breaking news
Rivers protection
-
శీఘ్రమేవ శుభ్రమస్తు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తుంది. పల్స్ ఆక్సీ మీటరు ద్వారా చెక్ చేసుకుంటూ ఆక్సిజన్ లెవెల్ తగ్గగానే ఆస్పత్రులకు పరుగు తీస్తాం. లక్షల మందికి తాగు, సాగునీరు అందించే గోదావరిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నా ఎవరూ ఉలకరు పలకరు. కాలుష్యంతో కూడిన వ్యర్థాలు మురుగు కాలువల ద్వారా గోదావరిలో కలిసిపోతున్నా పట్టించుకోరు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న గోదారమ్మను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నదిలో నీటి నాణ్యత అథమ స్థాయి డి–గ్రేడ్‌కు (చేపలు, జంతువులకు మాత్రమే పని చేస్తుంది) పడిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర జలసంఘం నిర్ధారించింది. గోదావరి ప్రక్షాళనకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుంటే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఐదేళ్ల క్రితమే స్పష్టం చేసింది. ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ ఈ పావన నది ప్రక్షాళనకు ‘నమామి గోదావరి’ పేరిట కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకు చేసిన ప్రతిపాదనలకు ఇటీవల కేంద్ర ఆమోదం లభించింది. గోదావరి జన్మస్థలి నాసిక్ నుంచి చివరన రాజమహేంద్రవరం వరకూ నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.1,700.84 కోట్లతో ప్రతిపాదించింది. ఇందులో ‘నమామి గోదావరి’ పేరిట తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నదిలో జల కాలుష్య కట్టడికి రూ.400 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.87 కోట్లు ఇప్పటికే కేటాయించింది. కార్యాచరణ మొదలు కావాల్సి ఉంది. కాలుష్యమిలా.. దేశవ్యాప్తంగా 351 నదుల్లో జల కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఆ నదుల జాబితాలో మన గోదావరి కూడా ఉంది. గోదావరి జలాల కాలుష్యంపై 2018లో ఎన్జీటీలో కేసు కూడా నమోదైంది. రాజమహేంద్రవరం నుంచి కోనసీమలోని సముద్ర మొగ వరకూ అడుగడుగునా గోదావరి కలుషితమవుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన రాజమహేంద్రవరంలో 5 లక్షల జనాభా ఉంది. ఈ నగరంలోని ఇళ్లల్లో వినియోగించిన నీరు, కాలువల్లో మురుగు కలిసి రోజుకు 60 మిలియన్ లీటర్లు (60 ఎంఎల్డీ) వస్తోంది. ఇందులో రోజూ 30 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే హుకుంపేట వద్ద మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ – ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసి గోదావరిలో విడిచి పెడుతున్నారు. మూడు ప్రధాన కాలువల ద్వారా గోదావరికి మురుగు నీరు వచ్చి చేరుతుంది. నల్లా చానల్: లోతట్టు ప్రాంతంగా ఉన్న రాజమహేంద్రవంలో వర్షాకాలంలో వచ్చే నీటిని పైపులైన్ల ద్వారా గోదావరిలోకి తోడేందుకు నల్లా చానల్ ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఈ పైపులైన్ ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. ఆవ డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా మురుగునీటిని ధవళేశ్వరం వద్ద గోదావరిలో విడిచిపెడుతున్నారు. మల్లయ్యపేట డ్రెయిన్: ఈ డ్రెయిన్ ద్వారా పేపర్ మిల్లు ప్రాంతంలో మురుగు నీటిని గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి ప్రక్షాళనకు చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం వద్ద మూడు కాలువల ద్వారా మురుగునీరు చేరుతోంది. రాజమహేంద్రవరంలో రోజుకు 60 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో చేరుతోంది. ఇందులో సగం మాత్రమే శుద్ధి చేసి విడిచిపెడుతున్నారు. మిగిలిన మురుగునీటిని కూడా శుద్ధి చేసే ప్రణాళిక సిద్ధమవుతోంది. నదీ కాలుష్యాన్ని నివారించగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. – ఎన్.అశోక్‌కుమార్, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ కలవరం కాలుష్య నియంత్ర మండలి కాకినాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ప్రతి నెలా గోదావరిలోకి మూడు కాలువల ద్వారా కలుస్తున్న మురుగు నీటి నమూనాలను లేబొరేటరీలో పరీక్షిస్తుంటే వస్తున్న ఫలితాలు కలవరపెడుతున్నాయి. మూడు శాతం ఉండాల్సిన బయో కెమికల్ ఆక్సిజన్ 70 శాతం నమోదవడం కాలుష్య తీవ్రతను చాటుతోంది. