breaking news
thota gandhi
-
తోట నర్సింహంను అరెస్ట్ చేయాలి
-
తోట నర్సింహంను అరెస్ట్ చేయాలి
వీరవరం: తమపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ ఎంపీ తోట నర్సింహంను అరెస్ట్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట గాంధీ నిరాహారదీక్ష చేపట్టారు. తోట గాంధీకి జగ్గంపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం ప్రకటించారు. తోట నర్సింహం తీరుతో వీరవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో వీరవరంలో భారీగా పోలీసులను మొహరించారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాకినాడ ఎంపీ ఎన్నికల్లో తోట నర్సింహం గెలిచారు. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడి మండలం వీరవరంలో ప్రాదేశిక ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పోలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ వీరవరంలో ఆయనకు 875 ఓట్లు పడగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్‌కు 2,075 ఓట్లు పడ్డాయి. స్వగ్రామంలోనే ప్రత్యర్థికి ఆధిక్యత దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయిన నరసింహం వీధి రౌడీలా మారిపోయారు. ఎంపీనన్న సంగతి మరిచి గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడుతూ, దాడులు చేశారు. -
వీరవరంలో ఎంపీ తోట నర్సింహం వీరంగం
-
వీరవరంలో ఎంపీ తోట నర్సింహం వీరంగం
కిర్లంపూడి : తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో కాకినాడ ఎంపీ తోట నర్సింహం అప్పుడే తన ప్రతాపాన్ని చూపించారు. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మేనల్లుడి వరస అయ్యే తోట గాంధీ, ఆయన సోదరుడిపై తోట నర్సింహం, తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మాజీ మంత్రి తోట సుబ్బారావు తమ్ముడి కొడుకైన గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. తాజా ఎన్నికల్లో వాళ్లు జ్యోతుల నెహ్రూ, ఆయన మద్దతుదారులను బలపరిచారు. ఈ కారణంతోను, ఇంతకుముందు అయిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకున్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. శనివారం నాడు పొద్దున్నే వేరే ఊళ్ల నుంచి జనాన్ని తీసుకెళ్లి వీరవరంలో తమ ఇంట్లో ఉన్న తోట గాంధీ, తదితరులపై దౌర్జన్యం చేశారు. తీవ్రంగా దాడి చేయడంతో గాంధీ, ఆయన సోదరుడు గాయపడ్డారు. దీంతో ఈ విషయం తెలిసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హుటాహుటిన బయల్దేరి వీరవరం వెళ్లారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బయట ఊళ్ల నుంచి వచ్చిన వారందరినీ పంపేసి ఊళ్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఎన్నికలు జరిగినా.. వీరవరంలో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తోట, జ్యోతుల కుటుంబ సభ్యులంతా దగ్గరి బంధువులే అయినా, రాజకీయంగా వేర్వేరు వర్గాల్లో ఉండటంతో.. ఈ ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం.