breaking news
Shamshabad panchayat
-
పంచాయతీగానే కొనసాగించాలి
శంషాబాద్, న్యూస్‌లైన్: శంషాబాద్‌ను పంచాయతీగానే కొనసాగించాలని శుక్రవారం నాయకులు, స్థానికులు స్పష్టం చేశారు. కాగా గ్రామసభ ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరే అయినప్పటికీ స్థానిక అధికారుల పనితీరుపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీగా మార్చడం కోసం శుక్రవారం మహిళా మండలి కార్యాలయంలో అధికారులు గ్రామసభను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఉద్దేశం కన్నా స్థానికంగా ఉన్న సమస్యలపైనే గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులు, డ్రెయినేజీలు, వీధిదీపాలు సరిగా లేవని మండిపడ్డారు. జీవో 111 ఆసరాగా తీసుకుంటున్న పంచాయతీ ఉద్యోగులు ఇళ్ల నిర్మాణాల్లో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ సిబ్బంది కేవలం కోర్టు కేసులకు పరిమితమై పోయారన్నారు. స్థానికంగా జీవో 111 సడలిస్తేనే శంషాబాద్‌ను మున్సిపాలిటీగా మార్చాలని, లేనిపక్షంలో యథాతదంగా నే కొనసాగించాలని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు కూడా వ్యక్తం చేశారు. సర్కారు తన అవసరాల కోసం జీవో 111ను సడలిస్తూ సామాన్య జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ను మున్సిపాలిటీగా మార్చినా అభ్యంతరం లేదని, ముందుగా జీవో 111ను సడలించాలని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. శంషాబాద్‌ను కచ్చితంగా మున్సిపాలిటీ చేయాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. గత పాలకవర్గంలో పంచాయతీ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. పంచాయతీలో నిధుల లేమితో సమస్యలు పెరుగుతున్నాయన్నారు. మున్సిపాలిటీగా మార్చడం లేదా గ్రామ పంచాయతీగా కొనసాగించడంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. స్థానిక సమస్యలను పరిష్కరించాలని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు తక్కువ.. నేతలు ఎక్కువ శంషాబాద్‌లో గ్రామసభ కొనసాగించే ప్రతిసారి కూడా నేతలు మాత్రమే హాజరవుతున్నారు. ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం అధికారుల తీరేనని జనం ఆరోపిస్తున్నారు. నాయకులకు సమాచారం ఇచ్చే అధికారులు గ్రామసభ గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదని ప్రజలు చెబుతున్నారు. పంచాయతీలో సుమారు నలభైవేలకు పైగా ఉన్న జనాభా ఉండగా గ్రామసభలో నేతలు మినహాయిస్తే నలభైమంది జనం కూడా లేకపోవడం గమనార్హం. శంషాబాద్పై కీలక నిర్ణయం తీసుకునే విషయమై గ్రామసభలను మొక్కుబడిగా నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఈవో రమణ,పీఏసీఎస్ చైర్మన్ కె. మహేందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు కిశోర్, వైఎస్సార్సీపీ నాయకులు అక్రమ్‌ఖాన్, శ్రీధర్, అశోక్‌యాదవ్, టీడీపీ నాయకులు డి. వెంకటేష్‌గౌడ్, జ్ఞానేశ్వర్‌యాదవ్, మల్లేష్, శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు సంజయ్యాదవ్, జి.బి సుభాష్ తదితరులు ఉన్నారు. -
శంషాబాద్ పంచాయతీకి.. ఆదాయ పన్ను శాఖ ఝలక్
శంషాబాద్, న్యూస్‌లైన్: శంషాబాద్ పంచాయతీకి ఆ దాయ పన్నుశాఖ నుంచి కష్టాలొచ్చిపడ్డాయి. ఐదేళ్లుగా పంచాయతీ ఆదా యం నుంచి ఆదాయపుపన్ను శాఖకు చెల్లించాల్సిన పన్ను బకాయిలు పేరుకుపోయాయి. మొండి బకాయిలను వసూలు చేయడంలో భాగంగా సదరు శాఖ అధికారులు పంచాయతీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. పన్ను కట్టేంతవరకూ పంచాయతీ అధికారులు ఈ ఖాతాలను వాడుకునేందుకు అవకా శం లేదు. దీంతో పంచాయతీ పరిస్థి తి అగమ్యగోచరంగా మారింది. రెండు నెలలుగా కార్మికులు, సిబ్బం దికి సంబంధించిన వేతనాలతో పాటు పంచాయతీలో చెల్లించాల్సిన వివిధ బిల్లులు నిలిచిపోయాయి. నెలరోజుల క్రితం పంచాయతీ కార్యదర్శితో పాటు ఇద్దరు బిల్కలెక్టర్లు సస్పెండ్ కావడంతో పంచాయతీలో పనులు పదిహేనురోజుల పాటు నిలిచిపోయాయి. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన వేతనాల కోసం ఇప్పటికే కార్మికులు ధర్నాకు దిగారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇన్‌కంటాక్స్ అధికారులు కూడా పంచాయతీ నుంచి సొమ్మును రాబట్టుకునేందుకు ఒత్తిడి పెంచుతుండటంతో పంచాయతీలో బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. 2007 నుంచి పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు చేపట్టిన బిల్లుల్లో ఇన్‌కంటాక్స్ సుమారు రూ.15లక్షల వరకు విడుదల కావాల్సి ఉంది. కేసుల కష్టాలు... జీవో 111 కారణంగా అనుమతులు రద్దుకావడంతో ఇప్పటికే ఆదాయం కోల్పోయిన పంచాయతీకి.. కోర్టుల చుట్టూ తిరుగుతుండడంతో కష్టాలు మరింత పెరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రారంభంలోనే నిలిపివేయాల్సిన అధికారులు ఆ సమయంలో మిన్నకుండి ఇప్పుడు వాటి అనుమతులు రద్దుచేసిన తర్వాత కష్టాలు మరింత పెరిగాయి. సుమారు నాలుగువందల వరకు ఇలా రద్దయిన అనుమతులకు సంబంధించిన లభ్ధిదారులు స్టేలు తీసుకోవడంతో వాటికి కౌంటర్లు వేయడానికి రూ.లక్షల్లో వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో పంచాయతీకి మరింత కష్టాలు ముదిరాయి. శంషాబాద్ పంచాయతీ పరిపాలన తీరు ఎప్పటికి గాడిలో పడుతుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.