ఉత్తమ డ్రైవర్‌కు అవార్డు
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కె.దస్తగిరి ప్రమాద రహిత డ్రైవర్‌గా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన 17వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఆయనకు కేంద్ర ఉపరితల రవాణా, హైవే మంత్రిత్వ శాఖ అందజేసింది. దస్తగిరి 34 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినందుకు అవార్డును అందించింది. అలాగే రూ.25 వేల బహుమతిని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘1982లో ఆర్టీసీ డ్రైవర్‌గా విధుల్లో చేరాను. రోజూ డ్యూటీ సమయాని కంటే ముందే డిపోకు చేరుకుంటాను. నేను నడిపే బస్సు సర్వీసును గ్యారేజీలోకి వెళ్లి ఏమైనా రిపేర్లు ఉన్నాయా, కండీషన్లో ఉందా అని పరీక్షిస్తాను. బస్సుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గర ఉండి మెకానిక్‌లతో తయారు చేయించుకుంటాను. మెకానిక్‌లతో స్నేహంగా ఉంటాను. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే నా లక్ష్యం. రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు, రీజనల్ స్థాయిలో ఒక సారి, జోనల్ స్థాయిలో ఒక సారి బెస్ట్ డ్రైవర్‌గా అవార్డులను అందుకున్నాను. కేఎంపీఎల్‌లో కూడా మా డిపోలో అందరి కంటే ముందున్నాను. సంస్థకు బాగుంటేనే మేము బాగుంటాం’ అని ఆయన వివరించారు. దస్తగిరి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడం పట్ల ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ హరి హర్షం వ్యక్తం చేశారు. v