breaking news
Vice-Chancellor Appa Rao
-
6న ‘చలో హెచ్‌సీయూ’కి జేఏసీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సామాజిక న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఏప్రిల్ 6న ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చింది. రోహిత్ వేముల మృతికి, అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్ఏ) నాయకుడు ప్రశాంత్ సహా నలుగురు విద్యార్థుల రస్టికేషన్‌కు కారణమైన వైస్ చాన్స్‌లర్ అప్పారావును పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన చేపడతున్నామని విద్యార్థి నేతలు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, జుహైల్ ‘సాక్షి’కి తెలిపారు. వీసీ పునరాగమనం వెనుక దాగి ఉన్న కుట్రను బట్టబయలు చేసేందుకే ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చినట్టు చెప్పా రు. అరెస్టులు, లాఠీచార్జీలు, జైలు గోడలను ఛేదించుకొని ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. ‘చలో హెచ్‌సీయూ’కు వేలాదిగా తరలి రావాలని కోరారు. -
ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసులో వైస్ చాన్స్‌లర్ అప్పారావును ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదని పోలీసులు బుధవారం హైకోర్టుకు నివేదించారు. దీనిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ కింద తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ వీసీ అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు ప్రశాంత్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసులో ఫిర్యాదుదారు తరఫున వాదనలు వినిపిస్తున్న బాంబే హైకోర్టు న్యాయవాది కోర్టుకు రాలేకపోయారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనికి అప్పారావు తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభమైందని, కాబట్టి అప్పారావును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అప్పారావును వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? అని పోలీసుల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. రోహిత్ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని, అప్పారావును ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశం లేదని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.