breaking news
primary health
-
వేసవిలోనే.. వ్యాధుల పంజా
గిరిజనుల ఆరోగ్యంపై సర్కారు ఉదాసీనత ఏజెన్సీలో విజృంభిస్తున్న విషజ్వరాలు 922 మలేరియా కేసుల కు 900 గిరిసీమలోనే.. రుగ్మతల నివారణకు కానరాని చర్యలు నాలుగేళ్లుగా పంపిణీ కాని దోమతెరలు దోమలమందు పిచికారీ అంతంత మాత్రమే.. లేళ్లపై పంజాలు విసురుతున్న పులుల్లా.. ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో గిరిజనులపై వేసవిలోనే విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అయినా మందపు చర్మంపై దోమ కుట్టిన మాదిరి ప్రభుత్వం చలించడం లేదు. విషజ్వరాలకు మూలమైన దోమల నివారణకు తగు చర్యలు చేపట్టకుండా ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. దోమల మందు పిచికారీ, సకాలంలో దోమతెరల పంపిణీ చేయకుండా వనసీమవాసుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత పెరిగే ముప్పు ఉంది. నెల్లిపాక:జిల్లాలోని 119 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 26 ఏజెన్సీ పరిధిలోనే ఉన్నాయి. వీటితో పాటు ఒక ఏరియా ఆసుపత్రి, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా సుమారు 1,050 గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించాలనేది లక్ష్యం. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు జిల్లా మలేరియా శాఖాధికారి కార్యాలయంతో పాటు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కూడా రంపచోడవరంలోనే ఉన్నారు. ఇంత యంత్రాంగం ఉన్నా ఏటా వర్షాకాలం మొదలు చలికాలం వెళ్లేంత వరకూ సీజనల్ వ్యాధులు ఏజెన్సీని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ మలేరియా కేసుల నమోదులో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. దాని తర్వాత ఏజెన్సీలో ఏడుగురాళ్లపల్లి, కూటూరు, జీడిగుప్ప పీహెచ్సీల్లో మలే రియా కేసులు ఎక్కువగా నమోదవుతాయి. ఈఏడాది జనవరి నుంచిమార్చి వరకు జిల్లా వ్యాప్తంగా 922 మలేరియా కేసులు నమోదు కాగా వాటిలో ఏజెన్సీలోనే సుమారు 900 కేసులు గుర్తించినట్లు అధికారులు చెపుతున్నారు. ఎటపాక డివిజన్లో చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, కూనవరం మండలంలోని కూటూరు, వీఆర్పురం మండలంలోని జీడిగుప్ప, వై.రామవరం మండలంలోని మంగంపాడు, చేడుదిబ్బల, వై.రామవరం పీహెచ్సీల పరిధిలోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పారిశుధ్యలేమీ, కలుషిత జలాలే కారణం.. ఏజెన్సీలో విషజ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలటానికి ప్రధానకారణం గ్రామాల్లో పారిశుధ్యలోపంతో దోమలు పెరగటం, కలుషిత నీరు తాగటం. నలత చేసిన గిరిజనులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడిన సంఘటనలు అనేకం. ఎటపాక డివిజన్లో సుమారు 30 వలస ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. పలు గ్రామాల ప్రజలకు రక్షిత మంచినీరు లేక వాగులు, వంకల్లోని చెలమనీటినే తాగుతున్నారు. ఆ నీరు కలుషితం కావటంతో విషజ్వరాలు, డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. వీఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని పలు ఆదివాసీ గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. వ్యాధులు వస్తే సకాలంలో ప్రభుత్వాస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవటం గిరిజనులకు శాపంగా మారింది. తులసిపాక పీహెచ్సీ పరిధిలోని నేలకోట,దబ్బగూడెం, గొందిగూడెం, వేములరాయి, చవులూరు, ఎర్రగొండపాకల, చదలవాడ, ఏరువాడ, మిట్టవాడ, గవల్లకోట, ఎటపాక మండలం గౌరిదేవిపేట, లక్ష్మీపురం పీహెచ్సీ పరిధిలోని సంగంపాడు, కామన్తోగు, జగ్గవరం, గొల్లగుప్ప తదితర గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే వాగులు, వంకలు వరదనీటితో పొంగటంతో ఆయాగ్రామాల ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కొరవడ్డ ముందస్తు చర్యలు వర్షాకాలానికి ముందే విషజ్వరాలు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. వందలాది గిరిజన గ్రామాలకు రక్షిత మంచినీరు, రహదారి సౌకర్యం లేదు. పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. 2012 నుంచి ఇప్పటి వరకు దోమతెరలు పంపిణీ చేయలేదు. దోమల మందు పిచికారీ కూడా తూతూ మంత్రంగా జరుగుతోంది. గత ఏడాది చివర్లో వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విలీన మండలాల్లో పర్యటించి ఏజెన్సీలో మెరుగైన వైద్యం అందిస్తామని, చింతూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు నేటికీ ఆచరణలోకి రాలేదు. దోమతెరల పంపిణీకి చర్యలు.. ఎటపాక డివిజన్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయని జిల్లా మలేరియా అధికారి ప్రసాద్ అంగీకరించారు. దోమతెరల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఏప్రిల్ 15 నుంచి 26 పీహెచ్సీల పరిధిలోని 935 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు మొదలు పెడతామని చెప్పారు. -
మృత్యు ఘంటికలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ 100 మంది మృతి గత డిసెంబర్లో పెద్దాసుపత్రుల్లో 4 వేల మంది వరకూ మృతి వెంటిలేటర్లు, ఐసీయూ, వైద్యులూ అన్నీ కొరతే స్వైన్ఫ్లూ బాధితులకూ వెంటిలేటర్లు లేని పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఇక పేద రోగులకు దిక్కెవరు? పెద్దాసుపత్రుల్లోనే వసతులు లేకపోతే ప్రాథమిక వైద్యం మాటేమిటి? ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక, మందులు కూడా కొనలేని పరిస్థితిలో..ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్న పేద రోగులు మృత్యువాత పడుతున్నారు. సరాసరిన రోజూ ప్రభుత్వాసుపత్రుల్లో వందమందికి పైగా ఇన్పేషెంటు రోగులు మృతి చెందటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. డాక్టర్లకు స్టెతస్కోపులూ లేవు.. ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నారు కదా.. చెప్పినట్టు వింటారని పేద రోగుల పట్ల వైద్యులు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారు. కనీసం రోగి ఏ పరిస్థితిలో వచ్చాడన్నది కూడా చూడకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పేద రోగుల ఊపిరి ఆగిపోయే సన్నివేశాలు పెద్దాసుపత్రుల్లో నిత్యకృత్యంగా మారాయి. నడవ లేనిస్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్, ట్రాలీలు కనిపించవు. డాక్టరుకు స్టెతస్కోపూ అందించలేని దుస్థితిలో ఆస్పత్రులున్నాయి. ఎక్కడ చూసినా విరిగిపోయిన మంచాలు, దుర్వాసన వెదజల్లే పరుపులు దర్శనమిచ్చే పెద్దాసుపత్రులకు వస్తున్న రోగుల ఆశలు అడియాసలవుతున్నాయి. రాష్ట్రంలో వేళ్లమీద లెక్కించే పెద్దాసుపత్రులే ఉన్నా వసతులు మాత్రం సున్నా. చివరకు స్వైన్ఫ్లూ బాధితులకు కూడా వెంటిలేటర్లు అందించలేని పరిస్థితి నెలకొంది. నెలలో 4 వేల మంది మృతులు రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో సరాసరిన రోజుకు 100 మంది వరకు రోగులు చనిపోతున్నట్లు నిర్ధారణ అయింది. ఒక నెలలో సుమారు 45 వేల మంది ఇన్పేషెంట్లుగా చేరుతుండగా అందులో 4 వేల మంది ప్రాణాలు వదులుతున్నారంటే సుమారు 9 నుంచి 10 శాతం మంది ఇన్పేషెంట్లు చనిపోతున్నట్టు లెక్క. ఇందులో ఎక్కువగా ప్రమాద బాధితులు, హృద్రోగ, నరాల జబ్బుల బాధితులు, విష జ్వరాలతో బాధపడుతున్నవారు, కాలేయ జబ్బు బాధితులు, కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్న వారూ ఎక్కువగానే ఉన్నారు. ఏటా వేల మందిని కాటేస్తున్న క్యాన్సర్ పెద్దాసుపత్రుల్లో ఇన్పేషెంట్లుగా చేరుతున్న వారు పెద్ద ఎత్తున చనిపోతుండగా క్యాన్సర్ మరణాలు వేరేగా నమోదవుతున్నాయి. ఏపీలో ఒక్క క్యాన్సర్ ఆస్పత్రీ లేకపోవటంతో బాధితులంతా వైద్యం కోసం హైదరాబాద్ రావాల్సిందే. దీని వల్ల రాష్ట్రంలోని పెద్దాసుపత్రుల్లో క్యాన్సర్ మృతు లు నమోదు కావడం లేదు. క్యాన్సర్ మృతులు ఏపీలో నెలకు 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా 8 వేల మందిని క్యాన్సర్ కబళిస్తున్నట్లు తెలుస్తోంది.