breaking news
Teaching and non-teaching staff
-
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
సాక్షి, అమరావతి: అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరయ్యే బోధన, బోధనేతర సిబ్బందిని గుర్తించి, వారిని వెంటనే సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. ఎవరెవరిని సర్వీసు నుంచి తొలగిస్తారంటే.. అనుమతులు లేకుండా ఏడాదికి మించి విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, సెలవు పెట్టి అయినా, పెట్టకుండా అయినా ఐదేళ్లుగా విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితి దాటిపోయినా ఇతర విభాగాల్లో కొనసాగుతూ స్కూళ్ల విధులకు గైర్హాజరవుతున్న వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు చేపడతారు. అనుమతిలేకుండా గైర్హాజరైన కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని హెచ్ఎంలు, ఎంఈవోలు, టీచర్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ నుంచివినతులు వస్తున్నాయి. అయితే గైర్హాజరవ్వడం సర్వీస్ రూల్సు ప్రకారం మిస్‌కాండక్టుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవలసిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 30 రోజులకుపైగా అనధికారికంగా ఆబ్సెంటులో ఉన్న హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బందిని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలి. ఎవరైనా ఏడాదికి మించి రిపోర్టు చేయకుండా ఉన్న వారుంటే వారి పేర్లను పత్రికల్లో ముద్రించేలా చర్యలు చేపట్టాలి. అనంతరం వారి పేర్లను గెజిట్‌లో ముద్రించి చర్యలు చేపట్టాలి. (ఆ లిమిట్స్ దాటితే అనేక సమస్యలు వస్తాయి) -
వర్సిటీలపై సర్కారు దృష్టి
* సిబ్బంది నియామకానికి చర్యలు * డిసెంబర్ నాటికి నోటిఫికేషన్లు జారీ! * రూసా నిధులు రావాలంటే సిబ్బంది ఉండాల్సిందే * ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యాశాఖ ఆలోచనలు * వర్సిటీల చట్టానికి తుది రూపు.. త్వరలో సీఎంకు ఫైలు * అమల్లోకి వచ్చాక వీసీలు, సిబ్బంది నియామకం సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో సిబ్బంది లేక బోధన కుంటుపడింది. దీనికి తోడు ఉన్నత విద్యాభివృద్ధికి రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కేంద్రం నిధులు ఇవ్వాలంటే వర్సిటీల్లో రెగ్యులర్ వైస్ చాన్సలర్లతో పాటు బోధన సిబ్బంది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బోధన సిబ్బంది నియామకాల పైనా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నియామకాల ద్వారా వర్సిటీలను గాడిలో పెట్టాలన్న యోచనతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీల కోసం కొత్తగా చట్టాన్ని రూపొందిస్తోంది. ప్రస్తుతం చట్టం రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ఇందులో ప్రధానంగా వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఎక్కువగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వర్సిటీలకు గవర్నర్‌ను చాన్సలర్‌గా కాకుండా.. ఒక్కో వర్సిటీకి ఒక్కొక్క రంగానికి చెందిన ప్రముఖుడ్ని చాన్సలర్‌గా నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం న్యాయ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీల చట్టం డ్రాఫ్ట్ కాపీ సిద్ధం కావచ్చింది. విదేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తిరిగి రాగానే ఆయన అనుమతితో సీఎం కేసీఆర్ ఆమోదం కోసం చట్టం డ్రాఫ్ట్ కాపీని పంపించనున్నారు. దానికి సీఎం వెంటనే ఓకే చెబుతారా? లేక చైనా పర్యటనకు వెళ్లి వచ్చాక ఆమోదిస్తారా.. అన్నది తేలాల్సి ఉంది. సీఎం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. ఆ తరువాత చాన్సలర్లు, వైస్ చాన్సలర్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు, సిబ్బంది నియామకాలను ఒక్కొక్కటిగా చేపట్టనుంది. మొత్తానికి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు డిసెంబర్ నాటికి యూనివర్సిటీల వారీగా నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 10 వర్సిటీలకు కొత్త వీసీలు.. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో (ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, అంబేడ్కర్ ఓపెన్, జేఎన్టీయూహెచ్, జేఎన్‌ఏఎఫ్‌యూ) ఏ ఒక్క విశ్వ విద్యాలయానికి పూర్తిస్థాయి వైస్ చాన్సలర్లు (వీసీ) లేరు. ఆయా యూనివర్సిటీల్లో ముందుగా చాన్సలర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టనుంది. వారి నియామకాలు పూర్తి కాగానే వీసీలను నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. సగం సిబ్బంది లేరు.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 2,232 మంజూరైన పోస్టులు ఉంటే ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. 1,110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. పాలమూరు వర్సిటీ ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. శాతవాహనలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసి 21 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఓయూలో 1,230 వరకు మంజూరైన పోస్టులుంటే 600 మంది పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ వర్సిటీలో 14 పోస్టులు ఉంటే నలుగురే పనిచేస్తున్నారు.