breaking news
Ut Khader
-
విమాన ప్రయాణంలో ఎందుకీ వివక్ష?
సాక్షి, బళ్లారి: విమాన ప్రయాణాలు చేసేటప్పుడు తన పేరు యూటి ఖాదర్ అని చెబితే సిబ్బంది మరింతగా తనిఖీలు చేస్తున్నారని, ఈ వివక్ష ఎప్పుడు తొలగిపోతుందోనని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి యూటి ఖాదర్ అన్నారు. ధార్వాడలో ఆదివారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విమాన ప్రయాణ సమయాల్లో తన పేరు చెప్పేందుకు భయపడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అర్థం కావడం లేదన్నారు. దీన్ని నుంచి బయటపడటం అంత సులభం కాదన్నారు. ముస్లిం ఉద్యోగులు కూడా తాము పనిచేసే సంస్థలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అయినా ఓపికతో ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లింలు తమ పిల్లలను విద్యావంతులను చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి పేదకూ బీపీఎల్ కార్డులు అందజేసేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. 8.5 లక్షల నకిలీ రేషన్‌కార్డులను గుర్తించి తొలగించామన్నారు. -
‘అత్యాచార’ పరీక్షా విధానంలో మార్పు
బెంగళూరు: నగరంలో మహిళలపై అత్యాచారాలు అధికం కావడంతో వాటిని నిరోధించడానికి కర్ణాటక ప్రభుత్వం నడుం బిగించింది. ఢిల్లీ తరువాత బెంగళూరులోనే బాలికలపైన, మహిళలపైన అమానుషంగా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యాచారాలను ఖండిస్తూ కన్నడ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బెంగళూరు బంద్ జరిగింది. అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో అత్యాచార బాధిత మహిళలకు ప్రస్తుతం చేస్తున్న పరీక్షా విధానంలో మార్పు చేస్తూ నిపుణులైన ముగ్గురు వైద్యులు గల సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు సాంత్వన చేకూర్చే ఇంటిగ్రేటెడ్ సెంటర్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉమాశ్రీ చెప్పారు.