breaking news
Seethanagaram Ghat
-
సిబ్బంది ఫుల్.. సౌకర్యాలు నిల్
భోజనం లేక అస్వస్థతకు గురైన స్వీపర్ ఆసుపత్రిలో మంచాలు లేవు సీతానగరం ఘాట్ వద్ద నామమాత్రంగా వైద్యశిబిరాలు తాడేపల్లి రూరల్ : కృష్ణా పుష్కరాల్లో సేవలందించేందుకు వచ్చిన సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. అత్యవసర సదుపాయాలు లేకపోవటంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను పెద్ద ఎత్తున నియమించారు. తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్ వద్ద 3వేల మంది పోలీసులు, 2 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది, 500 మంది ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రెండు రోజుల క్రితమే ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే వీరిలో అనేక మందికి బుధవారం మధ్యాహ్నం నుంచి భోజనం అందలేదు. ఈ నేపథ్యంలో భీమడోలుకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మొండెం వెంకటేశ్వర్లు గురువారం ఉదయం విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. ఘాట్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో పరికరాలు, మందులు లేవు. ఆసుపత్రికి తరలించాలన్నా అంబులెన్స్ అందుబాటులో లేదు. వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన బంధువులు ఉండవల్లి సెంటర్ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. వాహనంలో తీసుకెళ్లే సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్ల కాలు కిందకి జారటంతో మరో గాయం తగిలింది. ఇన్ని అవస్థలు పడి పీహెచ్‌సీకి తీసుకెళితే అక్కడ బెడ్లు లేకపోవటంతో వీలైచైర్పైనే కూర్చోబెట్టి వైద్యం అందించారు. సీతానగరం ఘాట వద్ద ఏర్పాటు చేసిన రెండు వైద్యశిబిరాల్లో కనీస సౌకర్యాలు కనిపించలేదు. దీంతో వచ్చిన సిబ్బంది అట్టపెట్టెలు కింద వేసుకుని కూర్చొన్నారు. -
నాణ్యతకు పాతర
పుష్కర పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు పుష్కర తరుణం ముంచుకొస్తోంది.. భక్తజన కోటి పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగను ఒక్కసారైనా తరించాలని ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తోంది. దీనికి తగ్గట్టు ప్రభుత్వం నిధులైతే విడుదల చేసి తన పనైపోయినట్లు తూతూమంత్రంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ఎక్కడికక్కడ పనులన్నీ నీరంగా నీరసంతో నీరుగారుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారుల మామూళ్ల మత్తు.. హడావుడితో నాణ్యతకు పాతర పడుతోంది. సీతానగరం (తాడేపల్లి రూరల్): మండలంలోని సీతానగరం కృష్ణానది ఒడ్డున 450 మీటర్ల పొడవునా ఘాట్ల నిర్మాణం చేపట్టారు. రెండు నెలల నుంచి పుష్కర పనులు నత్తనడకన కొనసాగించిన కాంట్రాక్టర్లు సమయం ముంచుకొస్తుండటంతో హడావుడిగా ఘాట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ల నిర్మాణంలో కూలీలు కాకుండా యంత్రాలు పని ఎక్కువగా చేయడంతో నాణ్యత లోపం స్పష్టంగా కనబడుతోంది. అధికారులు కాంక్రీట్‌ను మిక్సింగ్ చేసేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇది కంకర, సిమెంట్, ఇసుక, కావలసిన నీటిని ఏర్పరుచుకుంటుంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ లెక్కా పత్రం లేకుండా ఇసుకను వేయడం, పరిమితికి మించి నీటిని వినియోగించటంతో ఘాట్ల నిర్మాణంలో ఆ కాంక్రీట్ నేలపై వేసినప్పుడు నీటితోపాటు సిమెంటు కూడా కొట్టుకుపోయి కంకరు, కొంత మేర ఇసుక మాత్రమే మిగులుతోంది. ఎగుడుదిగుడుగా మెట్ల నిర్మాణం.. ఘాట్లలో ఏర్పాటు చేసే మెట్లు చిన్నది, పెద్దదిగా కట్టి యాత్రికులు దిగేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. ఇలా చేస్తున్నారేంటని అధికారులు ప్రశ్నిస్తే ప్లాస్టింగ్ చేసే సమయంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తామని మాట దాటేస్తునారు. దీంతోపాటు ఘాట్ల నిర్మాణాలు చేసే సమయంలో ప్రతిఒక్క లారీలో వచ్చే సిమెంటుతో కూడిన కాంక్రీట్ మిక్సింగ్ శాంపిల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాంక్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఘాట్ల నిర్మాణాన్ని పరిశీలించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల కాసులకు తలొగ్గి మౌనం వహిస్తున్నారు. కనీసం జిల్లా అధికారులు కూడా రోజుకోసారి పరిశీలన జరుపుతున్నారే తప్ప ఘాట్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని మాత్రం ఏ ఒక్కరూ ప్రశ్నించడం లేదు. కాంక్రీట్ నిర్మాణం చేపట్టిన తర్వాత పది రోజులు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక దానిపై ఒకటి నిర్మాణం చేపడుతున్నారు. పుష్కరాల అనంతరం నిర్మించిన ఘాట్ల వద్ద పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. పుష్కర కాలంపాటు కూడా ఈ ఘాట్లు ఉండవని, ఒక్కసారి వరద వస్తే ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.