breaking news
Telangana writers Platform Maha Sabha
-
గమనం, గమ్యం రెండూ ప్రజల పక్షమే
అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు – అన్న కాళోజీ గౌరవాధ్యక్షుడిగా అంకురించిన సంస్థ తెలంగాణ రచయితల వేదిక (తెరవే). 2001లో పుట్టిన నాటి నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా కవులు రచయితలూ కళాకారుల్ని తెరవే కూడగట్టింది. చరి త్రలో తెలంగాణా రచయితది ఎప్పటికీ ప్రతిఘటన స్వరమే అని నిరూపించింది. మలిదశ ప్రత్యేక రాష్ట్రో ద్యమంలో ధిక్కారానికి నిలువెత్తు రూపమై నిలబడింది. తెలంగాణా ప్రజల ఆకాంక్షల్ని వినిపించే గొంతుక అయ్యింది. తెరవే నడిపిన ‘సోయి’ పత్రిక తెలంగాణ సోయిని ఊరూ వాడా ప్రచారం చేసి అన్నివిధాలా ఉద్యమ వేదికగా మారింది. ఉమ్మడిపాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణా చరిత్రని తవ్వి తీసే పనికి సైతం తెరవే స్వచ్చందంగా పూనుకొంది. సొంత రాష్ట్రం సొంత ప్రభుత్వం యేర్పడ్డాక సైతం తెలంగాణా రచయితల వేదిక తన చారిత్రిక కర్తవ్యాన్ని విస్మరించలేదు. ప్రజల కలల్ని పాలకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయ లేదు. ప్రతి సామాజిక సమస్యకూ ప్రతిస్పందించింది. పాలకులకు దిశా నిర్దేశం చేసింది. ప్రజావసరాల దృష్ట్యా తెరవే సాహిత్య సాంస్కృతిక విధానాలనే కాదు రాజకీయ విధానాల్ని కూడా తెలియజెప్పింది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి సందర్భం లోనూ నిర్మొహమాటంగా ఖండించింది. కానీ ఈ నాలుగేళ్లలో తెలంగాణ బుద్ధిజీవుల సమాజం రెండుగా విడిపోయింది. తెలంగాణా రాష్ట్రోద్యమంలో అన్నిటికీ తెగించి ముందు నిలబడ్డ రచయితలు, కళాకారులు సైతం రాష్ట్రం రాగానే యిక చేయాల్సిందేం లేదని మౌనాన్ని ఆశ్రయించారు. ఉద్యమ కాలంలో యిచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత టైమివ్వాలని కొందరు ప్రజా సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి కిమ్మనకుండా ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళని అసంతృప్తవాదులుగా అభివృద్ధి నిరోధకులుగా స్టాంప్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అవార్డులు, సన్మానాలు, సత్కారాల కోసం పాలకుల ముంగిట క్యూ కడుతున్నారు. కొందరు అందివచ్చిన పదవుల్లో సుఖాసీనులై గతాన్ని మర్చిపోయారు. నాగేటి చాళ్ళలో సాయుధమైన పాట ఫామ్ హౌస్‌లో పాలకుల కటాక్షం కోసం పడిగాపులు కాస్తోంది. గడీలను కూల్చిన కవిత చరి త్రని నమోదు చేసే పేరుతో గడీల ఘనతని కీర్తిస్తోంది. ఇలా కవులూ కళాకారులూ ప్రలోభాలకో, బెదిరింపులకో లొంగిపోయి చెట్టుకొకరూ పుట్టకొకరూ చెదిరిపోతే తెరవే ఒంటరి పోరాటం చేస్తూ చెట్టుకిందే కవిత్వం వినిపించింది. బాట పొంటే పాటని ఎత్తుకొంది. ఎందరో కొత్త రచయితల పుస్తకాలను ప్రచురించి, ఆవిష్కరించి వారికి దన్నుగా నిలబడి మార్గ దర్శనం చేసింది. కలబుర్గి, గౌరీ లంకేశ్ దుర్మరణం పాలైనప్పుడు కలసి వచ్చిన ప్రజా సంఘాలతో తీవ్రంగా నిరసన తెలియజేసింది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో రచయితలపై, మేధావులపై అమలయ్యే అణచివేతలకు వ్యతిరేకంగా భావప్రకటన స్వేచ్ఛ కోసం ప్రజాస్వామిక హక్కులకోసం గొంతెత్తి సాయిబాబా అక్రమ అరెస్టుని, ఐలయ్యపై దాడుల్నీ, వరవరరావుపై కుట్ర కేసుల్నీ నిర్ద్వంద్వంగా ఖండించింది.ఒక సాహిత్య సంస్థగా తెరవే తనకు పరిమితులు విధించుకోలేదు. ధూళికట్ట స్థూపం, రామప్ప దేవాలయం మొదలైన చారిత్రిక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేసింది. అక్రమ క్వారీల కారణంగా విధ్వాంసమవుతున్న పర్యావరణం గురించి హెచ్చరించింది. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగిన తెలంగాణా వనరుల దోపిడీని ఒక రచయితల వేదిక తన ఆచరణలో భాగం చేసుకోవడం గమనిస్తే తెరవే కార్యక్రమాల విస్తృతి అర్థమౌతుంది. తెలంగాణా భాష విశిష్టతల గురించి అధ్యయనం చేయడానికి తొలిసారిగా భాషావేత్తలతో సమావేశాలు నిర్వహించి తెలంగాణా భాష రూపురేఖల్ని నిర్వచించి అది ప్రత్యేక భాష అని నిరూపించడానికి పూనుకున్న ఘనత తెరవేదే. తెలంగాణా పరివ్యాప్తంగా వున్న సమస్త కళాసంపదనీ కాపాడడానికి తెరవే పూనుకొంది. చెంచు పెంటల్లో మందులు పంపిణీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన పాదయాత్రలో అగ్రభాగాన నడిచింది. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల సంస్మరణకు డిమాండ్ చేసింది. ప్రజల జీవన ఆకాం క్షలు నెరవేరాలని కవులూ రచయితలూ కళాకారులూ బుద్ధిజీవులూ కోరుకోవాలి. ఎందరో అమరులు ప్రాణాలు సాకపోసి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి కాకుండా కాపాడుకోవడమే ప్రజల ముందున్నా కర్తవ్యం. దాన్ని కవులూ రచయితలూ కళాకారులూ మేధావులూ ప్రేమగా తలకెత్తుకోవాలని తెరవే రాష్ట్ర సభల్లో మరోసారి తీర్మానించుకుందాం. (రేపు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెరవే మహాసభల సందర్భంగా) ఎ.కె.ప్రభాకర్ వ్యాసకర్త ప్రముఖ విమర్శకులు -
చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్
తెలంగాణ రచయితల వేదిక మహాసభల్లో కోదండరాం కరీంనగర్ కల్చరల్: గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్‌కు ప్రణాళికలు వెయ్యగలమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా మహాసభలు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ చదువుకున్నవాళ్లు మౌనంగా ఉండడం పెద్ద నేర మన్నారు. తెలంగాణ చరిత్రను తిరిగిరాస్తేనే భవిష్యత్తుకు దారి దొరుకుతుందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయడం వల్ల పెట్టుబడిదారులే బలపడుతున్నారన్నారు. సామాన్యుడికి వైద్యం అందించే పరిస్థితుల్లో దవాఖానాలు లేవన్నారు. అం దుకు నిదర్శనం ఉస్మానియా ఆసుపత్రేనన్నారు. సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరే దిశలో రచయితలు పనిచేయాలని ఆకాంక్షిం చారు. వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్, వేదిక అఖిలభారత అధ్యక్షుడు జూకం టి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, కథా రచయిత అల్లం రాజయ్య, జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు నగునూరి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ సాహిత్య వికాసం’ పుస్తకాన్ని శతాధిక గ్రంథకర్త మలయశ్రీ ఆవిష్కరించారు. కూకట్ల తిరుపతి రాసిన ఆరుద్ర పురుగు కవితా సంపుటిని కె.శ్రీనివాస్ ఆవిష్కరించారు.