ఓటేసి.. ఫొటో తీసుకున్న మోడీ
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ బుధవారం నాడు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో సొంత ఫొటో (సెల్ఫీ) తీసుకున్నారు. 'తల్లీ కొడుకుల' ప్రభుత్వాన్ని ఇక ఇప్పుడెవరూ కాపాడలేరంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని, కొత్త, బలమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాణిప్ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఇంకుమార్కు ఉన్న తన వేలిని ఫొటో తీసుకున్నారు. బీజేపీ గుర్తయిన కమలం గుర్తు ఎదుట లైటు వెలుగుతుండగా కూడా ఆయన ఫొటో తీసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతున్నంత సేపు ఆయన తమ పార్టీ గుర్తు అయిన కమలాన్ని చేతితో పట్టుకుని చూపిస్తూనే ఉన్నారు. ఎన్నికల సంకేతాలు ఏవీ చూపించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా, సీనియర్ నాయకుడు అయి ఉండి కమిషన్ ఆదేశాలను పాటించకపోవడాన్ని పలువురు విమర్శించారు.
ఈసారి ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరుగుతోందని, దేశానికున్న కొత్త బలం దీనివల్ల తెలుస్తోందని ఆయన అన్నారు. మే 16వ తేదీన ఎలాంటి అనుమానం అక్కర్లేకుండానే స్పష్టమైన సందేశం వెళ్తుందని చెప్పారు. గతంలోలా గుజరాత్ వాసులకు ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నందుకు వారికి క్షమాపణలు చెప్పారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ పోటీపడుతున్న గాంధీనగర్ స్థానంలో తాను ఓటరు అయినందుకు ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 89 లోక్‌సభ నియోజకవర్గాలు, తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరగాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.