ఐ హేట్ మోహన్‌బాబు: వర్మ
'రౌడీ' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తనశైలిలో మాట్లాడారు. ఐ హేట్ మోహన్‌బాబు అంటూ ఆయన ప్రసంగం మొదలు పెట్టడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నాకెంతో ఇష్టమైన జయసుధను ‘శివరంజని’సినిమాలో కష్టాలపాలు చేశాడనే కోపంతో ద్వేషించానని వివరించారు. తన చిన్నతనంలో జయసుధ పోస్టర్ చూసి ప్రేమలో పడిపోయానని చెప్పారు. తనకెంతో నచ్చిన జయసుధని 'శివరంజని'లో సినిమాలో కష్టాలు పెట్టడమే మోహన్‌బాబుపై తన కోపానికి కారణమని వెల్లడించారు.
తాను ఆయన్ను ‘గారు’ అనకపోవడానికి కారణం ఉందన్నారు. తన జీవితంలో దొరికిన మొట్టమొదటి స్నేహితుడు అనే కారణాలతో ఆయన్ను మోహన్‌బాబుగారు అని కాకుండా మోహన్‌బాబు అంటున్నానని వర్మ వివరించారు. తన మీద నమ్మకంతో మోహన్‌బాబు 'రౌడీ' సినిమా ఒప్పుకున్నారని తెలిపారు. ‘ఈ సినిమాకి కొత్తదనం అంటే మోహన్‌బాబు యాక్టింగ్, లుక్. నేను చేసిందేమీ లేదు. ఆయన్ను ఆయన మర్చిపోయి చేశారు. నా కెరీర్లో నేను క్రియేట్ చేసిన బెస్ట్ హీరో, హీరోయిన్లు మోహన్‌బాబు, జయసుధ’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు.