మామా కోడళ్ల దారుణ హత్య
                  
	న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తూర్పు పటేల్ నగర్లో మామా కోడళ్ల దారుణ హత్య కలకలం రేపింది.  ఆదివారం  సాయంత్రం మామ, కోడలిపై దాడి చేసిన  దుండగులు  పలుసార్లు కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. అయితే  ఇంటి లోపల వేసిన గడియ వేసినట్టే వుంది.  కానీ సాయంత్రానికి ఇద్దరూ శవాలు అయ్యారు.  
	
	వివరాల్లోకి వెళితే...
	
	మృతుడు సీపీడబ్ల్యూడీలో  ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన  సేవారాం కటారియా (90) తన కొడుకు సుధీర్, కోడలు శశితో కలిసి జీవిస్తున్నారు.   రోజూలాగానే  సుధీర్ మధ్యాహం  ఒకటిన్నరకు ఉద్యోగానికి వెళ్లారు.  దాదాపు అయిదు సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పని చేస్తున్న ఆమె వచ్చి తన పని తను చేసుకొని వెళ్లిపోయింది.   
	
	విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సుధీర్, ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకూ భార్య తలుపు తలుపు తీయకపోవడంతో, మొబైల్‌కు కాల్ చేశాడు. అయినా స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన తన కుమార్తె వద్ద ఉన్న మారు తాళంతో  తలుపు తీసి చూశాడు.  ఒకవైపు గుమ్మం దగ్గర తండ్రి శవం,  మరోవైపు  మంచంపై భార్య విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి షాకైయ్యాడు. తండ్రి గొంతు కోసిన ఆనవాళ్లు, పలుమార్లు  కత్తితో దాడి చేసిన గుర్తులు చూసి బెంబేలెత్తిన సుధీర్ వెంటనే  పోలీసులకు సమాచారం అందించాడు.
	
	సంఘటనా స్థలం నుంచి రక్తపు మరకలతో ఉన్నరెండు  కత్తెరలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి  ఒంటిపై  నగలు, ఇంట్లోని  విలువైన వస్తువులు ఎక్కడివక్కడే  అలాగే వుండడంతో, ఇది దొంగల  పనికాదని, బాగా తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో  అందరూ కలసి టీ తాగిన  గుర్తుగా పడి ఉన్న ఖాళీ కప్పులు పోలీసుల అనుమానానికి మరింత బలపరుస్తున్నాయి.   తెలిసినవారే తాపీగా టీ తాగి, నమ్మించి, సేవారాం కటారియా, శశిలపై  దాడి చేసి, హత్య చేసిన అనంతరం వెనకనుంచి పారిపోయి ఉంటారని  పోలీసులు  భావిస్తున్నారు.  కేసు నమోదు చేసామని, పనిమనిషిని ప్రశ్నిస్తున్నట్లు డీసీపీ పరమాదిత్య తెలిపారు.