breaking news
veerabadraswamy temple
-
పిడకల సమరంలో 50 మందికి గాయాలు
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పిడకల సమరాన్ని (నుగ్గులాట) చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అరగంట పాటు జరిగిన పిడకల సమరంలో సుమారు 50 మంది గాయపడ్డారు. వారందరికీ స్థానికంగా చికిత్స చేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
విశ్వరూప వీరభద్రుడు
శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు. శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో, ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు. ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి ఉంటారు. ముప్పై రెండు చేతుల వీరభద్రుని మయశిల్పగ్రంథం అఘోర వీరభద్రస్వామిగా కీర్తించింది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు, శతృబాధలు తొలగి, సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో చివరిదైన వాతులాగమం చెప్పింది. తనను సేవించిన వారికి సకలైశ్వర్యాలను, సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
వీరభద్రుడి భక్తులకు ‘వృక్ష’ ప్రసాదం
భీమదేవరపల్లి (హుస్నాబాద్): తరిగిపోతున్న వృక్ష సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలను నాటుతోంది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ‘దేవుడిని మొక్కు.. మొక్కను నాటు’అనే నినాదంతో వేలేరు మండలం కన్నారం గ్రామానికి చెందిన జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి భక్తులకు మొక్కల పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. సొంత ఖర్చుతో జామ, మామిడి, తులసి, నిమ్మ మొక్కలను భక్తులకు అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. ‘వృక్ష ప్రసాదం’పేరిట బ్రహ్మోత్సవాలకు హజరయ్యే భక్తులకు ఒక్కో కుటుంబానికి ఒక్కో మొక్క, దేవుడి క్యాలెండర్‌ను ఒక బ్యాగ్‌లో భద్రపరిచి అందించను న్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌బాబు ప్రారంభించనున్నారు. పంపిణీ ఇలా... కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యాయి. ప్రధాన ఘట్టాలైన భోగి, సంక్రాంతి, వసంతోత్సవ కార్యక్రమాలు 14, 15, 16 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. వీరికి వృక్ష ప్రసాదం పేరిట పంపిణీ చేయనున్న పండ్ల మొక్కలు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. మొక్కల పంపిణీ కోసం రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్లో ఐదుగురు అర్చకులు, 25 మంది వలంటీర్లు సేవలను అందించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు రాగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద అర్చకుడు సదరు భక్తుడికి బొట్టు పెట్టి ఒక పండ్ల మొక్క, దేవుడి ఫొటోతో కూడిన క్యాలెండర్‌ను ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్‌లో ఉంచి అందించనున్నారు. వృక్ష ప్రసాదం స్వీకరించే సమయంలోనే వలంటీర్లు భక్తుడి పేరు, చిరునామా, వారి ఫోన్ నంబరు సేకరించనున్నారు. జాతర ముగిసిన అనంతరం వరుసగా మూడు మాసాల పాటు సదరు మొక్క తీసుకున్న భక్తులకు ‘మీరు తీసుకున్న మొక్కను కాపాడండి’ అంటూ సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపించే విధంగా కార్యాచరణ సైతం రూపొందించారు. సంపూర్ణ ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దారు.. వృక్ష ప్రసాదం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి గతంలో తన స్వగ్రామమైన వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సంపూర్ణ ఓడీఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దారు. సొంత గ్రామానికి కొంత సేవ చేయాలనే సంకల్పంతో గతేడాది కన్నారంలో సర్పంచ్, గ్రామస్తులు, అధికారుల కృషితో వంద శాతం ఓడీఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దడంలో సురేందర్‌రెడ్డి సఫలీకృతుడయ్యాడు. వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రథమంగా కన్నారం గ్రామం సంపూర్ణ బహిరంగ మల విసర్జన గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత సురేందర్‌రెడ్డిదే. అదే స్ఫూర్తితో తన జీవిత భాగస్వామి శ్రీదేవి ప్రోద్భలంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేవే లక్ష్యంగా... భగవంతుడి వద్దకు వచ్చే భక్తులకు మొక్కను ఇస్తే వారు తప్పకుండా ఆ మొక్కలను రక్షిస్తారు. సీఎం చేపట్టిన హరితహార‡ కార్యక్రమం నన్నెంతో ఆకర్షించింది. అందులో నేను కూడా భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా. భగవంతుడి సన్నిధిలో మొక్కలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. –జన్నపురెడ్డి సురేందర్ -
కోనేరులో స్నానాలు: ముగ్గురు యువకుల మృతి
కోయిల్‌కొండ: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం తాండూరు సమీపంలోని శ్రీవీరభద్రస్వామి ఆలయ కోనేరులో పడి ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వివరాలు... తాండూరుకు చెందిన శివకుమార్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి శ్రీవీరభద్రస్వామిని దర్శించుకున్నారు. శివకుమార్ హోటల్లో పనిచేస్తున్న సాయి(17), మల్లు (28), ఆటో డ్రైవర్ రాజు(30) బుధవారం సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్లారు. అయితే వారు మార్గమధ్యంలో మద్యం సేవించారు. స్నానమాచరించేందుకు ముగ్గురూ కోనేరులో దిగారు. వారిలో సాయికి ఈత రాకపోవడంతో అతను మునిగిపోతుండగా, అతణ్ణి కాపాడేందుకు ప్రయత్నించిన మల్లు, రాజు కూడా మునిగిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికితీశారు. సాయి, రాజు తాండూరుకు చెందినవాళ్లు కాగా మల్లు కర్ణాటకలోని విర్యామణ గ్రామానికి చెందినవాడు.