breaking news
Santiago Martin
-
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
లాటరీ కింగ్ రూ.122 కోట్ల ఆస్తుల జప్తు
చెన్నై : దేశంలో లాటరీ కింగ్ గా పేరొందిన శాంటియాగో మార్టిన్కి చెందిన రూ.122 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో లాటరీ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై అతనిపై ఆరెండు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదైనాయి. మార్టిన్ 2007లో కేరళలోని సీపీఎంకు చెందిన ఒక వార్తా పత్రికకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లు జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు మార్టిన్ ఆస్తులపై దృష్టిపెట్టి విచారించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సోమవారం మార్టిన్కు చెందిన రూ.122.4 కోట్ల విలువైన నాలుగు సంస్థల స్థిరాస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మార్టిన్ కుటుంబసభ్యుల పేరు మీద సుమారు రూ.5000వేల కోట్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గతంలోనూ మార్టిన్కు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి సుమారు వందకోట్లకు పైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మార్టిన్ పై ఇప్పటికే సిక్కింలో 4500 కోట్ల రూపాయల చీటింగ్ కేసు కూడా ఉంది.