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) ఆధారంగా నీటి నాణ్యతను లెక్కిస్తారు. డీఓ పరిమాణం లీటరుకు కనీసం నాలుగు మిల్లీ గ్రాములుండాలి. బీఓడీ మూడు మిల్లీ గ్రాములు దాటకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ గోదావరిలో నాలుగు నుంచి తొమ్మిది శాతం వరకూ ఉందని గుర్తించారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో 50 పరిశ్రమలున్నాయి. వీటిల్లో కొన్ని పరిశ్రమల వ్యర్థాలు గోదావరి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇదిగో సాక్ష్యం గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకూ గోదావరి జలకాలుష్యంపై లేబొరేటరీ నివేదికలు. నల్లా చానల్: బీఓడీ కనిష్టంగా 52, గరిష్టంగా 94 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 71.83గా తేలింది. ఆవ డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 44, గరిష్టంగా 82 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 66.33గా గుర్తించారు. మల్లయ్యపేట డ్రెయిన్: బీఓడీ కనిష్టంగా 50, గరిష్టంగా 114 నమోదవ్వగా సరాసరి కాలుష్యం 78.33గా నమోదైంది. -
నదుల పరిరక్షణ సమిష్టి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: నదులను పరిరక్షించుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనానికి శక్తిమంతమైన జాతీయ ప్రచార ఆవశ్యకతకు పిలుపునిచ్చారు. ఎనిమిది రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు ‘ఫరెవర్ గువాహటి’సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) విడుదల చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుదలతో నదులు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయన్నారు. ఆధునికీకరణ అన్వేషణలో అత్యాశతో మనిషి సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అనంతరం ఫేస్బుక్ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి... బ్రహ్మపుత్ర నదిని సందర్శించిన మరుపురాన్ని అనుభవాలను వివరించారు. బ్రహ్మపుత్ర సహజ నదీ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ని చేసిందని, అద్భుతమైన నదీతీర ఉద్యానవనం సంతోషాన్ని, మరచిపోలేని జ్ఞాపకాలను పంచిందని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి అందిస్తున్న బ్రహ్మపుత్ర ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతుల్లో భాగమని వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతరం, అస్సాం రాష్ట్ర కేన్సర్ ఇన్స్టిట్యూట్లో పీఈటీ–ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రారంభించారు.అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్ కేన్సర్ కేర్ మోడల్‌ను అభినందించారు. -
నదుల రక్షణకు శ్రీకారం చుట్టింది మేమే
- ‘ర్యాలీ ఫర్ రివర్స్’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు - నదుల రక్షణకు జాతీయ విధానం అవసరం : జగ్గీ వాసుదేవ్ - నదుల పక్కన నిర్మాణాలు సరికాదు : రాజేంద్రసింగ్ సాక్షి, అమరావతి: దేశంలో నదుల రక్షణకు శ్రీకారం చుట్టింది తామేనని, దీనికి ఒక విధానాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. నదుల అనుసంధానం తాత్కాలికమని, నదుల పునరుజ్జీవం శాశ్వతమైన పరిష్కారమని తెలిపారు. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో జగ్గీవాసుదేవ్ ప్రారంభించిన యాత్ర విజయవాడ చేరుకున్న సందర్భంగా బుధవారం పీబీ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1995లో తాను నదుల పునరుజ్జీవం, జలసంరక్షణ కోసం రాజేంద్రసింగ్‌తో కలసి పని చేశానన్నారు. నదులకు ఇరువైపులా చెట్లు పెంచాలి నదుల రక్షణకు జాతీయ విధానం అవసరమని, ఇందుకు ఒక చట్టం చేయాల్సి ఉందని జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది సహా దేశంలోని పలు ప్రధాన నదులు రాబోయే 25 ఏళ్లలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. కావేరి నదితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తనకు 17 సంవత్సరాలు వచ్చేవరకూ అందులో ఈత కొట్టానన్నారు. కావేరి నదిని తానొక జలవనరుగానే చూడటం లేదని.. అందులోనే తాను జీవితాన్ని చూశానన్నారు. 25 ఏళ్లుగా కావేరి సహా అన్ని ప్రధాన నదులు శుష్కించి, ఎండిపోవటం కళ్లారా చూశానని.. ఏడెనిమిదేళ్లుగా ఈ ప్రమాదం మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2030 తర్వాత అనేక ప్రధాన నదులు సీజనల్ నదులుగా మారే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. నదులను పరిరక్షించాలంటే వాటికిరువైపులా ప్రభుత్వ, రైతుల భూముల్లో వనాలు, చెట్లు పెంచాలన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ నదులను నాశనం చేసే మనమే వాటి పునరుజ్జీవానికి కృషి చేయాల్సి ఉందన్నారు. నదుల పక్కన కట్టడాలు సరికాదని స్పష్టం చేశారు.