breaking news
Raja pakse
-
లంకకు స్నేహహస్తం
‘నేను రణిల్ విక్రమసింఘేను... రణిల్ రాజపక్సను కాదు’ అన్నారు శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే భారత్ పర్యటనకొచ్చేముందు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావొస్తుండగా తన తొలి విదేశీ పర్యటనకు ఆయన మన దేశాన్నే ఎంచుకున్నారు. సందర్భం ఏమైనా కావొచ్చుగానీ, రణిల్ అలా వ్యాఖ్యానించక తప్పని పరిస్థితులైతే శ్రీలంకలో ఈనాటికీ ఉన్నాయి. రణిల్‌ను ఇప్పటికీ రాజపక్స ప్రతినిధిగానే చాలామంది పరిగణిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటి, ఎక్కడా అప్పుపుట్టని స్థితి ఏర్పడిన పర్యవసానంగా నిరుడు జనాగ్రహం కట్టలు తెంచుకుని అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో ఐఎంఎఫ్ 290 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించాక దేశం కాస్త కుదుటపడిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, అధిక ధరలు పీడిస్తున్నాయి. సుమారు 68 శాతం మంది జనాభా అర్ధాకలితో గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విక్రమసింఘే భారత పర్యటనకొచ్చారు. ఆపత్స మయాల్లో ఆదుకోవటం నిజమైన మిత్ర ధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఆహారం, మందులు, ఇంధనంతో సహా మానవతా సాయం కింద మన దేశం రణిల్ ఏలుబడి మొదలయ్యాక 400 కోట్ల డాలర్ల సహాయం అందించింది. ఆ తర్వాతే ఐఎంఎఫ్ రుణం మంజూరైంది. శ్రీలంక దాదాపు 8,300 కోట్ల డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోగా, అందులో సగం విదేశీ రుణాలే. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండటం లంకకు వరం. మన దేశం నుంచి ఎప్పటినుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు పదిహేనేళ్ల క్రితం చైనా స్నేహ హస్తం అందించటంలోని మర్మం అదే. ఎల్టీటీఈని ఎదుర్కొనడానికి కావాల్సిన 370 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు, ఎఫ్ 7 జెట్ ఫైటర్లు, విమాన విధ్వంసక తుపాకులు, జేవై–11 రాడార్ ఇవ్వటంతో లంక, చైనాల మధ్య అనుబంధం పెరిగింది. ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు తలుపులు బార్లా తెరిచారు. నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటినుంచి కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70 శాతం ప్రాజెక్టులు చైనావే. ఒక్క హంబన్ టోటా నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా 3 కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. సింగపూర్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న హంబన్‌టోటా నౌకాశ్రయం పడకేసింది. దాన్ని నిర్వహించటం చేతకాక 99 ఏళ్లపాటు చైనాకు ధారాదత్తం చేయడానికి లంక అంగీకరించాల్సివచ్చింది. ఏమైతేనేం శ్రీలంక విదేశీ రుణాల్లో 10 శాతం చైనావే. కానీ నిరుడు ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఒక లెక్క ప్రకారం 2025 వరకూ శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించాల్సిన స్థితిలో పడింది. గత ఏణ్ణర్ధంగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది. లంకనుంచి తేయాకు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి గణనీయంగా నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచీ, ఐఎంఎఫ్ నుంచీ అందు తున్న సాయం లంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది. భారత్ నుంచి వెళ్తున్న టూరిస్టుల కారణంగా లంక పర్యాటకం పుంజుకుంటున్నదనీ, దాని విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయనీ శుక్రవారం మన విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అనడంలో అతిశయోక్తి లేదు. మన ఇతిహాసం రామాయణం లంకతో ముడిపడి వుంటుంది. అలాగే బౌద్ధానికి సంబంధించి అనేక చారిత్రక ప్రదేశాలు అక్కడున్నాయి. ఇవన్నీ ఇక్కడినుంచి వెళ్లే యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ నిరంతర విద్యుత్ కోతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని కుంగ దీస్తున్నాయి. కనీసం జెనరేటర్లతో నడిపిద్దామన్నా ఇంధన కొరత పీడిస్తోంది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 52 శాతం. పరిశ్రమల్లో వీటి వాటా 75 శాతం. ఉపాధి కల్పనలోనూ దీనిదే ఆధిక్యత. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం శ్రీలంకకు పైప్ లైన్ నిర్మించే అంశాన్ని అధ్యయనం చేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవటం,ఇంధనం, ఆర్థిక, డిజిటల్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం తదితర అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రణిల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇరు దేశాల మధ్యా సమస్యలు లేకపోలేదు. లంక ఉత్తర తీరంలోని తమిళ జాలర్ల జీవనానికి భారత్ నుంచి వచ్చే చేపల బోట్లు గండికొడుతున్నాయని లంక ఆరోపిస్తోంది. సరిగ్గా మన ఆరోపణ కూడా ఇలాంటిదే. తమ సాగర జలాల పరిధిలో చేపలు పడుతున్నారన్న సాకుతో తరచు లంక నావికాదళం తమిళ జాలర్లను నిర్బంధిస్తోందనీ, గత రెండేళ్లుగా 619 మంది జాలర్లు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారనీ తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మన దేశం అప్పగించిన కచ్చాతీవు దీవిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇక లంక తమిళులకు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసించే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలనీ, స్వయంపాలనకు అవకాశమీయాలనీ, వారు గౌరవప్రదంగా జీవించటానికి తోడ్పడాలనీ మన దేశం అడుగుతోంది. రణిల్ తాజా పర్యటన ఇలాంటి సమస్యల పరిష్కారానికి దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ భవిష్యత్తులో మరింత పటిష్టమవుతాయి. -
ప్రధాని కాని ప్రధాని..రాజపక్స
హిజ్ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన చేసిన పని తప్పా ఒప్పా అని డిసెంబర్ ఏడున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఆ లోపే హిజ్ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన తనకు తనే తీర్పు ఇచ్చుకునేలా ఉన్నాడు.. తను చేసింది తప్పేనని! ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలి! పార్లమెంట్‌ని డిజాల్వ్ చేశాడు. బాగుంది. తనిచ్చిన డిజాల్వ్ ఆర్డర్ మీద తను నిలబడాలి కదా. కోర్టువాళ్లొచ్చి తన ఆర్డర్ కాగితాలను చింపేసి వెళ్లకముందే తనే వాటిని చింపేస్తే ఆ కాగితం ముక్కల్ని పడేయడానికి ‘మన దగ్గర డస్ట్‌బిన్ ఉందా’ అని ప్రెసిడెంట్స్ హౌస్‌లో ఎవర్నో పట్టుకుని అడిగాడట! అక్కడివాళ్లెవరో ఇక్కడికొచ్చినప్పుడు చెప్పారు. పదేళ్లు ప్రెసిడెంట్‌గా ఉన్నాను. రెండేళ్లు ప్రధానిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంత వీక్‌గా లేను. మైత్రిపాల వచ్చి తన ప్రెసిడెంట్ పోస్ట్నీ, తనే పిలిచి నాకిచ్చిన ప్రధాని పోస్ట్నీ.. రెండిటినీ వీక్ చేసి పడేశాడు. శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం అని దేశాలన్నీ రోజూ ఉదయాన్నే పేపర్లలో చదివి నివ్వెరపోతూ ఉండి ఉంటాయి.. ‘ఎల్టీటీఈ’నే లేకుండా చేసిన సివిల్ వార్ హీరో రాజపక్స ఇంకా బతికే ఉండగా శ్రీలంకలో సంక్షోభం ఏమిటి!’ అని. మైత్రిపాలకేం.. తను బాగానే ఉన్నాడు. నాకే తలవంపులు. సంక్షోభాలు వస్తూనే ఉంటాయి.. వాటిని సంక్షేమాలుగా మార్చుకోవాలి గానీ, వెళ్లి కన్ఫెషన్ బాక్స్‌లో నిలబడతాను అనడం రాజనీతిజ్ఞతేనా? రాజకీయ సంక్షోభాల కంటే క్లిష్టమైనవా రాజ్యాంగ సంక్షోభాలు?! ‘తప్పు చేశాను, నా గెజిట్‌ను నేను రద్దు చేసుకుంటాను. తప్పు చేశాను, నేను నీకిచ్చిన షేక్‌హ్యాండ్‌ను వెనక్కు తీసుకుంటాను..’ అంటారా గ్రేట్ లీడర్ ఎవరైనా! పార్లమెంట్లో నన్నెవరూ సపోర్ట్ చెయ్యడం లేదు. అయినా నేను వెళ్లి రోజూ పార్లమెంటులో కూర్చొని రావడం లేదా? విక్రమసింఘే రోజూ వచ్చి నన్ను ప్రధాని సీట్లోంచి తోసేసి తను కూర్చుంటున్నాడు. నేనేమైనా హర్ట్ అవుతున్నానా! అతడినే హర్ట్ చేసి మళ్లీ నా సీట్లో నేను కూర్చోవడం లేదా?! ‘‘నేను ప్రధానిని. లెయ్ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాడు సింఘే. ‘‘నేనూ ప్రధానినే. నన్నెందుకు లేపుతున్నావ్ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాను. ‘‘నేను ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని. నువ్వు ప్రెసిడెంట్ ఎన్నుకున్న ప్రధానివి’’ అంటాడు. పార్లమెంటులో జనాన్ని పోగేసి ఒక్క నెలలోనే రెండుసార్లు నా మీద అవిశ్వాసం పెట్టించాడు. ‘‘చూశావ్ కదా. నేనే ప్రధానిని. నువ్వు కాదు’’ అన్నాడు. ఆ రెండుసార్లూ నేనేమైనా ప్రధాని సీట్లోంచి పరాజితుడిలా లేచి వెళ్లానా? ‘‘టీవీలో రోజూ నన్ను చూస్తూనే ఉన్నారు కదా మైత్రిపాలా.. మీరేమీ ఇన్స్పైర్ కావడం లేదా?’’ అని ఫోన్ చేసి అడిగాను. ‘‘ఇన్స్పైర్ అయ్యే మూడ్‌లో లేను’’ అన్నాడు! ‘‘ఇన్స్పిరేషన్కి మూడ్‌తో పనేంటి మిస్టర్ ప్రెసిడెంట్? మూడ్ రావడానికే కదా ఇన్స్పిరేషన్ ఉండాలి’’ అన్నాను. ‘‘మూడ్ వల్ల ఇన్స్పిరేషన్ వస్తుందా, ఇన్స్పిరేషన్ వల్ల మూడ్ వస్తుందా అని ఆలోచించే మూడ్ కూడా లేదు రాజపక్సా..’’ అన్నాడు. ‘‘మరేం ఆలోచించే మూడ్‌లో ఉన్నారు?’’ అని అడిగాను. ‘‘దేశాధ్యక్షుడనే మనిషి కంపల్సరీగా ఏదో ఒకటి ఆలోచించే మూడ్‌లో ఉండాల్సిందేనా రాజపక్సా’’ అన్నాడు! ఆయన పక్కనుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘రాజపక్స ఎలాగూ కోర్టు మాట వినడు. కోర్టు కన్నా ముందే మీరు మీ ఆర్డర్‌ని డిజాల్వ్ చేసుకుని.. మైత్రిపాల చెప్పినా రాజపక్స వినలేదని అనిపించుకోవడం ఎందుకు?’’ అంటున్నారెవరో.. తెలివైనవాళ్లు. మాధవ్ శింగరాజు -
లంక అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు పోలింగ్
కొలంబో: శ్రీ లంక అధ్యక్ష ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రస్తుత అధ్యక్షుడు మహీం రాజపక్స వరుసగా మూడోసారి అధ్యక్షుడవుతారా? లేక ఆయనకు ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష పగ్గాలు చేపడతారా? అన్నది శుక్రవారం తేలనుంది. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం ఓటింగ్ నమోదవడం విశేషం. మెజారిటీ సింహళ ఓటర్లు ఈ ఇరువురు అభ్యర్థులకు సమానంగా మద్దతిస్తున్న నేపథ్యంలో.. తమిళుల, ముస్లింల ఓట్లు ఫలితంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 65% నుంచి 70% పోలింగ్ నమోదయినట్లు అధికారుల అంచనా. ఈ ఎన్నికల్లో రాజపక్సకు సిరిసేన గట్టి పోటీ ఇచ్చారు. సిరిసేన గెలిస్తే దేశంలో రాజకీయంగా పెనుమార్పులకు అది శ్రీకారమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలేవీ జరగలేదని అధికారులు పేర్కొనగా, కొన్ని చోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాచారం. పోటీలో 19 మంది ఉన్నప్పటికీ.. ప్రధానంగా పోటీ రాజపక్స, సిరిసేనల మధ్యే ఉంది. విజయంపై ఇరువురు నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.