breaking news
workers went on strike
-
జీతాలు పెంచమంటే జీవితాలపై కొడతారా..!
ఉప్పల్: కార్మికులు కడుపు మాడి జీతాలు పెంచమని ఉద్యమం చేస్తే వారి జీవితాలపై కొడతారా అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పోరాటానికి మద్దతుగా శుక్రవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సీపీఎం,సీఐటీయూ, బీజేపీ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీపర్లు ఉద్యమం చేస్తే ఉద్యోగాలు తీసివేయడం దారుణమన్నారు. సకల జనుల సమ్మెలో అన్ని వర్గాల ఉద్యోగులు మూకుమ్మడి సమ్మెకు దిగినా ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించ లేదని గుర్తు చేశారు. కారణం లేకుండా కార్మికులను తొలగించడం దారుణమన్నారు. కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శామీర్‌పేట ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మన్, అశ్వథ్థామరెడ్డి, సుమన్ శర్మ, రావుల బాలకృష్ణ, రేవెల్లి రాజు, గోనే అంజయ్య, ఎనుముల మహేష్‌కుమార్, పవిత్ర, సీపీఎం నాయకులు మన్నె నర్సింహరెడ్డి, వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న దీక్ష రాత్రిగడిచినా అధికారులెవరూ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే దీక్ష కొనసాగుతోంది. దీనికితోడు కార్మికులకు వంటా వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రి అక్కడే భోజనాలు చేసి బస చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. -
వెంటనే విధుల్లో చేరండి
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి పారిశుద్ధ్యానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ సందర్భంగా సీఎం కేసీఆర్ తనంత తానుగా వేతనాలు పెంచుతామన్నందున కార్మికులు సమ్మె విరమించి... వెంటనే విధుల్లో చేరాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాల్సి ఉందన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రులు కూడా కొంత సమయం కావాలని కోరారని చెప్పారు. ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తున్నందున కార్మికులు సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. కార్మికుల సమస్యలను తనవిగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమవైపు నుంచి ప్రతిపాదనలు పంపామని, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనన్నారు. ప్రజా క్షేమం దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రణాళికతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. హోటళ్లు, దుకాణాల యజమానులు చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా సహకరించాలని సూచించారు. చెత్తను డబ్బాల్లో వేసి.. రవాణా కేంద్రానికి తరలించేందుకు వాహనాలను సమకూర్చుకోవాల్సిందిగా కోరారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్యక్రమాలపై స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్లు రవికిరణ్, కెన్నెడిలతో కలిసి డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇదీ ప్రత్యామ్నాయ ప్రణాళిక... చెత్త తరలింపు పనులకు 400 స్వచ్ఛ యూనిట్లకు 400 ప్రైవేట్ వాహనాలు. ఒక్కో వాహనానికి నలుగురు కార్మికులు. స్వచ్ఛ యూనిట్ల ఆధ్వర్యంలో పనులు. చెత్త తరలింపు పనులకు ఒక్కో స్వచ్ఛ యూనిట్ 20 మంది కార్మికులను నియమించుకోవచ్చు. ఒక్కొక్కరికి రోజుకు రూ. 350 వంతున చెల్లిస్తారు.జీహెచ్ఎంసీలోని 86 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలకు చెందిన 400 మంది సిబ్బందిని వినియోగించుకుంటారు. టౌన్‌ప్లానింగ్ నిఘా విభాగంలోని 18 వాహనాలకు చెందిన 60 మంది కార్మికుల సేవలను వినియోగించుకుంటారు.డిప్యూటీ కమిషనర్, ఏఎంఓహెచ్, ఈఈ, ప్రాజెక్ట్ ఆఫీసర్లతో కూడిన కోర్ కమిటీలు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తాయి. పని చేసేందుకు ఆసక్తి కనబరిచే సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ మహిళలు, యువత, డ్రైవర్ల సేవలు వినియోగించుకుంటారు.జీహెచ్ఎంసీలో చెత్తను తరలించే కార్మికులు 2వేల మంది ఉన్నారని, ఈ ఏర్పాట్లతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అద్దె వాహనాలకు ఒక్కోదానికి దాదాపు రూ. 5వేలవుతుందని అంచనా వేశారు. నో వర్క్ .. నో పే విధుల్లో లేని కార్మికులకు వేతనాలు చెల్లించబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా కమిషనర్ చెప్పారు. నో వర్క్.. నో పే అని స్పష్టం చేశారు.


