breaking news
Tallapaka annamacaryulu
-
25న అన్నమయ్య జయంతోత్సవాలు
కూచిపూడి: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 606వ జయంతి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం 85వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈనెల 25న నిర్వహించనున్నట్లు కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా కూచిపూడిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచేకాక అమెరికాలో కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేస్తున్న 22 మంది నాట్యాచార్యుల శిష్యబృందాలు అన్నమయ్య సంకీర్తనలను ప్రదర్శిస్తారని చెప్పారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ లెటర్స్ ఆడిటోరియంలో(ఇందిరాపార్కు సిగ్నల్స్ వద్ద) సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ 124వ జయంతి ఉత్సవం జరుపనున్నట్టు కేశవప్రసాద్ ప్రకటించారు. -
ఏడుకొండల్లో ఎన్ని రూపాల్లో దాగున్నావయ్యా!
‘వేదములే శిలలై వెలసినది కొండ యే దెస బుణ్యరాసులే యేరులైన దీ కొండ గాదివి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి యీ కొండ’ అంటూ శేషాచల క్షేత్ర ఆధ్యాత్మిక తేజో వైభవాన్ని ఆవిష్కరించారు తొలి తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. వేంకటాచల క్షేత్రంలో కొండా కోన, రాయీ రప్పా, చెట్టూ పుట్టా అన్నీ కూడా స్వామివారి స్వరూపాలే. భక్తి తత్పరతతో దర్శించే కనులకు శేషాచలమంతా స్వామి తన దివ్యమంగళ రూపంతో సాక్షాత్కరిస్తాడు. రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం, శేషాచలం పరిధిలోని తిరుమల కొండలు సముద్ర గర్భంలో ఉండేవట. పరిణామ క్రమంలో సాగర జలాలన్నీ దక్షిణాది దిగువ ప్రాంతంలోకి తరలిపోయాయి. నీటి కోత, వాయు ఒరిపిడి వల్ల వికోషీకరణం చెంది ఏడుకొండలపై సహజ సిద్ధ్ద శిలారూపాలు ఆవిర్భవించాయి. యోగముద్రలో సహజ స్వామి తన దివ్యదర్శనం కోసం శ్రీవారి మెట్టు కాలిబాట మార్గంలో నడిచివచ్చే భక్తులకు అలుపూ సలుపూ లేకుండా చేయడానికి స్వామివారే తొలిగా కనబడతారు. శిరస్సుపై కిరీటం, ముఖ పై భాగంలోని నుదురు, కనురెప్పలు, కళ్లు, ముక్కు, నోరు, కంఠం, కంఠాభరణంతో స్వామి రూపం కనబడుతుంది. దీన్ని ‘సాక్షి తిరుమల ఫొటోగ్రాఫర్ కె.మోహనకృష్ణ’ తొలుత గుర్తించారు. 2012 జనవరి 4వ తేదీన ‘సాక్షి’ తన పాఠకులకు పరిచయం చేసింది. ఏడుకొండల్లో చివరి కొండ అయిన అంజనాద్రిపై చివరి మలుపు వద్ద ఉన్న ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఆయత్తం అవుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సహజ శిలాతోరణంతోపాటు తిరుమల కొండల్లో గుర్తించిన రూపాలు ఎన్నో ఉన్నాయి. శంఖ చక్రాలు, రెక్కలు చాచిన గరుడుడు, హనుమంతుడు, ఏనుగులు, మహాశివలింగం, తిరునామాలు, లక్ష్మి, వరాహస్వామి వంటి ఎన్నెన్నో రూపాలుగా వొంపు సొంపుల శిలలు రూపుదాల్చాయి. శిలలే కాలం ఉలికి కాఠిన్యం కోల్పోయి, ప్రాణం పోసుకున్నాయి. ప్రకృతి మహిమ అది! నమ్మేవాళ్లకు దైవ మహిమ కూడా!! వెంకన్న వైభోగం నాడు - నేడు అలనాడు చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. మహంతుల పరిపాలన నుంచి 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భవించే నాటికి కుగ్రామంగా ఉన్న ఈ క్షేత్రం నేడు ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నాడు వేళ్లపై లెక్కపెట్టగలిగేట్టుగా ఉన్న సిబ్బంది నేడు వేలకు పెరిగారు. వందల సంఖ్యలోపే ఉండే భక్తులు నేడు 70 వేలు దాటారు. వేలల్లో లభించే ఆలయ హుండీ ఆదాయం నేడు రోజుకు రూ.2 కోట్లు దాటింది. అలా... కాలంతోపాటు కదలి వచ్చిన మార్పులకు సజీవ ‘సాక్షీ చిత్రం’ తిరుమలక్షేత్రం.