breaking news
Tamil Nadu lawyers
-
బ్లాక్‌లిస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పవిత్రమైన న్యాయవాద వృత్తిని అపవిత్రంగా మార్చారనే ఆరోపణలపై పది మంది న్యాయవాదులను తమిళనాడు బార్ కౌన్సిల్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. న్యాయవాద వృత్తికి జీవితాంతం దూరం చేస్తూ నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా టాస్మాక్ సంస్థలో ఉద్యోగం చేస్తూ న్యాయవాద వృత్తిని అభ్యసించడం, నేర చరిత్రను కలిగి ఉండడం వంటి కారణాలపై పదిమందిపై వేటుపడింది. న్యాయవాదిగా పట్టా పుచ్చుకున్న తరువాత సదరు వ్యక్తి తమిళనాడు బార్ కౌన్సిల్లో పేరును నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకునే సమయంలో తనపై ఎటువంటిక్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే కొందరు న్యాయవాదులు తమ నేరచరిత్రను దాచిపెట్టి తమ పేర్లను నమోదు చేసుకున్నారని తమిళనాడు బార్ కౌన్సిల్‌కు ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో తమిళనాడు బార్‌కౌన్సిల్ పేర్లను నమోదు చేసుకున్నవారి వివరాలను సమీక్షించారు. కన్యాకుమారీ జిల్లాకు చెందిన కార్తికేయన్, ఆదికేశవన్, మురళీ, రామచంద్రన్, స్టాన్లీముల్లవర్ తమపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిపెట్టిన సంగతి బైటపడింది. వీరందరికీ బార్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. అలాగే టాస్మాక్ సంస్థలో పనిచేస్తూ చదువుకున్న వెంకటేశన్, కవిదాసన్, తూయవన్, మనివణ్ణన్, ఫార్మసీ వ్యాపారం చేస్తూ న్యాయవాద కళాశాలకు వెళ్లిన రమేష్‌బాబులను కూడా గుర్తించారు. వీరికి కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు వారు పంపిన సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ పదిమందిని బార్ కౌన్సిల్ సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక జీవితాతం వారు న్యాయవాద వృత్తిని చేపట్టరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా, నకిలీ పట్టాలతో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న వారిని సైతం గుర్తించేందుకు బార్ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. పునఃపరిశీనకు సర్టిఫికేట్లను సమర్పించాల్సిందిగా రాష్ట్రంలోని 90 వేల మంది న్యాయవాదులను బార్ కౌన్సిల్ కోరగా కేవలం 256 మంది మాత్రమే సమర్పించారు. సర్టిఫికెట్ల తనిఖీలకు సహకరించని న్యాయవాదులపై కూడా తగిన చర్య తీసుకుంటామని బార్ కౌన్సిల్ హెచ్చరించింది. ముగిసిన పదవీకాలం: ఇదిలా ఉండగా తమిళనాడు బార్ కౌన్సిల్ పదవీకాలం ఈనెల 19వ తేదీతో ముగిసింది. బార్ కౌన్సిల్‌ను నిర్వహించేందుకు ముగ్గురితో కూడిన ప్రత్యేక బృందాన్ని అడ్వకేట్ జనరల్ నియమించారు. అడ్వకేట్ జనరల్ ఆర్ ముత్తుకుమారస్వామి ఈ బృందానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తుండగా టీ సెల్వం, పీఎస్ అమల్‌రాజ్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ బృందానికి సహాయకులుగా సీనియర్ న్యాయవాదులు ఏ నటరాజన్, ఏఏ వెంకటేశన్, కేఆర్ఆర్ అయ్యప్పమణి తదితర 16 మంది తాత్కాలికంగా నియమితులయ్యారు. -
అనుమతి చిచ్చు
తమిళనాడు న్యాయవాదుల సంఘానికి బార్ కౌన్సిల్ అనుమతి కల్పించడం వివాదానికి దారి తీసింది. అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిరసన బాట పట్టింది. బార్ కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా విధులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు. న్యాయవాదుల మధ్య విభేదాలు సృష్టించి చీలికకు దారి తీసేలా బార్ కౌన్సిల్ వ్యవహరిస్తోందని నిరసనకారులు విమర్శించారు. సాక్షి, చెన్నై: హైకోర్టు న్యాయవాదుల సంఘంలో గతంలో పని చేసిన న్యాయవాది ఎస్ ప్రభాకరన్ కొత్తగా తమిళనాడు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేశారు. తమ కార్యక్రమాల్ని విస్తృత పరుస్తూనే, బార్ కౌన్సిల్ అనుమతికి యత్నించారు. గతంలో అనుమతుల కోసం ప్రభాకరన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చెన్నై హైకోర్టు న్యాయవాదుల సంఘం వ్యతిరేకతతోనే అనుమతి వ్యవహారం ఆగింది. ఈ పరిస్థితుల్లో ఈ నెల ఎనిమిదో తేదీన తమిళనాడు న్యాయవాదుల సంఘానికి బార్ కౌన్సిల్ అనుమతి లభించడం, చెన్నై హైకోర్టు న్యాయవాదుల సంఘాన్ని విస్మయంలో పడేసింది. న్యాయవాదుల్లో చీలిక లక్ష్యంగా కుట్ర జరుగుతోందని, అందుకే హైకోర్టు ఆవరణలో మరో సంఘాన్ని ప్రోత్సహించే పనిలో బార్ కౌన్సిల్ ఉందంటూ వివాదం బయలు దేరింది. విధుల బహిష్కరణ : హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆర్సి పాల్ కనకరాజ్ నేతృత్వంలో కమిటీ సమావేశం అయింది. బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పాల్ కనక రాజ్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షుడు మోహన కృష్ణన్, న్యాయవాద సంఘం నాయకులు అరివలగన్, ఇమాన్యుయేల్ నేతృత్వంలో హైకోర్టు న్యాయవాదులు బుధవారం ఆవిన్ గేట్ వద్ద నిరసనకు దిగారు. హైకోర్టు ఆవరణలోని అన్ని బెంచ్‌ల వద్దకు వెళ్లి బయట నుంచి నినాదాలతో హోరెత్తించారు. సహచర న్యాయవాదుల్ని విధులు బహిష్కరించాలంటూ పిలుపు నిచ్చి నిరసన కొనసాగించే పనిలో పడ్డారు. న్యాయవాదుల విధుల బహిష్కరణతో విచారణకు ఆటంకాలు తప్పలేదు. నిరసనను ఉద్దేశించి పాల్ కనక రాజ్ మాట్లాడుతూ, హైకోర్టులోని న్యాయవాదుల్లో చీలిక లక్ష్యంగా భారీ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. గతంలో తాము వ్యతిరేకించి అనుమతి రద్దు చేయించామని, అయితే, చాప కింద నీరులా ప్రస్తుతం అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. బార్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.