breaking news
Tenth advanced supplementary results
-
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం పరీక్షల కోసం 2,06,648 మంది దరఖాస్తు చేసుకోగా 1,91,846 మంది పరీక్షలు రాశారు. వీరిలో 1,23,231 మంది ఉత్తీర్ణులయ్యారు. 64.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నందున వారికి కంపార్టుమెంటల్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా డివిజన్లు కేటాయించినట్లు తెలిపారు. 22,236 మందికి ఫస్ట్ డివిజన్, 46,725 మందికి సెకండ్ డివిజన్, 54,249 మందికి థర్డ్ డివిజన్ దక్కాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 46.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఇంతకుముందు నిర్వహించిన పదో తరగతి రెగ్యులర్ పరీక్షల్లో 67.26 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉత్తీర్ణతను కూడా కలిపితే 6,06,070 లక్షల మందికి 5,37,491 మంది (88.68 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించి.. కృత్రిమంగా ఉత్తీర్ణతను పెంచే చర్యలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని మంత్రి బొత్స చెప్పారు. ఆ మీడియా కథనాలు అసత్యం.. ప్రతి ఒక్క విద్యార్థిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది.. వారికి మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు. ఇందుకోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పాఠశాలలు విలీనం అంటూ కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ పత్రికలు రాస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇటీవల తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఇలాంటి వార్తలు వచ్చాయని అక్కడికి తాను, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెళ్లి పరిశీలించామన్నారు. ఆ స్కూళ్లలో తరగతి గదులు లేవని, ఒకే గదిలో పలు తరగతుల విద్యార్థులను కూర్చోబెడుతున్నారని తప్పుడు వార్తలు రాశాయన్నారు. కానీ ఆ స్కూళ్లలో ప్రస్తుత తరగతుల విద్యార్థులకు అదనంగా మిగులు గదులున్నాయని తెలిపారు. 99 శాతం మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు.. 99 శాతం మంది తల్లిదండ్రులు స్కూళ్ల మ్యాపింగ్‌ను సమర్థిస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. ఒక్క శాతం మంది కోసం మొత్తం మ్యాపింగ్నే రద్దు చేయాలనడం సరికాదన్నారు. తమ పిల్లలను మంచి చదువుల కోసం తల్లిదండ్రులు ఎక్కడ మంచి స్కూలు ఉంటే అక్కడికి పంపిస్తారని.. దూరాభారం వంటివి చూడరని చెప్పారు. మూడు కిలోమీటర్లు దూరమవుతుందన్న ఉద్దేశంతోనే మ్యాపింగ్‌ను ఒక కిలోమీటర్‌కు తగ్గించినట్లు వివరించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. జీవో 117 వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్సీలు తమ దృష్టికి తేగానే వాటిని సవరించి మార్పులు చేశామన్నారు. కానీ ఆ ఎమ్మెల్సీలు బస్సుయాత్రలు పెట్టి తిరుగుతున్నారని తప్పుపట్టారు. ఉద్యోగులు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాన్ని అడగవచ్చన్నారు. అంతేతప్ప రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రశ్నించరాదని స్పష్టం చేశారు. జేఈఈ కౌన్సెలింగ్ ఈఏపీసెట్ అడ్మిషన్లు.. జేఈఈ (జోసా) కౌన్సెలింగ్ అనంతరమే రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈసారి ఈఏపీసెట్ అడ్మిషన్లలో ప్రైవేటు కాలేజీల్లో 30 శాతం, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన ఫైల్ పరిశీలనలో ఉందన్నారు. కొన్ని వివరణలు అడిగామని, అవి వచ్చాక ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై యాప్‌ల భారం పడుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. సమస్య ఎక్కడ ఉందో తెలిపితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15 కల్లా ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం పిల్లల చేరికల గణాంకాలపై స్పష్టత వస్తుందన్నారు. ప్రయివేటు స్కూళ్లను మూసివేయించాలన్నది ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. గత విద్యా సంవత్సరం వరకు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా చేరారని వివరించారు. నాడు నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ విధానం ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఉన్నత ప్రమాణాల కోసమే.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధనను అందించేందుకు వీలుగా 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు మ్యాపింగ్ చేస్తున్నామే తప్ప విలీనం చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న మేరకు సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠశాల విద్యలో మార్పులు తెస్తున్నామన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని మళ్లీ పరిశీలన చేయించి సరిదిద్దుతున్నామన్నారు. తరగతుల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి అభిప్రాయాలు సేకరించామన్నారు. 5,800 స్కూళ్లను మ్యాపింగ్ చేస్తే 400 స్కూళ్లలోనే చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారన్నారు. వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. -
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 45శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,07,694 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,06,240 మంది పరీక్షలు రాశారు. వీరిలో 48,644 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 45.79గా నమోదైంది. బాలురు 44.05 శాతం, బాలికలు 48.06 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో వరంగల్ గ్రామీణ జిల్లా 89.08 శాతంతో ముందు వరుసలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా 23.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. పరీక్ష ఫలితాలను విద్యాశాఖ bse.telangana.gov.inలో అందుబాటులో ఉంచింది. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున సంబంధిత హెడ్మాస్టర్ సూచన మేరకు బ్యాంకు ద్వారా ఈ నెల 8లోగా చెల్లించాలి. జవాబు పత్రాల జిరాక్సు ప్రతుల కోసం ఈ నెల 8 నుంచి 16 వరకు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చెల్లించాలి. 2017 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 59.93% ఉత్తీర్ణత నమోదైంది. -
నేడు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 6న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో ఫలితాలను గురువారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల విద్య డైరెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఫలితాలను పాఠశాల విద్య ఇన్చార్జి కమిషనర్ విజయ్‌కుమార్ విడుదల చేయనున్నారు. గత నెలలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,00,237 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www. sakshieducation. com, www. sakshi. com, bsetelangana. org, results. cgg. gov. in వెబ్‌సైట్‌ల్లో పొందవచ్చు.