breaking news
Varunadu
-
వర్షం.. హర్షం..
- విశాఖలో 4.4 సెం.మీల వర్షపాతం - జిల్లాలోనూ పలుచోట్ల వాన సాక్షి, విశాఖపట్నం : చాన్నాళ్ల తర్వాత వరుణుడు కరుణించాడు. అనుకోని అతిథిలా వచ్చి వర్షం కురిపించాడు. కొన్నాళ్లుగా ఎండలతో అల్లాడిపోతున్న జనానికి ఊరటనిచ్చాడు. అటు అన్నదాతల్లోనూ ఆనందాన్ని పంచాడు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన మూడు రోజుల క్రితం నుంచి వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. అయితే ఆకాశం మేఘావృతమై చల్లదనం పంచిందే తప్ప చెప్పుకోదగినట్టుగా వాన కురవలేదు. శనివారం ఉదయం మాత్రం విశాఖలోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. అయితే ఆదివారం సాయంత్రం అనూహ్యంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఇటు విశాఖనగరంతో పాటు మధురవాడ, భీమిలి, గాజువాక, అటు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విశాఖ విమానాశ్రయంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షంతో పాటు కొన్నిచోట్ల గాలులు కూడా వీచాయి. కొద్దిరోజులుగా మండే ఎండలతో వేగిపోతున్న జనానికి ఈ వాన కొండంత ఊరటనిచ్చింది. అలాగే రైతుల్లోన్లూ ఆశలు చిగురింపజేసింది. పగటి పూట ఎండలు కాసినా సాయంత్రమయ్యే సరికి అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఇలాంటి వర్షాలను కురిపిస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. -
అడుగంటుతున్న జలాశయాలు
- వరుణుడు ముఖం చాటేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి - రాష్ట్ర జలాశయాల్లో సగటు నీటిమట్టం 26 శాతం - కొంకణ్‌లో అధికంగా 48, మరాఠ్వాడాలో అత్యల్పంగా 7 శాతం - తీవ్ర నీటి ఎద్దడిలో పలు గ్రామాలు సాక్షి, ముంబై: గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఈ సారీ వరుణుడు ముఖం చాటేయడంతో ముంబైకు నీరందించే ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. రోజురోజుకూ జలాశయాల నీటి మట్టం కనిష్ట స్థాయిని మించి తగ్గిపోతున్నాయి. గతేడాది కంటే త్వరగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లోని సగటు నీటిమట్టం 26 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి 18 శాతం నీటి మట్టం ఉంది. ప్రస్తుతం కొంకణ్‌లో అత్యధికంగా 48 శాతం నీటి నిల్వలు ఉండగా, పుణేలోని జలాశయాల్లో 30 శాతం, నాగపూర్‌లో 27 శాతం, నాసిక్‌లో 21 శాతం నీటి నిల్వలున్నాయి. ఇక మరాఠ్వాడా పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ ఏడు శాతానికి నిల్వలు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి వర్షాలు సమయానికి వచ్చాయి. కానీ జూన్ మూడో వారం నుంచి పత్తాలేకుండా పోయాయి. అక్కడ అక్కడ చిరు జల్లులు కురిసినా మోస్తరు నుంచి భారీ వర్షాలు మాత్రం కురవడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా సాగు ప్రశ్నార్థకం కాగా, చాలా ప్రాంతాల్లో తాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. మరాఠ్వాడాలోని బీడ్, ఉస్మానాబాద్, లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉంది. వర్షాలు కురవకపోతే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్య మరింత తీవ్రం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైకి మూడు నెలలు సరిపడా...! ముంబైకి మూడు నెలలు సరిపడా నీటి నిల్వలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రుతుపవనాల రాకతో కురిసిన భారీ వర్షానికి ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీరు చేరుకుంది. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేసినా జులై నెలాఖరుకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తోంది.