పసుపు చీర కట్టుకో.. లేదంటే యాసిడ్ పోస్తా
                  
	న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ యూనివర్సిటీకి చెందిన సెంట్ స్టీఫెన్స్ కళాశాలలో లైంగిక వేధింపులకేసు నమోదైంది. తనకు గైడ్‌గా వ్యవహరిస్తున్నప్రొఫెసర్ సతీష్ కుమార్ రెండేళ్లుగా  వేధిస్తున్నాడంటూ పీహెచ్డీ  విద్యార్థిని ఫిర్యాదుచేసింది. అతని వేధింపుల వల్ల తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని,  సరిగ్గా చదువుకోలేకపోతున్నానని ఆమె ఆరోపించింది.
	ల్యాబ్ లో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు .. పసుపు రంగు చీర కట్టుకుని  రావాలని, లేదంటే యాసిడ్ పోస్తానని  బెదిరించేవాడని ఆమె ఆరోపించింది. దాదాపు ఏడు పేజీల లేఖలో అతని వేధింపులను ఏకరువు పెట్టింది.
	
	గత డిసెంబర్లో ఆ ప్రొఫసర్పై కాలేజీ ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ కు  ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆ విద్యార్థిని వాపోయింది. పైగా సతీష్ కుమార్‌కు వత్తాసు పలికి, పీహెచ్డీ  పూర్తి కావాలంటే,  ఫిర్యాదు  వెనక్కి తీసుకోమని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు కూడా  జోక్యం చేసుకుని సతీష్‌తో మాట్లాడారని,  అయితే  మళ్లీ పొరపాటు జరగదని, క్షమించమని వేడుకొన్న సతీష్  తన బుద్ధి మార్చుకోలేదని తెలిపింది.
	
	అయితే ప్రిన్సిపల్ తంపూ తనపై వచ్చిన ఆరో్పణలను ఖండిచారు. కళాశాలలోని అంతర్గత ఫిర్యాదుల  కమిటీ ఈ విషయాన్ని  పరిశీలిస్తోందని తెలిపారు. మరోవైపు దీనికి సంబంధించి ఎవరిపైనా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.  అయితే కళాశాల రికార్డులను పరిశీలించిన మీదట సంబంధింత వ్యక్తులకు సమన్లు జారీ చేస్తామని  నార్త్ ఢిల్లీ డీసీపి మాధుర్ వర్మ తెలిపారు.