breaking news
Urban land records management
-
NAKSHA Pilot Project: పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు.. ఇళ్లు, స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. మున్సిపాలిటీల్లో విస్తృత స్థాయిలో సర్వే చేసి.. ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాల వివరాలన్నీ తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్.. ఇలా సమస్త వివరాలతో ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని అణువణువు ఇకపై డిజిటల్ రూపంలో నిక్షిప్తం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడరై్నజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ)లో భాగంగా ‘నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష)’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా రెండు లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ పట్టణాల్లో ఏడాదిపాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పు, చేర్పులు చేస్తారు. అనంతరం మొదటి దశ కింద దేశవ్యాప్తంగా 1,000 మున్సిపాలిటీల్లో, ఆ తర్వాత దేశంలోని 4,912 పట్టణాలు, నగరాల్లో ‘నక్ష’ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మాదిరిగా ప్రాపర్టీ కార్డ్.. పట్టణాలు, నగరాల్లోని భూముల సర్వే నంబర్లు, ఇళ్లను ‘నక్ష’ కార్యక్రమం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్ ఇస్తున్నట్టుగానే.. ప్రతీ గృహ యజమానికి ప్రాపర్టీ కార్డును విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఇవ్వనున్నట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈ కార్డుపై ‘క్యూఆర్’ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు లభిస్తాయని తెలిపారు. ఇంటి యజమాని పేరు, ఆస్తి పన్ను వివరాలు, ఆస్తి విస్తీర్ణం, సర్వే నంబర్, అనుమతి తీసుకున్న నంబర్, ప్లాన్, నల్లా కనెక్షన్ ఇలా సమస్త సమాచారం అందులో ఉంటుందని వెల్లడించారు. లైడార్ సర్వే మాదిరిగా ఇది ఉంటుందని, పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటిని త్రీడ్రీ కెమెరాలతో మ్యాపింగ్ చేస్తారని, ఇందుకోసం మూడు రకాల కెమెరాలను ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ సర్వే పూర్తయితే.. ఆస్తిపన్ను మదింపు పారదర్శకంగా జరుగుతుందని, స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్తులో జీఐఎస్ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లోని రెవెన్యూ సర్వే నంబర్లు ఎన్ని సబ్ డివిజన్లుగా మారాయన్న వివరాలను కూడా నమోదు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్ ల్యాండ్ రికార్డులు నాలుగు రాష్ట్రాల్లోనే.. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే పట్టణ భూముల రికార్డులను పక్కాగా నిర్వహిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో వాటి నిర్వహణ సరిగా లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘నక్ష’ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతోంది. రెవెన్యూ, మున్సిపాలిటీలు, సర్వే ఆఫ్ ఇండియా, ఎంపీ స్టేట్ ఎల్రక్టానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. పట్టణాలు, నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకమని కేంద్రం తెలిపింది. భూముల విలువలు వేగంగా పెరుగుతున్నందున వివాదాలకు చెక్ పెట్టేలా ఇది ఉంటుందని, న్యాయపరమైన అంశాల్లోనూ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ సర్వే డిజిటైజేషన్‌తో ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని పేర్కొంది. ఆయా ఆస్తుల యజమానులు రుణాలు తీసుకోవడానికి ఈ సర్వే అనంతరం జారీ చేసే ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. 3 పద్ధతుల్లో ఏరియల్ సర్వే.. రాష్ట్రంలో ఎంపిక చేసిన మున్సిపాలిటీలివే.. జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, వేములవాడ, మిర్యాలగూడ, జగిత్యాల, మణుగూరు మున్సిపాలిటీలను ‘నక్ష’ పైలట్ ప్రాజెక్టు కోసం రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 155 పట్టణాలు, 29 పట్టణాభివృద్ధి సంస్థల్లో కూడా భవిష్యత్తులో ఈ సర్వే నిర్వహించేందుకు అవసరమైన నిధులు దాదాపు రూ.700 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుందని తెలిసింది. -
వుడాకు భూ బాధ్యతలు!
అర్బన్ భూముల రికార్డులు, అడంగల్ నిర్వహణ ఇక అప్పగింత రెవెన్యూ శాఖకు తగ్గనున్న భారం విశాఖపట్నం సిటీ: అనేక దశాబ్దాలుగా భూ వివరాలకు సంబంధించిన రికార్డులను నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ అర్బన్‌లో ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. అర్బన్ భూముల రికార్డుల నిర్వహణను ఇకపై వుడాకు అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు-వుడా అధికారులకు మధ్య కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. శనివారం కూడా కలెక్టర్ యువరాజ్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూములకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. వుడాలో ప్రస్తుతం 23 అర్బన్ మండలాలున్నాయి. ఇవన్నీ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడా 23 మండలాల అడంగల్ రికార్డులను వుడా నిర్వహించడంతో పాటు పర్యవేక్షించే అధికారం కూడా రెవెన్యూ వర్గాలు కల్పిస్తున్నాయి. త్వరలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ (వీఎండీఏ)గా మారబోతున్న తరుణంలో ఈ కొత్త అధికారాలను వుడాకు అప్పగించాలని చూస్తున్నారు. వుడాకు అప్పగించి భూ రికార్డులను నిర్వహించేందుకు అనుమతిచ్చినా ప్రస్తుతం చట్టం అనుమతించదనే వాదనలున్నాయి. వుడా సర్వేయర్లు చేసే రికార్డులను ప్రభుత్వం పట్టించుకోదు. ఆ సర్వేను మళ్లీ రెవెన్యూ అధికారుల అధీనంలో చేయిస్తారు. అయితే తాజాగా కొత్త చట్టం రూపొందించి కొన్ని అధికారాలను వుడాకు కల్పించేందుకు సైతం వెనకాడడం లేదని తెలిసింది. 1920 నుంచీ అడంగళ్ (పహాణీ) రికార్డులను రెవెన్యూ అధికారులే నిర్వహిస్తున్నారు. ఈ రికార్డుల్లో ముఖ్యంగా భూమి హక్కుదారు, పట్టాదారు, అనుభవదారు ఎవరనే వివరాలుంటాయి.భూమి స్వభావం తెలుసుకోవాలంటే అడంగళ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ భూమి మెట్ట, మాగాణి, పోరంబోకు, గెడ్డ, చెరువు, కొండ, స్మశానం, కొండ పోరంబోకు, గెడ్డ పోరంబోకు, కాలువ, ఇసుక నేల, ఎర్ర నేల, రాళ్ల నేల ఇలాంటి వివరాలన్నీ లభిస్తాయి. ఆ భూమిలో ఏమేం పండుతాయి. ఎలా పండుతాయి. వర్షాధారమేనా లేక నీరు కాల్వల ద్వారా నీరు వస్తుందా. ఏ ఆయకట్టు కింద సాగవుతోంది. ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి.ఆ భూమి పన్నులు ఎలా ఉన్నాయి. ఎవరు చెల్లిస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలన్నీ అందులో పొందుపరచబడి ఉంటాయి. ఆ భూమి తమదంటూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా దాని పూర్వాపరాలు తెలుసుకునేందుకు అడంగళ్ ఒక్కటే మార్గం. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ ల్యాండ్ రికార్డులను వుడాకు ఎందుకు అప్పగించనుంది. ల్యాండ్ రికార్డులను సంబంధించి నిర్వహించేందుకు ఎకరాకు రూ. 10 చొప్పున వసూలు చే సుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఈ నేపధ్యంలో తదుపరి వివరాలపై చర్చలు జరుగుతున్నాయి.