సర్పంచ్ అంటే ఇలా ఉండాలి
'కూతురుతో ఓ సెల్ఫీ' నినాదం దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ నినాదాన్ని తీసుకొచ్చింది సునీల్ జగ్లాన్ అనే యువకుడు. ఎమ్మెస్సీ పట్టభద్రుడు. ఆయన హర్యానాలోని బీబీనగర్ గ్రామ సర్పంచ్. 2010లో సర్పంచ్‌గా ఎన్నికైన సునీల్ అనతి కాలంలోనే ఈ గ్రామం రూపురేఖలు మార్చేశారు. దేశంలోనే అత్యుత్తమ పంచాయతీగా తీర్చిదిద్దారు. దేశంలో తొలి హైటెక్ గ్రామంగా బీబీపూర్‌కు పేరు తెచ్చారు. సునీల్ నాయకత్వంలో ఈ గ్రామ పంచాయతీ జాతీయ ఉత్తమ అవార్డు కింద కోటి రూపాయలను, రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ కింద పది లక్షల రూపాయలు, స్వశక్తీకరణ్ జవాబ్దేహి అభియాన్ పురస్కార్ కింద 15 లక్షల రూపాలయలు అందుకుంది. ఈ నిధులను గ్రామాభివృద్ధికే ఖర్చుపెట్టారు సునీల్.
హర్యానా అంటేనే ఎవరికైనా గుర్తుంచేది అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య బాగా తక్కువ. భ్రూణ హత్యలు ఎక్కువ. పరువు హత్యలు ఎక్కువ. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు సునీల్ జగ్లాన్. 2010లో సర్పంచ్‌గా పోటీచేసి గెలిచారు. కడుపులో ఉండగానే ఆడ శిశువులను పొట్టన పెట్టుకునే విష సంస్కృతికి వ్యతిరేకంగా తొలి పోరాటం ప్రారంభించారు. మహిళలను సమీకరించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. అందరి భవిష్యత్తుకు, ముఖ్యంగా ఆడ పిల్లల భవిష్యత్తుకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. బాలికల చదువును ప్రోత్సహించారు. వారికి కావాల్సిన యూనిఫారమ్‌లను పంచాయతీ ద్వారా సమకూర్చారు. గ్రామంలో ఓ గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశారు.
కేవలం గ్రామంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు దాదాపు 50 మహా పంచాయతీ సమావేశాలను సునీల్ ఏర్పాటు చేశారు. అందరితో చర్చించి మహిళల సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నారు. బడాబాబులు ఆక్రమించుకున్న పంచాయతీ భూములను తిరిగి లాక్కున్నారు. ఆ భూముల్లో బడి పిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. గ్రామ పాలనలో పూర్తి పారదర్శకతను తీసుకొచ్చారు. గ్రామం పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పంచాయతీ జమా ఖర్చులతో సహా పంచాయతీ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సమాచార హక్కుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆర్టీఐ కింద ఎవరేమి కోరినా తానే స్వయంగా వారికి ఆ వివరాలు అందచేస్తారు.
ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే సునీల్ జగ్లాన్ ఈస్థాయికి రాలేదు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే భేదం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఆయన ఏ పార్టీని పట్టించుకోడు. పంచాయతీ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమమే తన లక్ష్యమంటారు. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే 'sunilbibipur@gmail.com'కు మెయిల్ చేయొచ్చు లేదా బీబీపూర్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.