ప్రొఫెసర్ స్పందన కథ సుఖాంతం
                  
	హైదరాబాద్ :  అదృశ్యమైన అగ్రికల్చరల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పందన భట్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. సూసైడ్‌నోట్ రాసి కనిపించకుండా పోయిన ఆమె స్వయంగా  ఇంటికి చేరుకుంది. దాంతో స్పందన భట్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.   బుధవారం ఉదయం విధులకు వెళ్లిన స్పందన తన తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పడంతో పాటు డైరీలో సూసైడ్ నోట్ కూడా రాసి అదృశ్యమైన విషయం తెలిసిందే.  
	
	దాంతో కుటుంబ సభ్యులు వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మొదట స్పందన జహీరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది.
	
	కాగా స్పందన ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రాజును వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి రాజు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కట్నం డబ్బులతో  రాజు జల్సాలు చేసేవాడన్న ఆరోపణలున్నాయి. ఏదైనా ఉద్యోగం చేయాలని  భర్తకు  అనేకసార్లు చెప్పి విసిగిపోయిన స్పందన చివరకు మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి  అదృశ్యమైనట్టు సమాచారం.  అయితే స్పందన క్షేమంగా  ఇంటికి రావటంతో  కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.