ముద్ద సీన్‌ని తొలగిస్తారా?.. సెన్సార్ టీమ్‌పై నటి ఫైర్!
సినిమాలో ముద్దు సీన్ తొలగించిన సెన్సార్ బోర్డ్‌పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు థియేటర్స్ రాకుండా వెళ్తారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులను చిన్నపిల్లల భావించి, థియేటర్ని అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారంటూ సెన్సార్ బోర్డ్‌పై మండిపడింది. వివరాల్లోకి వెళితే..డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా ‘సూపర్ మ్యాన్’(Superman) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండియన్ వెర్షన్లో 33 సెకన్ల ముద్దు సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్‌ని తొలగించారు. సెన్సార్ టీమ్ అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. దీనిని నటి శ్రేయా ధన్వంతరి తప్పుపట్టింది. ఇదొక అర్థంపర్థం లేని చర్య అని సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. ‘సూపర్ మ్యాన్‌లో 33 సెకన్ల ముద్దు సీన్‌ని తొలగించడం ఏంటి? ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలని సెన్సార్ వాళ్లే చెబుతుంటారు. పైరసీని ప్రొత్సహించొద్దని అంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి అర్థంపర్థం లేని పనులు చేస్తారు. వాళ్ల లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న సీన్లను కూడా కట్ చేసి.. థియేటర్ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారు. మేమే డబ్బులు పెడుతున్నాం..మేమే సమయం కేటాయిస్తున్నాం కదా.. మరి మాకు నచ్చింది చూడకుండా ఆపుతారెందుకు? మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడడానికి థియేటర్ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లలా భావించి.. థియేటర్స్ అనుభూతిని ఆస్వాదించకుండా చేస్తున్నారు’ అని సెన్సార్ బోర్డుపై ఫైర్ అయింది.శ్రేయా ధన్వంతరి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ‘జోష్’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్‌లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.