breaking news
sangai peta
-
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి సునీతారెడ్డి
కొల్చారం, న్యూస్‌లైన్: సంగాయిపేటలో జరిగిన విషాద సంఘటన తెలుసుకున్న మంత్రి సునీతారెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుల తల్లిదండ్రుల రోదనలతో చలించిన ఆమె కన్నీరు పెట్టారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామంలో ఒకేసారి ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కుటుంబంలోని వ్యక్తి చనిపోతే బాధ ఎలా ఉంటుందో చెప్పడం ఎవరి తరం కాదన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిల్లలు లేనిలోటు ఎవరు పూడ్చలేనిదన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలోని ప్రభుత్వ అసైన్డ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీల్దార్ లావణ్యను ఆదేశించారు. జిల్లా విద్యాధికారితో చర్చించి అత్యవసర నిధులు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయ నిధి కింద రూ.20 వేలు అందజేశారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి రూ.10వేలు అందజేశారు. రోదనలు మిన్నంటాయి..ఆక్రందనలు అందరినీ కలచివేశాయి...ఎవరినీ కదిలించినా కన్నీళ్లే సమాధానమిచ్చాయి.. తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయిన పిల్లలను తలచుకుంటూ వారి తల్లిదండ్రులు గుండెలుబాదుకున్న తీరు చూసి అక్కుడున్న వారూ కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం బతుకమ్మ పూలకోసం వెళ్లి కుంటలోపడి మృతి చెందిన ఐదుగురు విద్యార్థుల అంత్యక్రియలు మంగళవారం జరగ్గా..సంగాయిపేట శోకసంద్రమైంది. భారీగా తరలివచ్చిన సమీప ప్రాంతాల ప్రజలు, సంగాయిపేట వాసులు చిన్నారుల అంతిమయాత్రలో పాల్గొని అంజలి ఘటించారు. కొనసాగిన కన్నీటి యాత్ర మృతులు ఆకుల మధు, ఆకుల సుధాకర్, బద్రి రాజు, బద్రి ప్రవీన్, బద్రి నరేష్‌లను ఖననం చేసేందుకు ఒకే ట్రాక్టర్‌పై తరలించగా సంగాయిపేట మొత్తం తరలివచ్చింది. మృతుల బంధువులు, స్నేహితులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున తరలిరావడంతో అంతిమయాత్ర జరిగిన కిలోమీటర్ మేర జనం నిండిపోయారు. మృతుల కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోదించారు. విద్యార్థుల అంతిమయాత్రలో కొల్చారం తహశీల్దార్ లావణ్య, ఎంపీడీఓ ఎల్లయ్య, మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ అరిగే రమేష్, ఆర్యవైశ్య సంఘం జిల్లా సభ్యులు ప్రభాకర్‌గుప్త, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నేతలు మదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం.. సోమవారం రాత్రికే విద్యార్థుల మృతదేహాలన్నీ కుంటలో నుంచి బయటకు తీయగా, మెదక్ డీఎస్పీ గోద్రూ, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, కొల్చారం ఎస్ఐ ప్రభాకర్‌లు మృతదేహాలను అదే రోజు రాత్రి సంగాయిపేటలోని మున్నూరు కాపు సంఘం భవనానికి చేర్చారు. మంగళవారం ఉదయం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడంతో సంగాయిపేటలో పూర్తిగా విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వారు ప్రజలు, ఆయా పార్టీల నాయకులు సంగాయిపేటకు చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల్లో నలుగురు విద్యార్థులు రంగంపేట పాఠశాలకు చెందిన వారు కావడంతో ఈ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంజలి ఘటించారు. -
జల సమాధి
కొల్చారం, న్యూస్‌లైన్: మండలంలోని సంగాయిపేట ఓ కుగ్రామం. అక్కడి కుటుంబాలు అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటాయి. సద్దుల బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆశతో.. పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చి తమ ప్రత్యేకతను చాటుకోవాలనే ఆకాంక్షతో గ్రామానికి చెందిన బద్రిరాజు (14), బద్రి ప్రవీణ్ (12), బద్రి నరేష్ (12), ఆకుల సుధాకర్ (14), ఆకుల మధు (10)లు తమ మిత్రులైన ఎంబడి నాగరాజు, పైతర నాగరాజు, తుంగని నవీన్‌లతో కలిసి గునుగు పూల కోసం ఉదయం 10 గంటలకు గ్రామ శివారులోని జొన్న చేనుల్లోకి బయల్దేరారు. పువ్వును వెతుక్కుంటూ రెండు కిలో మీటర్ల దూరం