ దినోత్సవంఏటా ఫిబ్రవరి 28న కుట్టుమెషీన్ సృష్టికర్త విలియమ్ ఎలియాస్ హోవే జయంతిని ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) గా జరుపుకుంటున్నారు. దర్జీ చేతి పనిని, వస్త్ర పరిశ్రమలో వారిని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. కుట్టుమెషీన్‌ను కనిపెట్టి తమ జీవనానికి దారి చూపిన విలియమ్ పట్ల విశ్వాసం, గౌరవంతో నియోజకవర్గ కేంద్రం కొత్తపేటలో టైలర్స్ కొన్నేళ్ల క్రితం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా ప్రపంచ టైలర్స్ డే (World Tailors Day) నాడు విలియమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పిస్తారు.చదవండి: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్ఇదే జీవనాధారంటైలరింగ్ పనిమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. రెడీమేడ్ దుస్తుల రాకతో వస్త్రం కొనుగోలు చేసి కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తి రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. కుట్టు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం చేతి వృత్తిదారులను ఆదుకోవాలి. విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఇస్తే టైలర్లకు కొంతవరకై నా పని దొరుకుతుంది.– అవిడి వీరవెంకట సత్యనారాయణ, టైలర్, కొత్తపేట -
దర్జీ బతుకుల్లో దర్జా మాయం
సాధారణ వస్త్రాన్ని కత్తిరించి, కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు.. ఆ దుస్తులు మనిషికి దర్జాను తీసుకువస్తాయి. ఇలా ఓ మనిషికి డ్రెస్సులతో హుందాతనాన్ని తీసుకువస్తున్న దర్జీల బతుకుల్లో మాత్రం దర్జా మాయమవుతోంది. రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువైంది. కుల వృత్తినే నమ్ముకున్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది బతుకుదెరువుకోసం గల్ఫ్‌బాట పడుతున్నారు. కొందరు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. ఆదివారం వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా దర్జీల స్థితిగతులపై ‘సాక్షి’ కథనం.. ♦ రెడీమేడ్ దుస్తుల రాకతో టైలర్లకు కష్టాలు ♦ ఉపాధి లేక బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట ♦ నేడు ప్రపంచ టైలర్స్ డే మోర్తాడ్/బాన్సువాడ/చంద్రశేఖర్‌కాలనీ/ నిజామాబాద్ రూరల్ /జక్రాన్‌పల్లి/ఆర్మూర్ అర్బన్/కమ్మర్పల్లి/నిజాంసాగర్: గతంలో మేరు కులానికి చెందిన వారు మాత్రమే దర్జీ వృత్తిని చేపట్టేవారు. పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేది. తిందామన్నా తీరిక ఉండేది కాదు. కాల క్రమంలో ఇతర కులాల వారూ దర్జీ వృత్తిని స్వీకరించడంతో మేరులకు పని తగ్గింది. రెడీమేడ్ దుస్తుల రాకతో పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా బట్టలు కుట్టే నేర్పు ఉన్నా.. రెడీమేడ్ దుస్తుల వల్ల వారికి ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఒక డ్రెస్ కుట్టడానికి అయ్యే కూలి ధరలోనే రెడీమేడ్ దుస్తులు లభిస్తుండడంతో.. చాలా మంది వాటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో దర్జీలకు ఉపాధి తగ్గిపోయింది. పండుగల సమయంలోనూ గిరాకీ ఉండడం లేదు. చేయడానికి పనిలేకపోవడంతో పలువురు దర్జీ వృత్తిని వదులుకుని బతుకుదెరువుకోసం గల్ఫ్ బాటపట్టారు. గల్ఫ్ దేశాలలో భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మన్లుగా, కార్మికులుగా పని చేయడానికి వెళ్తున్నారు. కొందరు కుల వృత్తిని వదులుకోలేక స్థానికంగానే ఉంటున్నారు. టైలర్స్ డే చరిత్ర ఇది.. కుట్టు మిషన్ లేని రోజులలో షర్టు, ప్యాంట్లను కాస్త అటుఇటుగా చేతితోనే కుట్టేవారు. జర్మన్ దేశానికి చెందిన విలియమ్స్హో అనే శాస్త్రవేత్త 1916లో కుట్టుమిషన్లను కనుగొన్నారు. ఆయన ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన జన్మదినాన్ని టైలర్స్ డే గా నిర్వహిస్తున్నారు. ప్రోత్సాహం కరువు.. టైలరింగ్ వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని దర్జీలు ఆరోపిస్తున్నా రు. కార్పొరేషన్ల ద్వారా అంతంత మాత్రంగానే రుణాలిస్తోంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని దర్జీలు కోరుతున్నారు. రెడీమేడ్ ప్రభావంతో.. ముప్పై ఎండ్ల నుంచి టైలర్‌గా పనిచేస్తున్నాను. గతంలో మాకు గిరాకీ బాగుండేది. ఇప్పుడు విద్యార్థులు, యువకులు రెడీమేడ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు తప్ప మిగతా వాళ్లు టైలర్ షాప్‌ల వైపు రావడం లేదు. - హన్మండ్లు, దర్జీ, మహమ్మద్‌నగర్ పండుగకూ గిరాకీలేదు.. నేను నలభై ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో ఉన్నాను. గతంలో పండుగలు వచ్చాయంటే మాకు తీరిక దొరికేది కాదు.. దసరా పండుగకు రెండు నెలల ముందునుంచే సీజన్ ప్రారంభమయ్యేది. బట్టలు కుట్టించుకోవడానికి ప్రజలు వరుసకట్టేవారు. పండుగకు పది రోజుల ముందు నుంచే కొత్త ఆర్డర్ తీసుకోకపోయేవాళ్లం. ఇప్పుడు అంతా రెడీమేడ్ దుస్తులే కొంటున్నారు. స్కూల్ యూనిఫామ్స్ కూడా రెడీమేడ్వే కొంటున్నారు. మాకు పని బాగా తగ్గిపోయింది. గతంలో నా వద్ద ఒకేసారి ఏడేనిమిది మంది టైలరింగ్ నేర్చుకునేవారు. మా షాప్‌లో ఐదారుగురు వర్కర్లు పనిచేసేవారు. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. - చిలివేరి లక్ష్మణ్, దర్జీ, కమ్మర్పల్లి కుల వృత్తి కూడు పెట్టడం లేదు.. మా కుటుంబం తరతరాలుగా కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తోంది. నేను కూడా సుమారు ఇరవై ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నారు. గతంలో చేతినిండా పని ఉండేది. రెడీమేడ్ దుస్తుల రాకతో పరిస్థితి మారింది. మాకు పనిదొరకడం లేదు. చేయడానికి పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కుల వృత్తిపై ఆధారపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. - రామగిరి శ్రీనివాస్, బడాబజార్, నిజామాబాద్ ప్రభుత్వం ఆదుకోవాలి టైలరింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. రెడీమేడ్ దుస్తుల వల్ల మాకు సరైన ఉపాధి లభించడం లేదు. దర్జీ వృత్తిని నమ్ముకున్నవారిని ఆదుకోవాడనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై రుణాలు అందించి దర్జీ వృత్తిని ప్రోత్సహించాలి. - శంకర్, టైలర్, ఏర్గట్ల సరైన పని లేదు.. గతంలో రోజుకు రెండు, మూడు డ్రెస్సులు కుట్టేవాళ్లం. సీజన్లో అయితే తిందామన్నా తీరిక ఉండేది కాదు. గిరాకీని వెనక్కి పంపేవాళ్లం. ఇప్పుడు రోజుకు ఒక్క డ్రెస్సు కూడా రావడం లేదు. పాత దుస్తుల పని చేయాల్సి వస్తోంది. పాత దుస్తులకు చినిగిన చోట కుట్లు వేస్తూ, జిప్‌లు బిగిస్తూ ఉపాధి పొందుతున్నాం. - రాజేశ్వర్, టైలర్, ఏర్గట్ల దర్జీలకు పెళ్లి సంబంధాలు రావట్లేదు పదేళ్ల కింద మాకు మస్తు గిరాకీ ఉండేది. దర్జీ వృత్తితో దర్జాగా బతికేవాళ్లం. ఇప్పుడు మాకు గిరాకీ లేదు. దర్జీ వృత్తి చేస్తున్న వాళ్లకు పెళ్లి కావడమూ కష్టంగా ఉంది. దర్జీలకు పిల్లనివ్వడానికి తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. - సురేశ్, దర్జీ, బాన్సువాడ కుటుంబ పోషణ కష్టమవుతోంది రెడీమేడ్ దుస్తుల ప్రవేశంతో దర్జీ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. యువత మొత్తం రెడీమేడ్ దుస్తులపైనే వ్యామోహాన్ని పెంచుకుంది. పాత తరం వారే దుస్తులను కుట్టించుకుంటున్నారు. అరకొర సంపాదనతో కుటుంబ పోషణ భారంగా మారింది. - కొట్టూరు నర్సయ్య, దర్జీ, ఆర్మూర్ కుల వృత్తులను ప్రోత్సహించాలి టైలర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లు, విద్యా శాఖ, పోలీసు శాఖల్లో యూని ఫాంలు కుట్టేందుకు టెండర్లను మేరులకే ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న మేరులను బీసీ డీ నుంచి బీసీ బీలోకి మార్చాలి. అప్పేరల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలి. - పోల్కం గంగాకిషన్, మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ ఉపాధి కరువైంది గతంలో పండుగలు, శుభకార్యాల సమయంలో అందరూ దుస్తులు కుట్టించుకునేవారు. మాకు చేతినిండా పని ఉండేది. రెడిమేడ్ దుస్తుల రాకతో మాకు ఉపాధి కరువైంది. - మేర మనోహర్, దర్జీ, మనోహరాబాద్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి రోజు రోజుకు దర్జీ వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. చేయడానికి పనిలేక దర్జీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్జీలను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫెడరేషన్ ఏర్పాటు చేసి, సబ్సిడీపై రుణాలు అందించాలి. - హన్మంత్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, మేరు సంఘం ఆదరణ తగ్గింది.. దర్జీ వృత్తికి ఆదరణ తగ్గింది. దుస్తులు కుట్టించుకునేవారు తగ్గిపోయారు. దీంతో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి. - బోర్గం లింగం, దర్జీ, బోర్గాం (పి) కూలి రేటు ప్రభావం.. ఒక డ్రెస్సు కుట్టడానికి దర్జీలు రూ. రూ. 350 నుంచి రూ. 850 వరకు కూలి తీసుకుంటున్నారు. అయితే ఏడెనిమిది వందల్లోనే రెడీమేడ్ డ్రెస్సులు లభిస్తుండడంతో ప్రజలు దర్జీల వద్ద దుస్తులు కుట్టించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. సంపన్నవర్గాల వారు మాత్రమే వస్త్రాన్ని కొని దుస్తులు కుట్టించుకుంటున్నారు. కానీ వారు షోరూంలలోనే దుస్తులను కుట్టించుకుంటుండడంతో పేద దర్జీలకు ఉపాధి లభించడం లేదు.