breaking news
World Cup Cricket Betting
-
బెట్టింగ్..సెట్టింగ్
నగరవాసుల క్రికెట్ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు బుకీలు సన్నద్ధమయ్యారు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో చాకచక్యంగా ముందుకుసాగుతున్నారు. పోలీసులకు చిక్కకుండా హైటెక్నాలజీ, సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా బెట్టింగ్‌కు అన్ని సెట్ చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద : క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, బుకీలు మాత్రం కొంత పంథాలో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్లో బెట్టింగ్ కోసం బుకీలు సోషల్ మీడియానూ ఆశ్రయిస్తున్నారు. మరోవైపు నగరంలో బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సుమారు రెండు నెలల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరుగనుం ది. ఆదివారం జరిగే పాక్, ఇండియా మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో నగరంలో పట్టుబడిన క్రికెట్ బుకీల వివరాలను జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు తెప్పిం చుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. హుక్కా సెంటర్లలో.. పేరు మోసిన బుకీలతో పాటు ఈ సారి హుక్కా సెంటర్ల నిర్వాహకులు కూడా బుకీల అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని హుక్కా సెంటర్లలో పెద్ద పెద్ద ఎల్సీడీ టీవీలు ఏర్పాటు చేశారు. వారంలో 1000కిపైగా ఎల్సీడీ టీవీలు నగరంలో అమ్ముడయ్యాయి. వీటిని క్రికెట్ మ్యాచ్‌ల కోసమే ఖరీదు చేశారు. ముందుగానే గదుల బుకింగ్.. నగరం, శివార్లలోని కొన్ని లాడ్జీల్లో బుకీలు ముందుగానే కొన్ని గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ జరిగే రోజున లాడ్జీలో ల్యాప్‌టాప్‌లు, టీవీలు ద్వారా వీరు దందా నిర్వహిస్తారు. ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తారు. అలాగే కొందరు శివారులోని ఫాం హౌస్‌లు, రిసార్ట్స్‌లను కేంద్రంగా చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ముంబై మాఫియా.. నగరంలోని బెట్టింగ్ కేంద్రాలకు ముంబై మాఫియా హస్తం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్న సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది. నగరంలో నడిచే క్రికెట్ బెట్టింగ్‌లో ముంబై నుంచి బెట్టింగ్‌లు నడుస్తాయి. గతంలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు గతేడాది ఫిబ్రవరి 1న రట్టు చేశారు. బుకీలు మహ్మద్ అబ్దుల్ ఖదీర్(5 2), షేక్ మహమూద్ గౌస్ (49), షేక్ సమీర్ బాషా (27), షేక్ ఇమ్రాన్ (34), మహ్మద్ ఖాన్ (30), జి.కిరణ్ కుమార్ (35), షేక్ చాంద్ పాషా (29), అబ్దుల్ ఇ మ్రాన్ (45)తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సిబ్బందిని అప్రమత్తం చేశాం.. క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు, బుకీలపై నిఘా పెట్టాం. ఈ మేరకు అన్ని జోన్ల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. లాడ్జీలు, హుక్కా సెంటర్లపై వరుస తనిఖీలు చేపడుతున్నాం. నగరంలో బెట్టింగ్ జరగకుండా చూస్తాం. ఇందుకోసం సర్వం సిద్ధం చేశాం. బెట్టింగ్‌పై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి. - లింబారెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ -
కాయ్ రాజా కాయ్..
అమలాపురం/రాజమండ్రి క్రైం/ కాకినాడ క్రైం : ప్రపంచ కప్ క్రికెట్ ప్రియులకు రంజైన వినోదమైతే కొందరి భారీ జూదానికి దక్కిన అవకాశం. అలాంటి వారు కాయ్ రాజాకాయ్ అంటూ నోట్ల కట్టలతో బుకీల వెంట పడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో రూ.కోట్లలోనే బెట్టింగ్ జరుగుతుందని అంచనా. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బుకీలు, బెట్టింగ్ ఆడే వారు గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేస్తున్నారు. ఈ ఉన్నత్త జూదం వల్ల ఎందరో.. ముఖ్యంగా యువత జీవితాలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ప్రపంచకప్ క్రికెట్ ఆరంభమైందో, లేదో బెట్ కట్టేవారు, బుకీలు బిజీబిజీ అయిపోయారు. ఆన్లైన్ బెట్టింగ్‌తోపాటు స్పాట్ బెట్టింగ్ జోరందుకుంది. జిల్లావ్యాప్తంగా రోజుకు దాదాపు రూ.25 కోట్ల బెట్టింగ్ జరిగే అవకాశముందని అంచనా. కీలకమ్యాచ్లలో దీని విలువ రూ.35కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక ఆదివారం జరిగే భారత్- పాక్ మ్యాచ్‌లో రూ.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమండ్రి ప్రధాన కేంద్రాలుగా బెట్టింగ్ సాగుతోంది. బెట్టింగ్‌లో 60 శాతం కాకినాడలో జరుగుతుందని అంచనా. ఇక్కడ తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు చెందిన జూదగాళ్లు, రాజమండ్రి కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్‌లో జగ్గంపేట, కడియం, మండపేట వంటి ప్రాంతాలకు చెందిన జూదగాళ్లు పాల్గొంటున్నారు. రాజమండ్రి, కాకినాడ కేంద్రాలకు మిగిలిన ప్రాంతాలకు చెందిన బుకీలు సబ్‌లుగా వ్యవహరిస్తుంటారు. కోనసీమలో జరిగే బెట్టింగ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రం కావడం విశేషం. రావులపాలెం ప్రాంతంలోనూ బడా బుకీలు ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి, కాకినాడ, భీమవరాలకు చెందిన బుకీలు దేశవ్యాప్తంగా జరిగే ఆన్లైన్ బుకీలకు ఫ్రాంఛైజీలుగా వ్యవహరిస్తున్నారు. పట్టణాల్లో పెద్దపెద్ద లాడ్జిలు, ఉన్నత వర్గాలకు చెందిన అతిథిగృహాలు కేంద్రంగా బెట్టింగ్ జరుగుతోంది. పెద్దవారి జోలికి పోని పోలీసులు మినహాయించి చిన్నచిన్న వ్యక్తులపై పడుతుండడంతో వీరంతా మారుమూల ప్రాంతాలకు పోయి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లతో బెట్టింగ్‌ను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. బుకీ వద్ద 6 నుంచి 10 మంది వరకు ఉండే వ్యక్తులు బెట్టింగ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు సెల్ఫోన్లను కాన్ఫరెన్స్‌లో ఉంచడం ద్వారా మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు నిరంతరాయంగా బెట్టింగ్ జరుపుతున్నారు. ఇప్పుడంతా ఫ్యాన్సీ వైపే... : మ్యాచ్‌కు ముందు బెట్టింగ్ కట్టే కన్నా అప్పటికప్పుడు బెట్టింగ్ నిర్వహించడంపైనే జూదగాళ్లు మొగ్గు చూపుతున్నారు. కోహ్లీ 80 పరుగులు దాటగానే సెంచరీ అవుతుందా, 10 ఓవర్లలో 100 పరుగులు దాటితే జట్టు స్కోరు 300 చేరుతుందా అన్న రీతిలో ఫ్యాన్సీ బెట్టింగ్ సాగుతోంది. దీనిలో పాల్గొనడం స్టేటస్‌గా భావించే యువత ఎక్కువ. ఈ బెట్టింగ్‌లో నిమిషాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. ముఖ్యంగా ఆఖరి ఐదు ఓవర్లలో మ్యాచ్ ఫలితాలపై వేసే బెట్టింగ్ కోట్లు దాటుతోంది. ఇదే చాలా మందిని బికారులు చేస్తోంది. కోసు పద్దతిలో కూడా బెట్టింగ్ జరుగుతోంది. బెట్టింగ్‌ను నియంత్రించడంలో జిల్లా పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. బెట్టింగ్ ఆడిస్తున్నదెవరో పక్కా సమాచారమున్నా సత్తా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు చిత్తశుద్ధితో కృషి చేస్తే బెట్టింగ్ ను అరికట్టడం అసాధ్యం కాదు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వాళ్లను గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్సీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఇప్పటి వరకూ బెట్టింగ్‌లకు పాల్పడి పట్టుబడిన పాతవాళ్ల మీద నిఘా పెంచామని,లాడ్జిలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులపై కూడా దృష్టి సారించామని చెప్పారు. నిఘా పెంచి ఎక్కడా క్రికెట్ బెట్టింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైతను ఆదేశించామన్నారు. కాగా బెట్టింగ్ నియంత్రణకు యువతలో మార్పు రావాలని రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ అభిప్రాయపడ్డారు.