breaking news
warangal police commissionarate
-
తుపాకుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్ క్రైం: అక్రమ వసూళ్ల కోసం తుపాకులు సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూళ్లకు పాల్పడే ముఠాకు తుపాకులను రవాణా చేసే సభ్యులను టాస్క్‌ఫోర్స్, దుగ్గొండి, గీసుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు 9 ఎంఎం పిస్తోళ్లు, ఆరు బులెట్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఠాగా ఏర్పాడి.. ప్రధాన నిందితుడు జన్ను కోటి న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన సానుభూతిపరుడిగా వ్యవహారిస్తూ గతంలో ప్రజా ప్రతిఘటనలో పనిచేసిన వాయినాల రవి, మరో నిందితుడు సంతోష్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లో తుపాకులు కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. గతంలో న్యూడెమోక్రసీలో పనిచేసిన అబ్బర్ల రాజయ్య, మొగిళి ప్రతాప్‌రెడ్డిలు తుపాకీతో బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడేందుకు జన్ను కోటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. కొనుగోలు చేసిన తుపాకీని రాజయ్య, ప్రతాప్‌రెడ్డిలకు విక్రయించేందుకు గురువారం ఉదయం దుగ్గొండి మండలం గిర్నిబాయి ప్రాంతంలో టేకు ప్లాంటేషన్‌కు వచ్చినట్లుగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తికి సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, దుగ్గొండి సబ్ ఇన్స్పెక్టర్ సాంబమూర్తి తమ సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా ఒక తుపాకీ, రెండు రౌండ్లు లభ్యమయ్యాయి. నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు మల్లికార్జున్‌ను అరెస్టు చేసి ఒక తుపాకీ, నాలుగు రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. పూర్తి సమాచా రం కోసం దర్యప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. అధికారులకు అభినందనలు నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు, ఏసీపీలు చక్రవర్తి, సునీతామోహన్, ఇన్స్పెక్టర్లు రమేష్‌కుమార్, సతీష్‌బాబు, సంజీవ్‌రావు, డేవిడ్‌రాజు, దుగ్గొండి సబ్ ఇన్స్పెక్టర్ సాంబమూర్తి, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, శ్రీను, అలీ, శ్రీను, దుగ్గొండి హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, చంద్రశేఖర్‌లను సీపీ డాక్టర్ రవీందర్ అభినందించారు. నిందితులు వీరే.. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన జన్ను కోటి, నర్సంపేటకు చెందిన ముదురుకోళ్ల సంతోష్ అలియాస్ సంతు, ఖానాపూర్ మండలం, మనుబోతుల గ్రామానికి చెందిన అబ్బర్ల రాజయ్య, చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన మొగిళి ప్రతాప్‌రెడ్డి, గీసుగొండ మండలం, కొమ్మాలకు చెందిన నిమ్మనికొండ మల్లికార్జున్లను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. -
కమిషనరేట్ పరిధిలోకి రెండు జిల్లాలు
వరంగల్, హన్మకొండ జిల్లాలు పూర్తిగా... మానుకోట, భూపాలపల్లిలో ఎస్పీ కార్యాలయాలు పోలీసు శాఖలో వేగంగా పునర్విభజన పూర్తిగా మారనున్న స్వరూపం సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనతో పోలీసు శాఖ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ఆ శాఖ పునర్విభజనపై ఉన్నత స్థాయిలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ రెవెన్యూ జిల్లాలోని వరంగల్ పోలీస్ కమిషరేట్, వరంగల్ రూరల్ జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి మల్లారెడ్డి నియమించింది. వరంగల్ జిల్లాను.. వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలోనూ విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు పోలీసు శాఖ పరంగా ప్రత్యేకంగా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదాలో పేర్కొన్న మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్లను మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోకి తీసుకువస్తున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ప్రత్యేకంగా రూరల్ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల అదనంగా ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముసాయిదాలో పేర్కొన్న వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. – వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌స్టేషన్, ఒక క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్స్టేషన్లు, ఒకటి మహిళా పోలీస్‌స్టేషన్, ఒకటి క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇదంతా పూర్తిగా మారిపోనుంది. – వరంగల్ పోలీస్ కమిషరేట్‌లో పరిధిలో ప్రస్తుతం ఉన్న 19 స్టేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల స్టేషన్లు పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. – ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలు కలుస్తున్నాయి. ఇలా హన్మకొండలో కలుస్తున్న మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. పోలీసు శాఖ ప్రస్తుత స్వరూపం... వరంగల్ కమిషరేట్ : హన్మకొండ, కేయూసీ, సుబేదారి, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్, మామునూరు, జఫర్‌గఢ్, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, హసన్‌పర్తి, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్. వరంగల్ రూరల్ : జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, సీరోలు, కురవి, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్ టౌన్, మహబూబాబాద్ రూరల్, గూడూరు, కొత్తగూడ, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల, భూపాలపల్లి, గణపురం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట.