‘రవీంద్ర నీ ఎవిడే’ మూవీ రివ్యూ : భార్యపై అనుమానం.. నవ్వు గ్యారెంటీ!
నేటి సమాజంలో నమ్మకమనేది దూరంగా ఉన్న స్నేహితుడిలాంటిదైతే, అనుమానమనేది దగ్గరగా ఉన్న శతృవులాంటిది. ఎందుకంటే అనుమానం వస్తే పోదు, నమ్మకం అంత తేలిగ్గా రాదు. ఇదే నేపధ్యంలో వచ్చిన సూపర్ కామెడీ సినిమా రవీంద్ర నీ ఎవిడే అంటే రవీంద్ర నీ వెక్కడ అని అర్ధం. ఇదో మళయాళ సినిమా కాని తెలుగు లోనూ జియో హాట్ స్టార్ వేదికగా లభ్యమవుతోంది.మందు చెప్పినట్టు ఈ సినిమా మొత్తం అనుమానం మీదే నడుస్తుంది.ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ సినిమా కథాంశానికొస్తే కథానాయకుడు రవీంద్రన్ వాతావరణ శాఖలో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. రవీంద్రన్ కి ఓ భార్య, కూతురు. చిన్న కుటుంబం, చింతలేని ఆనందం అని అనుకుంటున్న తరుణంలో రవీంద్రన్ కి అనుకోకుండా తన భార్య మీద ఓ అనుమానం వస్తుంది. తన భార్య ఇంకెవరితోనో సంబంధం పెట్టుకుందని భావిస్తాడు రవీంద్రన్. తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఓ సారి ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనే ఓ మారుమూల గదిలో ఉండిపోతాడు. కాకపోతే ఆ గదిలో ఎవరూ లేరని భార్య జాన్ కుట్టీ తాళం వేసి తమ అమ్మవాళ్ళ ఊరు వెళిపోతుంది. ఇక అక్కడి నుండి కథ మొదలవుతుంది. రవీంద్రన్ భార్య తమ అమ్మవాళ్ళ దగ్గర నుండి ఫోన్ చేసినా రవీంద్రన్ ఎత్తకపోయేసరికి భయం వేసి తన భర్త కనిపించట్లేదని కంగారు పడుతుంది. ఇంతలో ఊళ్ళో ఇదో పెద్ద న్యూస్ అయి మొత్తం హాట్ టాపిక్ గా మారిపోతుంది.మరి రవీంద్రన్ ఆ గది నుండి బయటకు వస్తాడా, తనకు భార్య మీదున్న అనుమానాన్ని నివృత్తి చేసుకుంటాడా లేదా అన్నది మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న రవీంద్ర నీ ఎవిడే సినిమాలోనే చూడాలి. కృష్ట పూజాపుర అందించిన ఈ కథకు మనోజ్ పాలోడన్ దర్శకత్వం వహించాడు. అనూప్ మీనన్, థ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుందనే చెప్పాలి. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.