బంగ్లాదేశ్ ఓపెన్ విజేత రుత్విక
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ జూనియర్ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని స్వదేశం బయట తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. ఢాకాలో శనివారం ముగిసిన బంగ్లాదేశ్ ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నమెంట్లో అన్‌సీడెడ్ రుత్విక సంచలన విజయం సాధించి విజేతగా అవతరించింది. 70 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 137వ ర్యాంకర్ రుత్విక 23-21, 19-21, 21-18తో టాప్ సీడ్, ప్రపంచ 36వ ర్యాంకర్ ఐరిస్ వాంగ్ (అమెరికా)పై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.
పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల రుత్విక కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గతేడాది ముంబైలో జరిగిన టాటా ఓపెన్ టోర్నీలో రుత్విక విజేతగా నిలిచి తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా ఉన్న రుత్వికకు తాజా విజయంతో 1,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 75 వేలు)తోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.