వైభవంగా వెంకన్న రథోత్సవం
నారాయణవనం, న్యూస్‌లైన్: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణల మధ్య ఉప్పు, మిరియాలు చల్లుతుండగా 40 అడుగుల చెక్క రథంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. ఉదయం 7.20 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5.30 గంటలకు పూర్తయింది. వేకువ జామున 2.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు శుద్ది, నిత్యకట్ల, గంట తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు.
ఉదయం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరుడు మాడవీధుల్లో హారతులు అందుకుని రథాన్ని అధిరోహించారు. ఉదయం 7.20 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. నగరువీధి, ట్రంకురోడ్డు, మట్లవారివీధి, బజారువీధి మీదుగా గంగుండ్ర మండపానికి 11 గంటలకు రథం చేరుకుంది. గ్రామీణ ప్రజల కోసం ఆగిన రథం తిరిగి 3.30 గంటలకు బయలుదేరి పద్మశాలివీధి, తేరువీధి మీదుగా గమ్యస్థానానికి 5.30 గంటలకు చేరుకుంది.
ఆలయానికి చేరుకున్న ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్థానిక ఎస్ఐ వెంకటశివకుమార్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా జిల్లా పద్మసాలి సంఘం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
కనువిందు చేసిన కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులకు కనువిందు చేసింది. గంటన్నర పాటు నిర్వహించిన ఆర్జిత కల్యాణంలో వందల సంఖ్యలో దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటు వస్త్రబహుమానం పొందారు. అన్ని ప్రాంతాల్లో శ్రీదేవి, భూదేవితో స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అయితే నారాయణవనం వెంకన్నకు వివాహం జరిగిన క్షేత్రం కావడంతో ఉభయ నాంచారులతో పాటు పద్మావతీ అమ్మవారితో కల్యాణోత్సవం నిర్వహించారు.
టీటీడీ ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులతో పాటు స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయ అధికారి బాలనరసింహారావు, సహాయకులు వీరయ్య, షరాబులు మణి, గోవిందస్వామి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి 11 గంటలకు స్వామి వారు అశ్వవాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం పద్మసరస్సులో చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.