breaking news
Webcasting centers
-
ఖాకీలకూ నో ఎంట్రీ!
సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల విధుల్లో పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి సాధారణ అర్థం పోలీస్ అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. యూనిఫామ్‌లో ఉన్నా .. లేకున్నా పోలీసులు తమ విధుల్లో భాగంగానైనా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలీసులకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. పోటీ చేసే అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఆయన ఒక్కరే లోపలికి వెళ్లాలి. భద్రతా సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధులలో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్పీకర్ కానీ, వారి అనుచరులు కానీ చేయరాదు. పోటీల్లో ఉన్న అభ్యర్థికి జెడ్‌ప్లస్ క్యాటగిరి రక్షణ ఉన్నా.. వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టిలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ మంత్రులు, ఉప మంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. పోలింగ్ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోకూడదు. సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలి. పదవుల్లో ఉన్న వారు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించినా, మాటలు, సైగలు చేసినా అది నేరం గానే పరిగణిస్తారు. వెబ్‌కాస్టింగ్‌తో పారదర్శకత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానాన్ని అములు చేయనున్నారు. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. దీని ద్వారా ప్రతి క్షణం ఓటింగ్ ప్రక్రియ..అవాంఛనీయ ఘటన వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచే పోలింగ్ ప్రక్రియను వీక్షించే సౌకర్యం ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిపించడమే దీని లక్ష్యం. -
‘ప్రాదేశిక’ తొలిపోరు నేడే
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీల తొలివిడత ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనుండగా... తొలివిడతగా ఆదివారంనాడు కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు,357 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ స్థానాల్లో 114 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1450 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 8,30,868 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 4,10, 801 మంది పురుషులు, 4,20,067మంది మహిళలు ఉన్నారు. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 1051 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో భద్రాచలం డివిజన్లో 275, పాల్వంచ డివిజన్లో 311, కొత్తగూడెం డివిజన్లో 465 కేంద్రాలు ఉన్నాయి. 5,780 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. తొలివిడతకు 133 రూట్లను ఏర్పాటు చేశారు. సిబ్బందిని, మెటీరియల్ తరలించేందుకు 128 బస్సులు, 166 కార్లు, జీపులు సిద్ధం చేశారు. 83 మంది జోనల్ ఆఫీసర్లు, 120మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 289 అతి సమస్యాత్మక, 306 సమస్యాత్మక, 223 తీవ్రవాద ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 88 మంది మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ కోసం 60మంది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఏర్పాటు చేశారు. 672 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని 351 మంది వీడియోగ్రాఫర్లు చిత్రీకరించనున్నారు. 46 మంది ఆర్వోలు, 92 మంది ఏఆర్వోలను నియమించారు. సీమాంధ్రలో తమ ప్రాంతాలను కలపవద్దని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని రెండు జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు ఇవే... సమస్యాత్మక కేంద్రాలు ఉన్న మొత్తం ఎనిమిది మండలాల్లో ఎన్నికల సరళిని అధికారులు వీక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం మండలంలో 13, చండ్రుగొండలో 6, ఏన్కూరులో 3, గార్లలో 4, కామేపల్లిలో 10, సింగరేణిలో 12, అశ్వారావుపేటలో 4, పినపాకలో 8 వెబ్‌కాస్టింగ్‌లను ఏర్పాటుచేశారు.