breaking news
telugu techie
-
అమెరికాలో తెలుగు బిడ్డల విషాదాంతం
కన్న బిడ్డను కాపాడబోయి.. ఈత కొలనులో మునిగి తండ్రీకుమారుడి మృతి పట్నంబజారు (గుంటూరు తూర్పు): స్విమ్మింగ్ పూల్‌లో పడిన కన్నబిడ్డను రక్షించబోయి తండ్రి కూడా దుర్మరణం పాలైన ఘటన అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. గుంటూరులోని నెహ్రూనగర్ పదో లైన్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూరేపల్లి నాగరాజు(33), ఆయన కుమారుడు అనంతసాయి(3) మృత్యువాత పడ్డారు. అనంతసాయి డెట్రాయిట్‌లోని తమ నివాసం వద్ద ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు తండ్రి నాగరాజు కూడా కొలనులోకి దూకినట్లు సమాచారం. ఆయన సైతం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం ఐదడుగుల లోతు ఉండే స్విమ్మింగ్ పూల్‌లో పడి నాగరాజు ఎలా మరణించాడో అర్థం కావడం లేదని బంధువులు అంటున్నారు. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన సూరేపల్లి శివలింగయ్య ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. నాగరాజు కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచాడు. బీటెక్ చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. చెల్లెళ్ల వివాహాలు చేసి చేదోడువాదోడు అయ్యాడు. 2012లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హిమబిందును వివాహం చేసుకుని బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. నాగరాజును ఇన్ఫోసిస్ యాజమాన్యం 2014 సెప్టెంబర్‌లో అమెరికాకు పంపించింది. కాగా ఈ నెల 6వ తేదీ నాటికి మృతదేహాలు గుంటూరుకు చేరే అవకాశాలు ఉన్నాయని బంధువులు తెలిపారు. -
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
-
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో దుర్మరణం చెందారు. ముదినేపల్లికి చెందిన వల్లభనేని హరీష్ (42) అమెరికాలోని పిట్స్బర్గ్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. బయటకు వెళ్లేందుకు కారు స్టార్ట్ చేయబోతే అది స్టార్ట్ కాలేదని, దాంతో ముందుకు వెళ్లి బోనెట్ ఎత్తి చూస్తుండగా.. ముందు అంతా బాగా డౌన్ ఉండటంతో కారు ఒక్కసారిగా ముందుకు దూకిందని.. దాంతో కారు అతడి ఛాతీ మీదుగా వెళ్లి చనిపోయాడని సమాచారం అందింది. హరీష్ తల్లిదండ్రులకు అతడి మృతి గురించిన సమాచారం బుధవారం సాయంత్రం దాటిన తర్వాత తెలిసింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుర్ఘటన జరగడానికి గంట ముందు కూడా స్వదేశంలోని కుటుంబ సభ్యులతో మాట్లాడాడని అంటున్నారు. ముదినేపల్లిలోని హరీష్ ఇంటివద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.