Rangareddy district school games
-
నేడు, రేపు టెన్నిస్ పోటీలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్‌లో భాగంగా శుక్ర, శనివారాల్లో లాన్ టెన్నిస్ పోటీలు జరుగుతాయి. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు అండర్-14, 17 స్కూల్ విద్యార్థులు మాత్రమే అర్హులని ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రమేశ్ రెడ్డి తెలిపారు. అనంతరం 8న షటిల్ బ్యాడ్మింటన్, 10, 11 తేదీల్లో స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తిగల బాలబాలికలు తమ పాఠశాల నుంచి బోనఫైడ్, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి. వివరాలకు 93469-84505 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు. 28న చెస్ టోర్నీ వన్గోల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 28న అండర్-14 చెస్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. మణికొండలోని అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తామని టోర్నీ ఆర్గనైజర్ ఇనగంటి జ్యోతిగణేష్ తెలిపారు. మరిన్ని వివరాలకు 93472-13806 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు. -
19 నుంచి జాతీయ స్కూల్స్ ఆర్చరీ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ ఈనెల 19 నుంచి 23 వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఆర్‌ఆర్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ పోటీలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు, 200 మంది క్రీడాధికారులు పాల్గొంటారని ఆర్‌ఆర్‌డీఎస్‌జీఎఫ్ నిర్వహణ కార్యదర్శి ఎం.చంద్రశేఖర్‌రెడ్డి న్యూస్‌లైన్‌కు తెలిపారు. క్రీడాకారులకు అసౌకర్యం కలిగించకుండా రంగారెడ్డి జిల్లా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించేందుకు విజయవాడలోని ఆర్చరీ అకాడమీ నుంచి క్రీడా సామగ్రిని తెప్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ టోర్నీ నిర్వహణకు జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) తరఫున ఆర్చరీ అఫీషియల్స్‌తోపాటు రాష్ట్రంలోని ఆర్చరీ కోచ్‌ల సేవలను వినియోగించకోనున్నట్లు చెప్పారు. గచ్చిబౌలి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో క్రీడాకారుల వసతి సౌకర్యాన్ని కల్పించినట్లు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.