వెళ్లారు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఉక్కపోతకు గురై సమీపంలో ఉన్న కుమ్మరి కుంటలో స్నానం చేసేందుకు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో బద్రి నరేష్, ఆకుల సుధాకర్, ఆకుల మధు, బద్రిరాజు, బద్రి ప్రవీన్‌లు నీటిలో దిగుతూనే మునిగిపోయారు. ఒడ్డున ఉన్న ఎంబరి నాగరాజు, పైతర నాగరాజు, తుంగని నవీన్‌లకు విషయం అర్థమయ్యే సరికే ప్రమాదం ముంచుకొచ్చింది. వెంటనే తుంగని నవీన్ స్పందించి వారిని రక్షించేందుకు నీటిలోకి కర్రను విసిరాడు. ఆ కర్రసాయంతో మధు ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగానే దురదృష్టవశాత్తు అది విరిగి తోటి మిత్రులతో పాటు జలసమాధి అయ్యాడు. మృతులంతా విద్యార్థులే కూలీనాలి చేసుకుని కుటుంబాల్లో జన్మించిన మృతులంతా విద్యార్థులే. ఇందులో నలుగురు రంగంపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆకుల సుధాకర్ పదో తరగతి, బద్రి రాజు 9వ తరగతి, బద్రి ప్రవీణ్ 7వ తరగతి, బద్రి నరేష్ 8వ తరగతి చదువుతుండగా, ఆకుల మధు మాత్రం మెదక్‌లోని గీతా స్కూల్లో 5వ తరగతి చదువుతున్నారు. కల్లలైన ఆశలు.. కన్నీటి సంద్రమైన బతుకులు పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదివి తమ బతుకు రాత మారుస్తారనుకున్నా ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. 15 యేళ్లకే తమ బిడ్డలకు నూరేళ్ల నిండటంతో కన్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు. మృతుల కుటంబీకులంతా నిరుపేద కూలీలే. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబాల్లో ఈ విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. గంపెడు గునుగుపూలతో తిరిగి వస్తారనుకున్న కొడుకులు విగత జీవులై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక తల్లడిల్లిపోయారు. ఉదయం 10 గంటలకు వెళ్లి పిల్లలు చనిపోయారని సాయంత్రం 5.30 గంటలకు తెలియడంతో గ్రామమంతా ఉలిక్కి పడింది. ఊరంతా ఒక్కటై ఉరుకులు పరుగులతో కుమ్మరి కుంటకు చేరుకుంది. గ్రామస్తులంతా కుంటలోకి దిగి గాలించడం మొదలు పెట్టారు. ఐదు నిమిషాలకొక శవం బయట పడుతుండటంతో ఆ ప్రాంతం కన్నవారి శోకాలతో దద్దరిల్లింది. వారికి ఆక్రందనలు, అరుపులు, ఏడుపులు శోక సంద్రాన్ని తలపించాయి. ఒక్కగానొక్క ముద్దుల కొడుకు బద్రి నరేష్ గ్రామానికి చెందిన భిక్షపతి, భారతమ్మల ఒక్కగానొక్క కొడుకు బద్రి నరేష్. చక్కగా చదివించి, ఉన్నతస్థాయికి చేర్చాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కూలీనాలీ చేసుకుంటూ బతుకీడ్చే వారు తమ కొడుకును రంగంపేట ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివిస్తున్నారు. ఆడుకుంటూ వెళ్లిన కొడుకు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఆకుల మధు ఒక్కడే గ్రామానికి చెందిన ఆకుల మల్లేశం, పోచమ్మలకు ఏకైక సంతానమైన ఆకుల మధును అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మల్లేశం ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంగ్లిష్ మీడియం చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుందన్న ఆశతో మెదక్ పట్టణంలోని గీతా స్కూల్లో 5వ తరగతి చదివిస్తున్నారు. కానీ తమ ఆశలు అడియాశలు కావడంతో తల్లడిల్లిపోయారు. అందరికంటే చిన్నవాడు ఆకుల సుధాకర్ ఆకుల కిష్టయ్య, సిద్దమ్మల చిన్న కుమారుడు సుధాకర్. ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడు కావడంతో అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. రంగంపేట ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మరో ఆరు నెలలు గడిస్తే కాలేజీకి వెళ్తాడని ఆశీస్తున్న తరుణంలో కాటికి వెళ్తున్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. అన్నదమ్ముల పిల్లలు బద్రిరాజు, ప్రవీణ్ బద్రి వెంకటేశం, బద్రి నవాజ్‌లు అన్నదమ్ములు. వీరి పిల్లలే కుమ్మరి కుంట మృతులు బద్రి రాజు ప్రవీణ్‌లు. రాజు రంగంపేటలో 9వ తరగతి చదువుతుండగా, ప్రవీణ్ 7వ తరగతి చదువుతున్నాడు. కూలీ నాలి చేసుకునే తమకు భవిష్యత్‌లో కొడుకులు కొండంత ఆసరాగా ఉంటారనుకుంటే అర్ధాయష్కులయ్యారని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.