breaking news
Swaccha Sathi
-
తెలంగాణకు స్వచ్ఛత శక్తి పురస్కారం
జగదేవ్‌పూర్ (గజ్వేల్): దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు స్వచ్ఛతా శక్తి అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతిని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి అందుకున్నారు. ద్వితీయ బహుమతి తమిళనాడు రాష్ట్రం దక్కించుకుంది. ‘స్వచ్ఛ సుందర్ శౌచాలయ్’లో భాగంగా ఇటీవల కేంద్ర బృందం ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి డాక్యుమెంటరీ తీసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. హరియాణా రాష్ట్రంలోని కురుక్షేత్రం గ్రామంలో మంగళవారం జరిగిన స్వచ్ఛ శక్తి పురస్కారం అందజేత కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛత శక్తి అవార్డును సర్పంచ్ భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 128 మంది మహిళా సర్పంచ్‌లతోపాటు జిల్లా నుంచి స్వచ్ఛభారత్ మిషన్ కో ఆర్డినేటర్ చెన్నారెడ్డి, కొండపాక సర్పంచ్ మాధురి, మిట్టపల్లి సర్పంచ్ వరలక్ష్మి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘స్వచ్ఛ సాథీ’ ప్రచారకర్తగా దియా మీర్జా
ముంబై: ‘స్వచ్ఛ భారత్’ అనుబంధ యువత కార్యక్రమం ‘స్వచ్ఛ సాథీ’కి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి దియా మీర్జా నియమితులయ్యారు. ఈ కార్యక్రమం కింద 2 వేలకు పైగా విద్యార్థులను నియమించుకుంటారు. వీరు 10 వేల స్కూళ్లను సమన్వయపరుస్తారు. అక్కడి విద్యార్థులచే పరిశుభ్ర భారత్ కోసం ప్రమాణం చేయిస్తారు. ప్రచారకర్తగా దియా... అవగాహన కార్యక్రమాలు, స్ఫూర్తినిచ్చే వీడియోల ద్వారా విద్యార్థులతో మాట్లాడుతారు. ‘దియా యువతకు స్ఫూర్తి ప్రదాత. స్వచ్ఛ భారత్‌లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. మరింత యువతకు చేరువయ్యేందుకు ఆమె సాయం కీలకం కానుంది’’ అని స్వచ్ఛ భారత్ డెరైక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు.