breaking news
Transport Employees
-
రైట్..రైట్
12.5 శాతం వేతన పెంపునకు సర్కార్ అంగీకారం సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగులు కదిలిన బస్సులు బెంగళూరు: అటు రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం పట్టు సడలించడంతో బుధవారం ‘బస్సు’ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో మూడు రోజులుగా ప్రభుత్వ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 35 శాతం వేతన పెంపు ప్రధాన డిమాండ్‌గా ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర రవాణాశాఖలోని నాలుగు విభాగాలకు చెందిన 1.25 లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మొదట్లో 8 శాతం అటుపై 10 శాతం కంటే వేతన పెంపు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం.,. బుధవారం సాయంత్రం ఉద్యోగుల సంఘం నాయకులతో జరిపిన చర్చల అనంతరం 12.5 శాతం పెంచడానికి అంగీకరించింది. 35 శాతం కంటే తక్కువకు ఒప్పుకునేది లేదని చెబుతూ వస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు కూడా పట్టు సడలించి ప్రభుత్వ సూచనకు ఒప్పుకున్నారు. దీంతో మూడు రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. ఫలితంగా బెంగళూరు సీటీ సర్వీసులైన బీఎంటీసీ బస్సులు బుధవారం సాయంత్రం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా మిగిలిన మూడు విభాగాలకు చెందిన బస్సులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక మూడు రోజులుగా విధులకు గైర్హాజరైన ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ ఎం.డీ రాజేంద్రకుమార్ కటారియా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు సగటున రూ.21 కోట్ల లెక్కన మూడు రోజులకు దాదాపు రూ.63 కోట్ల ఆదాయానికి గండిపడినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. -
షాడో డీటీసీ!
► ఎనిమిదేళ్లుగా ఒకే సీటులో.. ► ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్ చెప్పిందే వేదం ► ఉన్నతాధికారి పేరుతో ఇష్టారాజ్యంగా వసూళ్లు ► హడలిపోతున్న రవాణాశాఖ ఉద్యోగులు నెల్లూరు (టౌన్): ఎనిమిదేళ్లుగా ఆయన రవాణాశాఖ కార్యాలయంలో ఒకే సెక్షను సీటులో పనిచేస్తున్నాడు. ఆ శాఖకు ఏ ఉన్నతాధికారి వచ్చినా ఆయన మాట వినాల్సిందే. ఎంతమంది ఉద్యోగుల బదిలీ అయినా ఆయన మాత్రం ఆ సీటుకు అతుక్కుని పోయాడు. ఉన్నతాధికారి పేరు చెప్పి ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల నుంచి స్పెషల్ వర్క్‌ల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. అక్కడ అందరూ ఈ ఉద్యోగిని షాడో డీటీసీగా పిలుస్తుంటారు. స్పెషల్ వర్క్‌లు పేరుతో అందరి దగ్గర వసూళ్లు చేసి ఉన్నతాధికారికి రోజుకు రూ.50 వేల అనధికార మొత్తాన్ని ఇస్తుండటంతో పాటు తన కమీషన్ కింద రూ. 5వేలు జేబులో వేసుకుంటున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు గుసుగుసలాడుకుంటున్నారు. దీంతో పాటు ఈయన చూస్తున్న ట్రాక్టర్ల సెక్షనులో రోజుకు మరో రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఉద్యోగి చేయాల్సిన ట్రెజరీ పనులన్నీ ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుకు అప్పజెప్పి రోజంతా ఉన్నతాధికారి వసూళ్లల్లో మునిగి తేలుతారని తోటి ఉద్యోగులే చెబుతున్నారు. ఈ షోడో డీ టీసీ పేరు చెబితేనే ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హడలిపోతున్నారు. నెల్లూరు ఉపరవాణాశాఖా కార్యాలయంలో అకౌంట్స్ సెక్షనులో ఆయన 2008లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా అదే సెక్ష నులో పనిచేస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ముగ్గురు ఉన్నతాధికారులు మారినా అకౌంట్స్ సెక్షనులో ఇప్పటికీ ఆ ఉద్యోగి ఉండటంపై రవాణాశాఖలో చర్చనీయాంశమైంది. రవాణాశాఖలో ఉన్నతాధికారికి కార్యాలయంలో ఆయా సెక్షన్లకు సంబంధించి అనధికార వసూళ్లు మొత్తం ఈ ఉద్యోగి ద్వారానే చేరుతాయని పలువురు చెబుతున్నారు. లారీల రిజిస్ట్రేషన్లు, బస్సుల పర్మిట్లు, ఎన్ఓసీలు, జేసీబీలు, పెద్ద,పెద్ద మిషన్ల వరకు కాగితాలు సక్రమంగా లేకపోయినా ఈ ఉద్యోగిని కలిస్తే చాలు. ఆయన చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తే ఆ పని క్షణాల్లో పూర్తవుతుంది. ఆ పనికి సంబంధించిన సెక్షను ఉద్యోగి కూడా ఈయన ఎంటర్ అవడంతో నోరెత్తకుండా పనిచేసిపెడతారు. ఉదాహరణకు వాహనం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ కావాలంటే రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కనీసం ఏడాదిన్నర సమయం ఉండాలి. అలా లేకుంటే వాణిజ్యపన్నుల శాఖలో