breaking news
shankarmath
-
ఫేస్ బుక్ కలిపింది ఇద్దరినీ
ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, టిక్‌టాక్... టెక్నాలజీలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు... అందరూ అందులోనే మునిగిపోతున్నారు. అందుకే టెక్నాలజీ వచ్చి అందరినీ పాడు చేసేస్తోంది, ఎంతసేపూ సోషల్ మీడియాలో కూర్చుని సమయాన్ని వృథా చేస్తున్నారు అంటూ అందరూ టెక్నాలజీని తిడుతూనే ఉంటారు. అందులో వాస్తవం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, టెక్నాలజీ వల్ల మంచి కూడా జరుగుతుంది అని నిరూపించారు ఒక జంట. ఒడిషా సంబల్‌పూర్‌కి చెందిన లక్ష్మీరాణి (43), ఝార్ఖండ్కి చెందిన మహాబీర్ ప్రసాద్ శుక్లా (48)లు మార్చి 21, 2021 ఆదివారం శంకరమఠంలో ఒక్కటయ్యారు. వీరిద్దరినీ ఫేస్బుక్ కలిపింది. ఇద్దరూ పుట్టుకతో బధిరులు. పుట్టుక నుంచి ఇద్దరికీ వినపడదు, మాట్లాడలేరు. లక్ష్మీరాణి మెట్రిక్యులేషన్ చదివారు. కుట్లు, బ్యుటీషియన్ కోర్సు పూర్తి చేశారు. మహావీర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఆరు నెలల క్రితం లక్ష్మీరాణికి మహావీర్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఇద్దరూ ఫోన్ ద్వారా మాట్లాడుకోలేరు కనుక, సోషల్ మీడియాలో మెసేజెస్ ద్వారా భావాలను పంచుకున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే ... వీరిద్దరూ వాట్సాప్ వీడియో కాల్లో వారి చేతుల మాటలలో మాట్లాడుకున్నారు. చూపులు కలిశాయి. చూపులతో పాటు ఇద్దరి భావాలూ కలిశాయి. ఇంకేం... ఒక్కటవ్వాలనుకున్నారు. టెక్నాలజీకి ఇద్దరూ చేతులెత్తి నమస్కరించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు చేతులతో మాట్లాడుకుని, ఒకరి భావాలను ఒకరితో పంచుకుని, ఇద్దరూ మనసులు ఏకమై, ఇద్దరూ ఒక్కటవ్వడానికి సాంకేతిక పరిజ్ఞానమే ఉపయోగపడిందంటున్నారు ఈ నూతన జంట. ‘‘మా ఆంటీకి మహాబీర్ మామ ఫేస్బుక్లో కనిపించాడు. వీరిద్దరూ సోషల్ మీడియాలోని అన్ని వేదికలను ఉపయోగించుకున్నారు. ఇద్దరూ ఒకరితో ఒకరు బాగా సన్నిహితంగా మాట్లాడుకున్న తరవాత, మా ఆంటీ మహాబీర్ మామను వివాహం చేసుకుంటానని తన నిర్ణయాన్ని తెలిపింది, మామ కుటుంబీకులు కూడా అంగీకరించారు’ అంటాడు ఇరవై ఒక్క సంవత్సరాల లక్ష్మీరాణి మేనల్లుడు అర్ణవ బాబు. ఆమెకు ఇలా వివాహం కుదురుతుందని ఎన్నడూ అనుకోలేదు అంటున్నారు అర్ణవ్ తల్లిదండ్రులు. ‘లక్ష్మీరాణికి తగిన సంబంధం దొరికినందుకు మాకు చాలా ఆనందం కలిగింది. ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్లే జరిగింది. ఇద్దరూ సంతోషంగా, ప్రశాంత జీవితాన్ని గడపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం’’ అంటున్నారు పెద్దలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య సంబల్పూర్లోని శంకరమఠంలో వీరిరువురి వివాహం నిరాడంబరంగా జరిగింది. ‘శతమానం భవతి’ అని పలికిన దీవెనలు, వారి జీవితాల్లో సంతోషాలను పల్లవించాలని ఆశిస్తున్నారు. లక్ష్మీరాణి, మహాబీర్ ప్రసాద్ శుక్లా -
అటు దణ్ణం పెట్టుకుంటుంటే... ఇటు ...
ఏలూరు : దేవాలయం ముందు నిలబడి దేవుడికి నమస్కారం చేసుకుంటున్న భక్తురాలి మెడలో గొలుసును దుండగులు తెంచుకెళ్లారు. ఈ ఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. స్థానిక శంకరమఠం వద్ద సాయిబాబా గుడి ముందు మహిళ దండం పెట్టుకుంటుంది. అయితే అప్పటికే అక్కడ బైక్‌పై ఓ యువకుడు వేచి ఉండగా మరో యువకుడు ఆగమేఘాల మీద దూసుకొచ్చి... దండంపెట్టుకుంటున్న మహిళ మెడలోని బంగారపు గొలుసు తెంపి.. అంతే వేగంతో బైక్‌పై అక్కడి నుంచి పరారైయ్యాడు. గొలుసు లాగే సమయంలో మహిళ కిందపడటంతో... సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ విషయం గమనించిన స్థానికులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు స్థానికుల చేతికి చిక్కలేదు. బాధితురాలని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.