breaking news
SP alliance
-
యాదవ్ VS యాదవ్
ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగుకు సిద్ధపడుతుండటంతో బీజేపీ, గట్బంధన్ (ఎస్పీ, బీఎస్పీ కూటమి)లు తమతమ ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి. గత ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతి విపక్షాల ఓటు బ్యాంకును కొల్లగొట్టడంతో సఫలీకృతురాలయ్యారు. అదే వ్యూహాన్ని ఈ సారి ఇరు పక్షాలు అమలు పరుస్తున్నాయి. ఈసారి బీజేపీ ఎస్పీకి చెందిన యాదవులు, బీఎస్పీకి చెందిన జాటవుల ఓట్లను ఏ మేరకు లాక్కోగలదన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్పీ, బీఎస్పీలు రెండూ కులం ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీలు. ఆయా సామాజిక వర్గాల గట్టి మద్దతుతో రాష్ట్రంలో ఇవి రెండూ బలంగా వేళ్లూనుకున్నాయి. 2002లో మాయావతి బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత కాలానికే ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తాను అధికారంలోకి రావడం కోసం బీఎస్పీని చీల్చారు. దీని వెనుక అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉందన్న వార్తలు వినిపించాయి. మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగేనాటికి ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మాయావతి సరికొత్త రాజకీయ సమీకరణకు శ్రీకారం చుట్టారు. గెలుపోటములను సామాజిక వర్గాలు ప్రభావితం చేసే కొన్ని నియోజకవర్గాల్లో మాయావతి విపక్షానికి చెందిన యాదవ నేతలను తమ పార్టీ తరఫున ఆ నియోజకవర్గాల్లో బరిలో దింపారు. లక్నో వీఐపీ గెస్ట్‌హౌస్‌లో మాయావతిపై దాడి కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న రమాకాంత్ యాదవ్, ఉమాకాంత్ యాదవ్‌లకు ఆజంగఢ్, మచిలీషెహర్ టికెట్లు ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నేత బాల్‌చంద్ర యాదవ్‌ను ఖలీలాబాద్ నుంచి, మిత్రసేన్ యాదవ్‌ను ఫైజాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపారు. మాయావతి చేసిన ఈ ప్రయోగం ఫలిం చింది. బీఎస్పీ ఓట్లను యాదవ అభ్యర్ధులకు మళ్లించగల సత్తా తనకుందని మాయావతి నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గాలన్నింటిలో ఎస్పీతో జరిగిన ముఖాముఖి పోటీలే మాయావతి అభ్యర్ధులంతా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి పది మంది యాదవ ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టారు. వీరిలో నలుగురు బీఎస్పీ టికెట్‌పై గెలిస్తే, ఐదుగురు ఎస్పీ తరఫున విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఎస్పీ నేతలు ఐదుగురిలో ములాయం, అఖిలేశ్‌లు ఉన్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా తాజా ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జత కట్టి బీజేపీపై పోరుకు దిగాయి. ఈ కూటమి దాదాపు డజను మంది యాదవ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఎస్పీకి చెందిన యాదవుల ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తున్న బీజేపీ కేవలం ఒకే ఒక యాదవుడికి (భోజ్‌పురి గాయకుడు దినేశ్ లాల్ యాదవ్)టికెట్ ఇచ్చింది. ఈయనను ఆజంగఢ్‌లో అఖిలేశ్‌పై పోటీకి దించింది. ఈ సారి కాంగ్రెస్ కూడా ఇద్దరు యాదవ నేతలకు–బాలచంద్ర యాదవ్, రమాకాంత్ యాదవ్– టికెట్లు ఇచ్చింది. వీరు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి బీఎస్పీ. ఇక్కడ మాయావతి ఇద్దరు బ్రాహ్మణ నేతలను రంగంలో దించింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి దక్కిన ఈ సీట్లలో తమ ఓట్లను బీఎస్పీకి మళ్లించడం సమాజ్‌వాదీ పార్టీకి సవాలేనని పరిశీలకులు చెబుతున్నారు. -
‘బీజేపీ ఓటమికే కూటమి’
లక్నో: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీలో జరిగిన గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో ఎస్సీ- బీఎస్పీ కూటమిగా పోటీచేసి సీఎం యోగీ ఆదిత్యానాథ్ సొంత నియోజవర్గంలో బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అవే ఫలితాలను పునరావృతం చేయాలని, మతతత్వ బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమిగా పోటీచేస్తున్నట్లు మాయావతి తెలిపారు. సీట్ల పంపకాల విషయంలో ఎస్పీ అధినేత అఖిలేష్‌తో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసిన ఎస్పీ-బీఎస్పీ 41శాతం ఓట్లను సాధించాయి. 43శాతం ఓట్లను సాధించిన బీజేపీ 73 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎస్పీ ఐదు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ అసలు ఖాతా తెరవలేకపోయింది. మతతత్వ బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులు ఏకం కావల్సిన అవసరముందని, దానిలో భాగంగానే ఎస్పీతో పొత్తు అని మాయావతి పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న కైరానా, నూర్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-ఆర్ఎల్డీ అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. -
మోదీ వృద్ధుడయ్యారు..
► యూపీలో యువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ► ఎన్నికల ప్రచారంలో రాహుల్ జౌన్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీకి వయసు మీదపడిందని, అలసిపోయారంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్రా్తలు సంధించారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమి యువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. సోమవారం జౌన్ పూర్లో ఆయన మాట్లాడుతూ... తమ నేతృత్వంలోని యువ ప్రభుత్వం యూపీని ప్రపంచానికి కర్మాగారం మారుస్తుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రధమ మహిళ మిషెల్ ఒబామా కూడా తన వంట గదిలో ‘మేడిన్ జౌన్ పూర్’ పాత్రల్ని కలిగి ఉండే రోజు వస్తుందన్నారు. ‘మేడిన్ ఉత్తరప్రదేశ్’ ఉత్పత్తులు ప్రపంచమంతా లభ్యమవుతాయని పేర్కొన్నారు. ‘మోదీకి తప్పనిసరిగా సాయం చేయాలని నేను అఖిలేశ్‌కి చెప్పాను. ఆయనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కోరా. అఖిలేశ్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మోదీ విశ్రాంతి పొందుతారు’ అని రాహుల్ చెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీ వరుస రోడ్‌షోలపై స్పందిస్తూ... మోదీ సినిమాలో పదే పదే రీటేక్‌లు తీసుకుంటున్నారని చమత్కరించారు. నాలుగు రోజుల్లో నాలుగు రీటేక్‌లు తీసుకున్నారని, అయితే ఆశించిన ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు. వారణాసి ఫలితంపై మోదీ భయపడుతున్నారని, అందుకే గత మూడు రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. గంగా మాత పుత్రుడిగా మోదీ అభివర్ణించుకోవడాన్ని తప్పుపడుతూ... భారత్‌లో గంగా నదికి ఒక్కరే కొడుకు ఉన్నారా? అన్న ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలన్నారు.