ట్యాక్స్కట్టి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురావల్సి ఉంది. ఈ పనికి సంబంధించి ఈయనను కలిసి చెప్పిన అనధికార మొత్తాన్ని చెల్లిస్తే పని పూర్తి చేశారు. ఈ రీతిలో స్పెషల్ వర్క్‌ల పేరుతో ఉన్నతాధికారికి అన్ని సెక్షన్లు నుంచి రోజుకు రూ.50 వేల మేర వసూలు చేసి దాంట్లో రూ.5వేలు తన ఖాతాలో వేసుకుంటారని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులపై ఉన్నతాధికారికి చాడీలు చెబుతుండటంతో ఈయన అంటేనే అక్కడ పనిచేసే ఉద్యోగులు హడలిపోతున్నారు. డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేసి తెచ్చి ఇస్తుండటంతో ఉన్నతాధికారి ఆ ఉద్యోగి చెప్పినదానికల్లా తల ఊపుతారంటున్నారు. ట్రెజరీ పనులు సెక్యూరిటీ గార్డుకు అప్పగింత రవాణాశాఖలో అకౌంట్స్ విభాగం కీలకం. అక్కడ ఉద్యోగులు, కార్యాలయానికి సంబంధించిన కీలక లావాదేవీలు, పత్రాలు ఉంటాయి. ఈ సెక్షనులో పనిచేస్తున్న ఉద్యోగి ట్రెజరీ బాధ్యతలను ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుకు అప్పజెప్పా రు. సెక్యూరిటీ గార్డే ప్రతిరోజూ ట్రెజరీకి వెళ్లి రవాణా కార్యాలయానికి సంబంధించిన అన్ని పనులను చక్కబెడుతున్నారు. క్యాష్ మాత్రం గుమస్తాకు అప్పజెబుతున్నారు. ఉద్యోగులు, కార్యాలయానికి సంబంధించిన పత్రాలు కూడా బయట వ్యక్తుల చేత పంపించకూడదన్న నిబంధన ఉంది. అయినా ఈ ఉద్యోగి అవేమీ పట్టించుకోరు. ఉన్నతాధికారి వసూళ్లలో నిమగ్నమవుతారు. ఉన్నతాధికారిని ప్రతిరోజూ ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి తప్పులు చేసినా పట్టించుకోరన్న ప్రచారం సాగుతోంది. ఈయన బారినుంచి రక్షించాలని ఆ శాఖ ఉద్యోగులు వేడుకుంటున్నారు. వసూళ్లు విషయంపై పరిశీలిస్తాం : శివరాంప్రసాద్, ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో నాపేరు చెప్పి వసూలు చేస్తున్నారనే విషయం తెలియదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ట్రెజరీకి వెళ్లేందుకు గుమస్తాను ప్రత్యేకంగా నియమించాం. సెక్యూరిటీ గార్డును ఎందుకు పంపిస్తున్నారో అడిగి తెలుసుకుంటా. ప్రైవేటు వ్యక్తులను ట్రెజరీకి పంపించకూడదు. అకౌంటెంట్‌గా ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఆయన ఉంటున్నారు. -
రవాణా సమ్మె
రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికుల వేతన పెంపుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం నిర్వహించిన సమ్మె పాక్షికంగా విజయవంతమైంది. ప్రభుత్వ రవాణాశాఖలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె పాటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రవాణాశాఖలో 1.40 లక్షల మంది పనిచేస్తున్నారు. 11వ వేతన ఒప్పందం 2013 ఆగష్టు 31వ తేదీతో ముగిసింది. 12వ వేతన సవరణ ఒప్పందం అదే ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చర్చల పేరుతో జాప్యం చేసింది. దీంతో విసుగు చెందిన ఉద్యోగులు గత ఏడాది డిసెంబరులో నాలుగురోజుల పాటు సమ్మె జరిపారు. బస్సు సేవలను స్తంభింపజేశారు. ఆ తరువాత ప్రభుత్వం దిగివచ్చి వేతన సవరణపై కమిటీని నియమించింది. రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, కార్యదర్శి ప్రభాకర రావు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి ఉమానాథ్ల ఆధ్వర్యంలో గత నెల 2 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ఆరు దశల్లో చర్చలు జరిపారు. రవాణా సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఉద్యోగులు ఆశించిన మేరకు వేతనాలను పెంచలేమని 5వ దశ చర్చల సమయంలో మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొనడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. 5.5 శాతం వేతనాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఈనెల 13న జరిగిన చర్చల్లో మంత్రి ప్రకటించగా, కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం ఒక్కరోజు సమ్మె పాటించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నారు. బస్టేషన్లో 70 శాతం బస్సులు సంఘాల పిలుపుమేరకు మంగళవారం నాటి సమ్మెలో భాగంగా 70 శాతం బస్సులు బస్‌స్టేషన్‌కే పరిమితమైనాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచి సమ్మె ప్రారంభం కాగా పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. బస్సులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే అధికార పక్షం మాత్రం సమ్మె ప్రభావం ఎంతమాత్రం లేదని ప్రకటించింది. 3058 బస్సులకు గానూ 3117 బస్సులను అంటే అదనంగా 57 బస్సులను నడిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపింది.