breaking news
versus
-
పోలవరం కాంట్రాక్టర్‌ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
సీఎం వర్సెస్ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి!
- ఆరోగ్యశ్రీ సీఈవో నియామకంపై ఇద్దరి మధ్య వార్ - నాన్ ఐఏఎస్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం - నిబంధనలకు విరుద్ధమంటూ ఫైలు తిప్పి పంపిన సురేశ్‌చందా - టీఎస్ఎంఎస్ఐడీసీకీ నాన్ ఐఏఎస్ ఎండీ నిర్ణయంపైనా అసంతృప్తి - రెండింటిపై జీవోలు జారీచేయకుండా నిలిపివేత? సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్చందాకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా నాన్ ఐఏఎస్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సురేశ్ చందా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరైన ఎం.చంద్రశేఖర్‌ను ఆరోగ్యశ్రీ సీఈవోగా నియమిస్తూ సంబంధిత ఫైలుపై సీఎం సంతకం చేయగా ఆ ఫైలును సురేశ్ చందా తిరిగి సీఎం కార్యాలయానికి వెనక్కు పంపినట్లు తెలియవచ్చింది. ఇందుకు తన అభిప్రాయాలతో కూడిన లేఖను సురేశ్ చందా జతచేసి పంపినట్లు సమాచారం. అలాగే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీగా కూడా నాన్ ఐఏఎస్‌ను నియమించడంపైనా తన అభిప్రాయాన్ని ఆ ఫైలుతో పంపిన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కీలకమైన ఆ ఎండీ పోస్టులో సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న వేణుగోపాల్‌ను నియమించాలని సీఎం నిర్ణయించడంపైనా సురేశ్‌చందా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ రెండు పోస్టుల్లో ఐఏఎస్‌లను నియమించాలని ఆయన సీఎంకు విన్నవించారు. ఈ నేపథ్యంలో సీఎం తన నిర్ణయంపై పునరాలోచిస్తారా లేదా అనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. 2008 నుంచి ఐఏఎస్‌లకే పగ్గాలు... వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్యశ్రీ, టీఎస్ఎంఎస్ఐడీసీలు కీలక విభాగాలు. ఈ రెండింటిలోనూ సుమారు రూ. 700 కోట్ల చొప్పున నిధులుంటాయి. ఆరోగ్యశ్రీకి ప్రస్తుతం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్ ఇన్చార్జి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీకి సురేశ్ చందానే ఇన్చార్జి ఎండీగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలు, ఉద్యోగుల వైద్యం నిర్వహిస్తుంటారు. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులను డీల్ చేయాల్సిన వ్యవహారం కూడా సీఈవోపైనే ఉంటుంది. ఇక టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా పెద్ద ఎత్తున ఔషధాల కొనుగోళ్లు, ఆసుపత్రుల నిర్మాణాలు ఇతరత్రా జరుగుతుంటాయి. ఇది అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందన్న విమర్శలున్నాయి. వాస్తవంగా ఈ రెండు పోస్టుల్లోనూ ఐఏఎస్‌లే పనిచేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా వరంగల్ కలెక్టర్‌గా పనిచేసిన కిషన్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. కానీ ఆరోగ్యశ్రీ, టీఎస్ఎంఎస్ఐడీసీలు రెండింటికీ నాన్ ఐఏఎస్‌లూ... ఏమాత్రం పరిపాలనా అనుభవం లేనివారిని నియమించడంపై సురేష్‌చందా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా ఆరోగ్యశ్రీ బోర్డు 2008లో ఆరేడేళ్ల అనుభవం ఉన్న ఐఏఎస్‌నే సీఈవోగా నియమించాలని తీర్మానం చేసింది. అప్పటి నుంచి సీఈవోలుగా పనిచేసినవారంతా ఐఏఎస్‌లే. కానీ ఈ నిబంధనను తుంగలో తొక్కి ఏమాత్రం అర్హత లేని వ్యక్తిని సీఈవోగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని సీఎంకు రాసిన లేఖలో సురేశ్‌చందా పేర్కొన్నట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ బోర్డు తీర్మానం కాపీని కూడా తిరిగి పంపిన ఫైలుకు జతచేసినట్లు సమాచారం. టీఎస్ఎంఎస్ఐడీసీకి సాధారణ డిప్యూటీ డెరైక్టర్ హోదా కలిగిన వ్యక్తిని ఎండీగా నియమించడం తగదని కూడా అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి ఉన్నతస్థాయి అధికారులు వాస్తవ సమాచారం ఇవ్వకపోవడం వల్లే నాన్ ఐఏఎస్‌ల నియామకం జరిగిందని, అందువల్ల నిబంధనలను సురేశ్ చందా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. జీవోల నిలిపివేత..? సీఎం ఆదేశంతో ఈ రెండు కీలక పోస్టుల్లో చంద్రశేఖర్, వేణుగోపాల్‌ల నియామక ఉత్తర్వులను సురేశ్ చందా జారీచేయాల్సి ఉన్నా రెండు, మూడు రోజులుగా జీవోల జారీకి అంగీకరించడంలేదని సమాచారం. సీఎం నిర్ణయాన్నే సురేశ్ చందా తిరస్కరించడంపై అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు వీరిద్దరినే సీఎం ఎందుకు కీలక పోస్టుల్లోకి తెస్తున్నారో అంతుబట్టడంలేదు. పైగా ముఖ్య కార్యదర్శితోకానీ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో కానీ చర్చించకుండానే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.


