వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి బ్రాత్‌వైట్ గుడ్‌బై
సెయింట్ జాన్స్: నాలుగేళ్ల నుంచి వెస్టిండీస్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 32 ఏళ్ల బ్రాత్‌వైట్ 2021లో జేసన్ హోల్డర్ నుంచి పూర్తిస్థాయిలో టెస్టు పగ్గాలు అందుకున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేలోపు విండీస్ జట్టుకు నిలదొక్కుకున్న కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో బ్రాత్‌వైట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని విండీస్ బోర్డు తెలిపింది. జూన్ నెలలో స్వదేశంలో ఆ్రస్టేలియాతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం విండీస్ టెస్టు జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తామని విండీస్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే 98 టెస్టులు ఆడిన బ్రాత్‌వైట్ ఆ్రస్టేలియాతో జరిగే సిరీస్ సందర్భంగా 100 టెస్టుల మైలురాయిని అందుకోనున్నాడు. బ్రాత్‌వైట్ 98 టెస్టులు ఆడి 5,935 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రాత్‌వైట్ సారథ్యంలో 39 టెస్టులు ఆడిన విండీస్ 10 టెస్టుల్లో గెలిచి, 22 టెస్టుల్లో ఓడిపోయి, 7 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. బ్రాత్‌వైట్ నాయకత్వంలోని విండీస్ జట్టు 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో బ్రాత్‌వైట్ సారథ్యంలో పాకిస్తాన్లో పర్యటించిన విండీస్ జట్టు 34 ఏళ్ల తర్వాత పాక్ జట్టుతో సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు ప్రస్తుతం వెస్టిండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షై హోప్‌ను టి20 ఫార్మాట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 2023 మే నుంచి విండీస్ టి20 జట్టుకు రావ్మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పావెల్ స్థానంలో ఇక నుంచి టి20ల్లో విండీస్ జట్టుకు షై హోప్ కెప్టెన్‌గా ఉంటాడు.