breaking news
Srilaxmi narasimha swamy
-
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రి పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం యాదాద్రికి చేరుకుంటారు. ఇటీవల ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసిన సీఎం.. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ఆయన్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభం ఉంటుందని ప్రధానికి సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన భాగ్యం త్వరలో కల్పించే ప్రధాన ఘట్టంలో భాగంగా తుదిదశ పనులు సీఎం పరిశీలించనున్నారు. తర్వాత మార్పులు, చేర్పులు ఉంటే సూచించడంతో పాటు తుది మెరుగులు దిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలను పురమాయిస్తారు. సీఎంఓ ముఖ్యకార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచారు. 17న మరోసారి ఈ నెల 17న చినజీయర్ స్వామితో కలిసి సీఎం మళ్లీ యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు యాదాద్రి ఉద్ఘాటన సందర్భంగా ఆలయంలో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమారు 3,000 మంది వేదపండితులు, రుత్విక్కులతో యాగం మహోన్నతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఉద్ఘాటనతో పాటు యాగ నిర్వహణ చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో యాగశాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవం, అంతకు ముందు కుంభాభిషేకం వంటి ప్రధాన శాస్త్రోక్త కార్యక్రమాలన్నిటి నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి చినజీయర్ స్వామిని తీసుకువస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పసిడి కాంతుల్లో యాదాద్రి యాదాద్రీశుడి క్షేత్రం సోమవారం రాత్రి పసిడి కాంతుల్లో కనువిందు చేసింది. ఆలయమంతా బంగారు వర్ణం వెదజల్లేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వైటీడీఏ అధికారులు ట్రయల్ రన్ వేశారు. గతంలో తూర్పు, ఉత్తర రాజగోపురాల వైపు మాత్రమే విద్యుత్ దీపాలను ప్రయోగాత్మకంగా వెలిగించగా.. సోమవారం రాత్రి ఆలయ మండపాలు, రాజగోపురాలు, తిరువీధుల్లోనూ బంగారు రంగులో కనువిందు చేసే విద్యుత్ దీపాలను ట్రయల్ వేశారు. -
యాదాద్రి ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
యాదగిరిగుట్ట: భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులోని రెండో మూలమలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షానికి మరిన్ని బండరాళ్లు పడే అవకాశం ఉందని వాహనాలను మొదటి ఘాట్ రోడ్డు గుండా మళ్లించారు. తర్వాత ఆర్అండ్బీ అధికారులు రోడ్డుపై ఉన్న బండరాళ్లను జేసీబీతో తొలగించారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా బాలాలయ ఆవరణలో గతంలో వేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. కొండపై నూతనంగా నిర్మించిన క్యూలైన్లల్లోకి వర్షపు నీరు చేరింది. కాగా, కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు వర్షం కారణంగా నిలిచిపోయాయి. -
సింహవాహన సేవలో నారసింహుడు
నల్లగొండ (యాదగిరికొండ) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు బుధవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవలో దర్శనమిచ్చారు. ఉదయం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి గోవర్ధనగిరిధారి అలంకారంలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అర్చకులు, రుత్విక్కులు, వేద పండితులు వేద పారాయణాలు పఠిస్తూ ఊరేగింపుగా బయలుదేరారు. రాత్రి స్వామివారు సింహవాహన సేవలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు.